ఇరాన్ యుద్ధం రోజుకో మలుపు తిరగటం. తమకు ఎంత డ్యామేజ్ జరిగినా శత్రువును నాశనం చేసే వరకూ వెనక్కు తగ్గం అంటూ ఇరాన్ ముందుకెళ్లటంతో అమెరికాకు ఏం చేయాలో పాలుపోవటం లేదు. గల్ఫ్ దేశాల్లోని అమెరికా కంపెనీలను టార్గెట్ చేసుకుంటూ ఇరాన్ ముందుకెళ్లటంతో తప్పక ట్రంప్ యుద్ధాన్ని నడిపించాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. ఈ క్రమంలో ట్రంప్ తాజా కామెంట్లతో ఉదయం 10.26 గంటల సమయంలో బెంచ్ మార్క్ సెన్సెక్స్ 1551 పాయింట్ల నష్టంలో ఉండగా.. నిఫ్టీ 488 పాయింట్లు కోల్పోయింది. ఇక బ్యాంక్ నిఫ్టీ, మిడ్ క్యాప్ సూచీలు కూడా భారీగా నష్టాల్లో ట్రేడింగ్ కొనసాగిస్తున్నాయి. ఇవాళ మార్కెట్లను భారీ నష్టాలకు గురిచేసిన ప్రధాన కారణాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
1. ఇరాన్‌కు ట్రంప్ హెచ్చరికలు:
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇరాన్‌పై దాడులను తీవ్రతరం చేస్తామని, రాబోయే రెండు మూడు వారాల్లో అత్యంత కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించడం భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలను పెంచింది. దీనివల్ల క్రూడ్ ధరలు 5% పెరిగి బ్యారెల్‌కు 105 డాలర్లకు చేరాయి. యుద్ధం ముగింపుపై స్పష్టత లేకపోవడంతో ఆసియా మార్కెట్లు 1.2% క్రాష్ అయ్యాయి.
2. విదేశీ పెట్టుబడుల ఉపసంహరణ:
ఏప్రిల్ నెలలోనూ విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల అమ్మకాలు ఆగడం లేదు. ఏప్రిల్ 1న ఒక్కరోజే రూ.8వేల 331 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు. పెరుగుతున్న క్రూడ్ ధరలు, వాణిజ్య లోటు రూపాయి విలువపై ఒత్తిడిని పెంచుతున్నాయి.
3. బ్యాంకింగ్ రంగంపై ఆర్‌బీఐ కొరడా:
రూపాయి విలువలో స్పెక్యులేటివ్ ట్రేడింగ్‌ను అరికట్టేందుకు ఆర్‌బీఐ కఠిన రూల్స్ తీసుకురావడంతో బ్యాంక్ నిఫ్టీ కుప్పకూలింది. పీఎస్‌యూ బ్యాంక్ ఇండెక్స్ 3.1% పడిపోగా, ఫైనాన్షియల్ షేర్లు 2.5% నష్టపోయాయి.
4. ఫార్మా షేర్లలో భారీ అమ్మకాలు:
అమెరికాలో దిగుమతి చేసుకునే బ్రాండెడ్ మందులపై 100% టారిఫ్‌లు విధించాలని ట్రంప్ ప్లాన్ చేస్తున్నారనే వార్తలు రావడంతో ఫార్మా రంగం 3.75% నష్టపోయింది.
5. పెరిగిన అస్థిరత:
మార్కెట్ భయాన్ని సూచించే ఇండియా విక్స్ 5% పెరిగింది. ఇది రాబోయే రోజుల్లో మరిన్ని అమ్మకాల ఒత్తిడి ఉంటుందని ట్రేడర్లను హెచ్చరిస్తోంది ఓలటాలిటీ సూచీ.
6. మార్కెట్ టెక్నికల్స్:
నిఫ్టీ కీలక స్థాయి అయిన 22,770 పాయింట్ల పైన నిలబడలేకపోవడం మార్కెట్ బలహీనతను సూచిస్తోంది. మార్కెట్ తిరిగి పుంజుకోవాలంటే 22,630 పైన స్థిరంగా కొనసాగాల్సి ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
