V6 News

భారీ లాభాల్లో దూసుకుపోతున్న మన స్టాక్ మార్కెట్లు.. కారణాలు ఇవే

భారీ లాభాల్లో దూసుకుపోతున్న మన స్టాక్ మార్కెట్లు.. కారణాలు ఇవే

భారత స్టాక్ మార్కెట్లు బుధవారం లాభాల పరంపరను మెుదలుపెట్టాయి. ఉదయం మార్కెట్ల ప్రారంభం నుంచి కొనుగోళ్ల జోరు పెరగటంతో సూచీలు దూసుకుపోతున్నాయి. ఉదయం 10.45 గంటల సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 860 పాయింట్లు, నిఫ్టీ 263 పాయింట్లు, నిఫ్టీ బ్యాంక్ 408 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 449 పాయింట్ల లాభంతో ట్రేడింగ్ కొనసాగిస్తున్నయి. ఈ క్రమంలో ఆటో, ఎఫ్ఎంసీజీ, ఐటీ రంగాల షేర్లలో ర్యాలీ కొనసాగుతోంది.

స్టాక్ మార్కెట్లు మంగళవారం నాటి నష్టాల నుంచి కోలుకుని, బుధవారం ట్రేడింగ్‌లో మళ్లీ జోరందుకున్నాయి. అంతర్జాతీయ పరిణామాలు, దేశీయంగా కొన్ని సానుకూల అంశాల నేపథ్యంలో సెన్సెక్స్, నిఫ్టీలు భారీ లాభాలను నమోదు చేశాయి. మార్కెట్ పెరుగుదలకు దారితీసిన ప్రధాన కారణాలను పరిశీలిస్తే:

1. కీలక రంగాల్లో కొనుగోళ్ల మద్దతు:
గత సెషన్‌లో అమ్మకాల ఒత్తిడితో నష్టపోయిన ఆటో, రియల్టీ, ఐటీ, ఎఫ్‌ఎమ్‌సీజీ రంగాల షేర్లలో ఇన్వెస్టర్లు తక్కువ ధరల వద్ద కొనుగోళ్లు చేపట్టారు. మంగళవారం సెన్సెక్స్ 416 పాయింట్లు, నిఫ్టీ 97 పాయింట్లు నష్టపోయిన వేళ.. ఈ రికవరీ మార్కెట్‌కు బలాన్ని ఇచ్చింది.

2. క్రూడ్ ఆయిల్ ధరల ప్రభావం:
గ్లోబల్ ఆయిల్ బెంచ్‌మార్క్ అయిన బ్రెంట్ క్రూడ్ ధర 0.21 శాతం తగ్గి బ్యారెల్‌కు 111 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. భారత్ తన క్రూడ్ అవసరాల కోసం దిగుమతులపైనే ఎక్కువగా ఆధారపడుతుంది. కాబట్టి ధరలు తగ్గడం మన ఆర్థిక వ్యవస్థకు శుభపరిణామం. ఇది దిగుమతుల బిల్లును తగ్గించడమే కాకుండా.. రవాణా, విమానయానం, తయారీ రంగాల కంపెనీల నిర్వహణ ఖర్చులను తగ్గించి, వాటి లాభాల మార్జిన్లను మెరుగుపరుస్తుంది.

3. ఆసియా మార్కెట్ల సంకేతాలు:
అంతర్జాతీయంగా ఆసియా మార్కెట్లు బలంగా రాణించడం మన మార్కెట్లకు కలిసొచ్చింది. ముఖ్యంగా దక్షిణ కొరియాకు చెందిన కోస్పి, షాంఘై ఎస్‌ఎస్‌ఈ కాంపోజిట్, హాంకాంగ్‌కు చెందిన హ్యాంగ్ సెంగ్ సూచీలు లాభాల్లో ట్రేడవుతూ దేశీయ ఇన్వెస్టర్లలో ఉత్సాహాన్ని నింపాయి.

4. బలమైన క్వార్టర్లీ ఫలితాలు:
మార్చి క్వార్టర్ ఫలితాలు మార్కెట్ పరుగుకు ఊతమిచ్చాయి. మారుతీ సుజుకి లాభం తగ్గినా.. డిమాండ్, వాల్యూమ్స్ స్థిరంగా ఉన్నాయని బ్రోకరేజీలు సానుకూల రేటింగ్ ఇవ్వడంతో ఈ షేరు 4 శాతం పెరిగింది. ఫలితంగా ఆటో ఇండెక్స్ 2.5 శాతం లాభంతో టాప్ గెయినర్‌గా నిలిచింది. అలాగే మెరుగైన ఫలితాల నేపథ్యంలో స్టార్ హెల్త్ 8.6%, ఎటర్నల్ 2% రాణించాయి.