
- షేర్లను అమ్మేస్తున్న విదేశీ ఇన్వెస్టర్లు.. మెప్పించని బ్యాంక్, ఐటీ కంపెనీల రిజల్ట్స్
- షార్ట్ టెర్మ్‌లో కన్సాలిడేషన్ ఉంటుందంటున్న ఎనలిస్టులు
న్యూఢిల్లీ: భారత ఈక్విటీ మార్కెట్ నాలుగో వారం కూడా నష్టాల్లో ముగిసింది. బీఎస్‌ఈ సెన్సెక్స్ 294.64 పాయింట్లు (0.36 శాతం) తగ్గి 81,463.09 వద్ద, నిఫ్టీ 131.4 పాయింట్లు (0.52శాతం) తగ్గి 24,837 వద్ద క్లోజయ్యాయి. ఈ నెలలో ఇప్పటివరకు ఈ రెండు ఇండెక్స్‌లు 2.5శాతం మేర నష్టపోయాయి. ఇదే టైమ్‌లో బీఎస్‌ఈ మిడ్‌క్యాప్ 1.7శాతం, స్మాల్‌క్యాప్ 2.5శాతం, లార్జ్‌క్యాప్ 0.7శాతం పడ్డాయి.
కార్పొరేట్ ఫలితాలు మిశ్రమంగా ఉండడం, యూఎస్–ఇండియా ట్రేడ్ డీల్‌పై అనిశ్చితి, విదేశీ ఇన్వెస్టర్లు పెట్టుబడులను వదిలించుకోవడం, అధిక వర్షపాతం వంటి అంశాలు మార్కెట్‌ను ప్రభావితం చేశాయి. ఫారిన్ ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు (ఎఫ్‌ఐఐలు) వరుసగా నాలుగో వారంలో కూడా నికర అమ్మకందారులుగా కొనసాగారు. రూ.13,552.91 కోట్ల విలువైన షేర్లను అమ్మారు. ఇదే టైమ్‌లో డొమెస్టిక్ ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు (డీఐఐలు) నికరంగా రూ.17,932.45 కోట్ల ఈక్విటీలను కొన్నారు.
ఈ నెలలో ఇప్పటివరకు ఎఫ్‌ఐఐలు రూ.30,508.66 కోట్ల షేర్లను అమ్మగా, డీఐఐలు రూ.39,825.97 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు. రంగాల వారీగా చూస్తే, నిఫ్టీ మీడియా ఈ నెల 25తో ముగిసిన వారంలో 5.7శాతం, రియల్టీ 5శాతం, ఐటీ 4శాతం, ఆయిల్ అండ్ గ్యాస్, ఎఫ్‌ఎంసీజీ ఇండెక్స్‌లు 3.5శాతం నష్టపోయాయి. బ్యాంక్, ఫార్మా, ప్రైవేట్ బ్యాంక్ సూచీలు స్వల్ప లాభాలతో ముగిశాయి. "మిశ్రమ క్యూ1 ఫలితాలు, గ్లోబల్ అంశాలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి.
నిఫ్టీ కీలక స్థాయి 24,900 దిగువకు పడింది. ఎఫ్‌ఐఐలు నెట్ షార్ట్ పొజిషన్‌లు తీసుకోవడం పెరిగింది" అని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఎనలిస్ట్ వినోద్ నాయర్ అన్నారు. రెవెన్యూ గైడెన్స్ మెప్పించకపోవడం, అసెట్స్ క్వాలిటీ ఆందోళనలతో ఐటీ, ఫైనాన్షియల్స్ రంగాలు నష్టపోయాయి. మిడ్, స్మాల్‌క్యాప్ సూచీలు బెంచ్‌మార్క్ ఇండెక్స్‌ల కంటే ఎక్కువ పడ్డాయి. ప్రస్తుతం మార్కెట్ వాల్యుయేషన్ ఎక్కువగా ఉందని, స్వల్పకాలంలో కన్సాలిడేషన్ ఉండొచ్చని నాయర్ అన్నారు.
తీవ్ర హెచ్చుతగ్గుల్లో చిన్న షేర్లు
కిందటి వారం స్మాల్ క్యాప్ షేర్లలో హై వొలటాలిటీ కనిపించింది. బీఎస్‌ఈ స్మాల్‌క్యాప్ ఇండెక్స్ 2.5శాతం నష్టపోయింది. ఇండియన్ ఎనర్జీ ఎక్స్ఛేంజ్ (ఐఈఈ), బ్లూ జెట్ హెల్త్‌కేర్, సీట్ వంటి షేర్లు 10–-34 శాతం పడిపోయాయి. మరోవైపు ఇన్ఫోబీన్స్ టెక్నాలజీస్, కేఐఓసీఎల్ , తిలక్‌నగర్ ఇండస్ట్రీస్ వంటి షేర్లు 20–-40 శాతం లాభపడ్డాయి.