2023లో మార్కెట్లు 20 శాతం అప్ .. చివరి రోజు మాత్రం నష్టమే​

2023లో మార్కెట్లు 20 శాతం అప్ ..  చివరి రోజు మాత్రం నష్టమే​

ముంబై:  2023 సంవత్సరం చివరి సెషన్​ ప్రయాణాన్ని ఈక్విటీ సూచీలు సెన్సెక్స్,  నిఫ్టీ నష్టాలతో ముగించాయి. పెట్టుబడిదారులు లాభాల స్వీకరణకు ప్రాధాన్యత ఇవ్వడంతో రెండూ తగ్గాయి. అయితే ఈ బెంచ్‌‌‌‌మార్క్‌‌‌‌లు ఈ ఏడాది 20 శాతం వరకు పెరిగి రికార్డు సృష్టించాయి. ఐదు రోజుల విజయవంతమైన పరుగు తర్వాత, శుక్రవారం ఇంధనం, బ్యాంకింగ్  ఐటీ కౌంటర్లలో అమ్మకాల ఒత్తిడి ఎక్కువగా ఉండటంతో సూచీలు కిందికి వెళ్లాయి. బీఎస్​ఈ సెన్సెక్స్ 170.12 పాయింట్లు క్షీణించి 72,240.26 వద్ద ట్రేడ్‌‌‌‌ని బలహీనంగా ప్రారంభించింది. 

ఇంట్రాడేలో ఇది 327.74 పాయింట్లు పడిపోయి 72,082.64 వద్దకు చేరుకుంది. నిఫ్టీ 47.30 పాయింట్లు క్షీణించి 21,731.40 వద్ద స్థిరపడింది. ఇంట్రా-డే ట్రేడ్‌‌‌‌లో 101.8 పాయింట్లు పడిపోయి 21,676.90 వద్దకు చేరుకుంది. 2023లో బీఎస్​ఈ 11,399.52 పాయింట్లు లేదా 18.73 శాతం పెరిగింది.  నిఫ్టీ 3,626.1 పాయింట్లు లేదా 20 శాతం పెరిగింది. సెన్సెక్స్ కంపెనీల్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇన్ఫోసిస్, టైటాన్, టెక్ మహీంద్రా, ఇండస్‌‌‌‌ఇండ్ బ్యాంక్, ఎన్‌‌‌‌టిపిసి, ఐసిఐసిఐ బ్యాంక్, పవర్ గ్రిడ్, రిలయన్స్ ఇండస్ట్రీస్  కోటక్ మహీంద్రా బ్యాంక్ వెనుకబడి ఉన్నాయి.  టాటా మోటార్స్, నెస్లే, హిందుస్థాన్ యూనిలీవర్, టాటా స్టీల్, బజాజ్ ఫైనాన్స్, అల్ట్రాటెక్ సిమెంట్ షేర్లు లాభపడ్డాయి. 

వచ్చే ఏడాది లాభాలు..

సంవత్సరం చివరి ట్రేడింగ్ రోజున మార్కెట్ స్వల్ప ప్రాఫిట్ బుకింగ్‌‌‌‌ను చూసింది. రేట్ల తగ్గింపు,  బాండ్ ఈల్డ్‌‌‌‌లలో తగ్గుదల కారణంగా వచ్చే ఏడాది ప్రారంభంలో ర్యాలీ ఉంటుందని  ఎనలిస్టులు భావిస్తున్నారు. చమురు ధరలు సంవత్సరంలో 10 శాతం పడిపోయాయి. దీనివల్ల ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు తగ్గుతాయి. కార్పొరేట్ల  పనితీరు బాగుంటుంది”అని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ అన్నారు. ఆసియా మార్కెట్లలో టోక్యో దిగువన స్థిరపడగా, షాంఘై, హాంకాంగ్ లాభాలతో ముగిశాయి. దక్షిణ కొరియాలో మార్కెట్లు మూతపడ్డాయి. యూరోపియన్ మార్కెట్లు సానుకూలంగా ట్రేడవుతున్నాయి. గురువారం అమెరికా మార్కెట్లు మిశ్రమంగా ముగిశాయి.   గత ఐదు ట్రేడింగ్ సెషన్‌‌‌‌లలో, బీఎస్‌‌‌‌ఈ బెంచ్‌‌‌‌మార్క్ 1,904.07 పాయింట్లు ర్యాలీ చేయగా,  నిఫ్టీ 628.55 పాయింట్లు పెరిగింది. 

గ్లోబల్ ఆయిల్ బెంచ్‌‌‌‌మార్క్ బ్రెంట్ క్రూడ్ బ్యారెల్‌‌‌‌కు 0.86 శాతం పెరిగి 77.81 డాలర్లకు చేరుకుంది. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు (ఎఫ్‌‌‌‌ఐఐలు) గురువారం రూ. 4,358.99 కోట్ల విలువైన ఈక్విటీలను కొనుగోలు చేశారు. ఇదిలా ఉంటే ఫార్మాస్యూటికల్ కంపెనీ ఇన్నోవా క్యాప్టాబ్ లిమిటెడ్ షేర్లు ఇష్యూ ధర రూ. 448తో పోలిస్తే దాదాపు 22 శాతం ప్రీమియంతో ముగిశాయి.  బీఎస్‌‌‌‌ఈలో ఇష్యూ ధర నుంచి 1.80 శాతం లాభాన్ని నమోదు చేస్తూ షేరు రూ.456.10 వద్ద మొదలయింది. తర్వాత 22.16 శాతం జంప్ చేసి రూ.547.30కి చేరుకుంది. చివరకు 21.68 శాతం ర్యాలీతో రూ.545.15 వద్ద ముగిసింది. ఎన్‌‌‌‌ఎస్‌‌‌‌ఈలో 0.91 శాతం పెరిగి రూ.452.10 వద్ద నమోదైంది. కంపెనీ షేర్లు 21 శాతం ఎగబాకి రూ.542.50 వద్ద ముగిశాయి. కంపెనీ మార్కెట్ విలువ రూ.3,119.62 కోట్లకు చేరింది.