ఈరోజు దేశవ్యాప్తంగా అందరి దృష్టి బీహార్ ఎన్నికల ఫలితాలపైనే కొనసాగుతోంది. ఈ క్రమంలో బెంచ్ మార్క్ సూచీలు ఉదయం 10.20 గంటల సమయంలో నష్టాల్లోనే ట్రేడింగ్ కొనసాగిస్తున్నాయి. సెన్సెక్స్ 285 పాయింట్ల నష్టంలో ఉండగా నిఫ్టీ సూచీ 85 పాయింట్లు దిగజారింది. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ కూడా 110 పాయింట్లకు పైగా నష్టంలో ఉంది. ఇంట్రాడేలో నష్టాల నుంచి మార్కెట్లు తేరుకున్నప్పటికీ మళ్లీ తిరిగి లాసెస్ లోకి జారుకోవటం గమనార్హం.
ఇన్వెస్టర్లు తమ దృష్టిని బీహార్ ఫలితాలపై ఉంచటంతో మార్కెట్లు అప్రమత్తంగా ముందుకు సాగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతానికి ఎగ్జిట్ పోల్స్ అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నప్పటికీ రాజకీయంగా దేశంలో ఇది చాలా ముఖ్యమైన ఘట్టంగా మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. అందుకే ఫలితాల కోసం ఇన్వెస్టర్లు కూడా ప్రజలతో పాటు ఆసక్తిగా గమనిస్తున్నారని వెల్లడైంది.
ఫలితాలు ఊహించిన దానికి భిన్నంగా ఉంటే మార్కెట్లలో ప్రతికూల ట్రెండ్ ఉండొచ్చని బ్రోకరేజీలు హెచ్చరిస్తున్నాయి. ఇదే జరిగితే బెంచ్ మార్క్ సూచీలు సెన్సెక్స్, నిఫ్టీ 5 నుంచి 7 శాతం మధ్య నష్టపోవచ్చని ఇన్ క్రెడ్ రీసెర్చ్ వెల్లడించింది. NDA, మహాఘట్‌బంధన్ మధ్య చాలా తక్కువ ఓట్ల వాటా వ్యత్యాసం.. EBC యువ ఓటర్లలో చిన్న హెచ్చుతగ్గులు 100 కంటే ఎక్కువ మార్జినల్ సీట్లను ప్రభావితం చేయగలవని నివేదికలు చెబుతున్నాయి.
ఎన్నికల ఫలితాలకు భిన్నంగా తీర్పు వెలువడితే రంగాలవారీ ప్రతిచర్యలు ఉంటాయని ఇన్‌క్రెడ్ అంచనా వేస్తోంది. అధికారంలో ఉన్న బీజేపీ కూటమి ఓడిపోతే మౌలిక సదుపాయాలు, రక్షణ, PSU స్టాక్‌లు - ప్రభుత్వ మూలధనం ప్రత్యక్ష లబ్ధిదారులు - తాత్కాలిక ఒత్తిడిని ఎదుర్కోవలసి ఉంటుందని రీసెర్చ్ సంస్థ వెల్లడించింది. ప్రస్తుతం బుల్స్ ఎన్డేఏ గెలుపు కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని బ్రోకరేజ్ సంస్థల నిపుణులు చెబుతున్నారు.
