ప్రేమ పెళ్లి చేసుకుందని కూతుర్ని చంపి కాలువలో పడేశారు

ప్రేమ పెళ్లి చేసుకుందని కూతుర్ని చంపి కాలువలో పడేశారు
  • పరువు హత్య చేసిన ఫ్యామిలీని అరెస్టు చేసిన పోలీసులు 

తమకు ఇష్టం లేకుండా వేరే కులం యువకుడిని ప్రేమ వివాహం చేసుకుందని కన్న కూతురిని చంపేశారు. పోలీసులకు దొరక్కుండా తప్పించుకోవాలని డెడ్ బాడీని 80 కిలోమీటర్ల దూరం తీసుకెళ్లి ఓ కాలువలో పడేసి వచ్చారు. గత నెలలో జరిగిన ఈ ఘటనలో కుటుంబసభ్యులే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు నిర్ధారణకు వచ్చిన పోలీసులు నిన్న ఆరుగురిని అరెస్టు చేశారు.

ఢిల్లీలోని న్యూ అశోక్ నగర్ ప్రాంతానికి చెందిన షీతల్ చౌదరి అనే 25 ఏళ్ల యువతి తమ పక్కింటిలోనే ఉండే అంకిత్ భాటి అనే యువకుడిని ప్రేమ వివాహం చేసుకుంది. దాదాపు మూడేళ్లుగా ప్రేమలో ఉన్న ఆ ఇద్దరు గత ఏడాది అక్టోబర్‌లో ఆర్య సమాజ్‌లో పెళ్లి చేసుకున్నారు. అయితే ఇది ఇష్టం లేని షీతల్ ఫ్యామిలీ అతడిని వదిలేసి రావాల్సిందిగా పలుమార్లు చెప్పారు. కుటుంబసభ్యులతో పాటు దగ్గరి బందువులంతా కూడా ఆమెను కన్విన్స్ చేసే ప్రయత్నం చేశారు. అందుకు షీతల్ ఒప్పుకోకపోవడంతో ఆగ్రహంతో రగిలిపోయిన కుటుంబసభ్యులు జనవరి 30న ఆమె ప్రాణం తీశారు. దారుణం చంపేసి.. దాదాపు 80 కిలోమీటర్ల దూరం కారులో డెడ్ బాడీని తీసుకెళ్లి యూపీలోని అలీగఢ్ సమీపంలోని ఓ కాలువలో పడేశారు. ఇక పోలీసులకు దొరికే చాన్స్ లేదని నిశ్చింతగా ఉన్నారు. కానీ, కథ అడ్డం తిరిగింది. పోలీసులకు దొరికిపోయారు.

షీతల్ కనిపించకుండా పోవడంతో ఆమె భర్త అంకిత్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తొలుత మిస్సింగ్ కేసు నమోదు చేసిన న్యూ అశోక్ నగర్ పోలీసులు దీనిపై దర్యాప్తు చేశారు. ఆమె కుటుంబసభ్యులను పోలీసులు ఎంక్వైరీ చేయగా.. తమ దగ్గరకు రాలేదని, వేరే బంధువుల వద్దకు వెళ్లి ఉంటుందని తప్పించుకునే ప్రయత్నం చేశారు. ఎక్కడా ఆమె ఆచూకీ లభించలేదు. కానీ షీతల్ భర్త ఈ కేసులో తన భార్య కుటుంబానికి తమ ప్రేమ పెళ్లి ఇష్టం లేదని, వాళ్లే ఏమైనా చేసి ఉంటారని చెప్పాడు. అదే సమయంలో అలీగఢ్‌లో ఓ గుర్తు తెలియని మహిళ శవం దొరికినట్లు తెలియడంతో అశోక్ నగర్ పోలీసులు అక్కడి వెళ్లారు. అయితే జనవరి 30న డెడ్ బాడీ దొరికిందని, ఎవరూ రాకపోవడంతో ఫిబ్రవరి 2న తామే అంత్యక్రియలు చేశామని అక్కడి పోలీసులు చెప్పారు. అయితే మృదేహం ఫొటో, వాచ్, ఇతర వస్తువులను చూపించగా.. భర్త అంకిత్ వాటిని గుర్తు పట్టాడు. దీంతో ఆ డెడ్ బాడీ షీతల్‌దేనని నిర్ధారణకు వచ్చారు.

షీతల్ మరణించినట్లు తేలడంతో ఆమె కుటుంబసభ్యులను పోలీసులు తమదైన శైలిలో ఎంక్వైరీ చేశారు. దీంతో తామే హత్య చేశామని నేరాన్ని ఒప్పుకొన్నారు. దీంతో తల్లిద్రండులు సహా మొత్తం ఆరుగురిని పోలీసులు అరెస్టు చేశారు.

Married outside caste, 25-year-old East Delhi resident falls prey to honour killing