భర్త కౌన్సిలింగ్‌కు రాలేదని పోలీస్‌స్టేషన్ ఎదుట భార్య ఆత్మహత్యాయత్నం

భర్త కౌన్సిలింగ్‌కు రాలేదని పోలీస్‌స్టేషన్ ఎదుట భార్య ఆత్మహత్యాయత్నం

కరీంనగర్ జిల్లా: తమ కాపురంలో వచ్చిన మనస్పర్థలను పరిష్కరించుకునే క్రమంలో తన భర్త కౌన్సిలింగ్ కు రాలేదని ఓ మహిళ ఆత్మాహత్యాయత్నం చేసింది. తీవ్ర మనస్థాపంతో నిద్రమాత్రలు మింగి, ప్రస్తుతం చావుబతుకుల మధ్య పోరాడుతుంది.  వివరాల్లోకి వెళ్తే.. జిల్లాలోని ఇల్లందకుంట శ్రీరాములపల్లి గ్రామానికి చెందిన చిట్యాల సంధ్య, కేశవపట్నం మండలం ఇప్పలపల్లి గ్రామానికి చెందిన అన్నే సంతోష్ లు నాలుగు సంవత్సరాలుగా ప్రేమించుకున్నారు. గత సంవత్సరం మార్చి 16న ఇల్లందకుంటలోని శ్రీ సీత రామ చంద్రస్వామి దేవస్థానంలో పెళ్లి చేసుకున్నారు.

అయితే కొన్నాళ్ల  తర్వాత త‌న భ‌ర్త త‌ర‌పు బంధువులతోపాటు ఆ గ్రామంలోని కొందరు పంచాయతీ పెద్దలు తనది వేరే కులం అంటూ త‌మ‌ సంసారంలో అగాధాలు సృష్టించారని బాధిత యువతి ఆవేదన వ్యక్తం చేసింది. ఇదే విషయమై ఇల్లందకుంట పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేసింది. ఆ ఫిర్యాదు మేరకు పోలీసు వారు భార్యభర్తలకు కౌన్సిలింగ్ ఇచ్చేందుకు ఇరువర్గాలను పిలిపించగా భర్త తరఫువారు హాజరు కాలేదు. దీంతో మనస్థాపానికి గురైన సంధ్య పోలీస్ స్టేషన్ ఎదుట నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్య యత్నం చేసింది. వెంటనే పోలీసులు చికిత్స నిమిత్తం జమ్మికుంట ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు చెబుతున్నారు. ఇటీవలే సంధ్య  తనను కాపురానికి తీసుకు వెళ్లాలంటూ ఇప్పలపల్లి గ్రామంలో భర్త ఇంటి ఎదుట బైఠాయించింది.