- టూ వీలర్లు 2623 కాగా, 154 ఆటో రిక్షాలు, 89 ఆర్టీసీ బస్సులు
- ఇంధన పొదుపుతో పాటు పర్యావరణానికి ఈవీలతో మేలు
నిజామాబాద్ వెలుగు: జిల్లాలో ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. గతంతో పోలిస్తే కొనుగోళ్లు పెరిగాయి. పెట్రోల్, డీజిల్ వాహనాలకంటే కొంచెం ఎక్కువ ధర ఉన్నప్పటికీ ప్రజలు వీటిని కొనుగోలు చేస్తున్నారు. ఇంధన ఖర్చు తగ్గించుకోవాలని ప్రజల ఆసక్తి, పర్యావరణాన్ని పరిరక్షించాలన్న దృక్పథంతో ఈవీ కొనుగోళ్లు భారీగా పెరుగుతున్నాయి. ప్రభుత్వం రిజిస్ట్రేషన్ ఖర్చులో రాయితీలు కల్పించడం, జీఎస్టీ తగ్గింపు వంటి ప్రోత్సాహకాలు ఈవీ అమ్మకాలను మరింత పెంచాయి.
ప్రతి మూడు వాహనాల్లో ఒకటి ఈవీ
సాధారణ రోజుల్లో జిల్లాలో ప్రతి నెలా సుమారు 3 వేల కొత్త వాహనాలు అమ్మకానికి వస్తాయి, కానీ దసరా పండగ సమయంలో అమ్మకాలు గణనీయంగా పెరుగుతాయి. ఈ దసరాకి కేవలం 10 రోజుల వ్యవధిలో 3 వేల వాహనాలు అమ్మగా, వాటిలో వెయ్యి ఈవీ వాహనాలు ఉండడం గమనార్హం, దసరా పండగ సమయంలో కేంద్ర సర్కార్ అమలు చేసిన జీఎస్టీ సంస్కరణల వల్ల వాహనాల అమ్మకాలు అనూహ్యంగా పెరిగాయి. జనవరి నుంచి అక్టోబర్ వరకు, జిల్లావ్యాప్తంగా మొత్తం 2,976 ఈవీ వాహనాలు రిజిస్టర్ అయ్యాయి, వాటిలో టూ వీలర్స్ 2,623, ఆటోరిక్షాలు 154, ఆర్టీసీ బస్‌లు 89, ఇతర త్రీ వీలర్ వాహనాలు 50, ట్యాక్సీ, క్యాబ్‌లు 4 ఉన్నాయి.
నెలకు రూ.3 కోట్ల ఇంధన ఆదా
ఈవీ వాహనాలతో ఏడాదికి సుమారు రూ.3 కోట్ల పెట్రోల్, డీజిల్ ఖర్చు ఆదా అయ్యింది. టూ వీలర్ బండ్లను రోజుకు ఒక లీటర్ పెట్రోల్ ఖర్చుతో లెక్కించినా, 2,623 బండ్లకు నెలకు సుమారు రూ.2.93 లక్షలు, అంటే సంవత్సరానికి రూ.35 లక్షల ఖర్చు తగ్గుతుంది. ఆర్టీసీ బస్సుల కోసం రోజుకు సగటున రూ.5,000 డీజిల్ ఖర్చుతో 89 ఈవీ బస్సుల ద్వారా ప్రతి రోజు రూ.4.45 లక్షలు, ఏడాది మొత్తం రూ.1.33 కోట్ల డబ్బు ఆదా అయింది.
154 ఆటోరిక్షాలకు రోజుకు రూ.200 డీజిల్ ఖర్చు లెక్కించినా నెలకు రూ.9.24 లక్షల ఇంధన ఖర్చు తగ్గింది. ఇతర త్రీ వీలర్, క్యాబ్ వాహనాలను కలిపితే, నెలకు సుమారు రూ.3 కోట్ల ఇంధన ఖర్చు ఈవీలతో తగ్గింది. ఎలక్ట్రిక్ వాహనాలు శబ్ద కాలుష్యాన్ని, గాలిలో కలకలం కలిగించే ఎయిర్ పొల్యూషన్‌ను కూడా తగ్గిస్తున్నాయి.
అవగాహన పెరిగింది
ఈ ఏడాది ఈవీ బండ్ల సేల్స్ బాగా పెరిగాయి. వాహన ప్రియుల్లో ఎలక్ట్రిక్ వాహనాలపై అవగాహన పెరగడం దీనికి ప్రధాన కారణం. దసరా అమ్మకాలు మమ్మల్ని ఆశ్చర్యపరిచాయి, ఎందుకంటే ప్రతి మూడు వాహనాల్లో ఒకటి ఈవీ
వాహనం ఉంది.- బోజిందర్, టువీలర్ షోరూం మేనేజర్
