కరోనాతో మృతి చెందిందా? హత్యా.?

కరోనాతో మృతి చెందిందా? హత్యా.?
  •     కరోనాతో మృతి చెందిందని చెప్పిన భర్త 
  •     తల్లి ఫిర్యాదుతో పూడ్చిన మృతదేహం వెలికితీసి పోస్ట్ మార్టం 

ఎల్బీనగర్, వెలుగు: వివాహిత మృతిపై తల్లి అనుమానం వ్యక్తం చేయడంతో పోలీసులు వారం తర్వాత మృతదేహాన్ని వెలికితీసి పోస్ట్​మార్టం నిర్వహించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నల్గొండ జిల్లా మిర్యాలగూడ పీ‌‌‌‌ఏపల్లి మండలం పిల్లిగుంట్ల తండాకు చెందిన రమావత్ విజయ్(26), కవిత(21) వివాహం మూడేండ్ల క్రితం జరిగింది. హైదరాబాద్​వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని సుందరయ్య కాలనీలో దంపతులు నివాసం ఉంటున్నారు. కవితకు కరోనా లక్షణాలు ఉన్నాయని, ఈ నెల 10న వనస్థలిపురం ఏరియా ఆస్పత్రిలో టెస్ట్ చేయించగా పాజిటివ్ వచ్చిందని విజయ్ తన అత్తమామలకు సమాచారం అందించాడు. 18న కాల్ చేసి కవిత కరోనాతో చనిపోయిందని అత్తమామకు చెప్పాడు. దీంతో వారు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని స్వగ్రామం పిల్లిగుంట్ల తండాకు తీసుకెళ్లి పూడ్చిపెట్టారు. అనంతరం అంత్యక్రియల్లో పాల్గొన్న  వారంతా కరోనా టెస్టు చేయించుకోగా నెగెటివ్​వచ్చింది. దాంతో కవిత మృతిపై అనుమానం వ్యక్తం చేస్తూ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఓ మహిళ విషయంలో తన అల్లుడు, కూతురు మధ్య గతంలో చాలా గొడవలు జరిగాయని పేర్కొన్నారు. ఈ నెల 17న తండ్రి వెళ్లి కవితకు పండ్లు కూడా ఇచ్చి వచ్చారని, ఆ సమయంలో బాగానే ఉందని, ఒక్క రోజులోనే ఎలా మృతిచెందుతుందని అంటున్నారు. అల్లుడే ఆమెను హత్య చేసి కరోనాతో మృతి చెందినట్లు చిత్రీకరిస్తున్నారని ఆరోపించారు. దీంతో పోలీసులు పిల్లిగుంట్ల తండాకు వెళ్లి అక్కడి తహసీల్దార్​సమక్షంలో పూడ్చిపెట్టిన కవిత మృతదేహాన్ని వెలికితీసి పోస్ట్ మార్టం చేశారు. రిపోర్టు వస్తే కరోనాతో మృతిచెందిందా లేక హత్యా తేలుతుందని పోలీసులు తెలిపారు. వనస్థలిపురం ఏరియా హాస్పిటల్​లో విచారించగా ఈ నెల 10న చేసిన టెస్ట్​లో కవితకు నెగెటివ్​ వచ్చినట్లు తెలిసిందని బంధువులు పేర్కొంటున్నారు.