కేసు భయంతో తండ్రి పరార్, తల్లి ఆత్మహత్య ..

కేసు భయంతో తండ్రి పరార్, తల్లి ఆత్మహత్య ..

అనాథలైన చిన్నారులు

సిరిసిల్ల టౌన్(ఎల్లారెడ్డిపేట)​, వెలుగు : క్షణికావేశంలో ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది.  కేసైతే జైలు పాలవుతానని భయపడిన భర్త పిల్లలను వదిలేసి పరారయ్యాడు.  దీంతో పిల్లలు రోడ్డున పడ్డారు. అమ్మమ్మ, తాతయ్య వద్ద ఆశ్రయం పొందుతూ ఆపన్న హస్తం కోసం ఎదురుచూస్తున్నారు. వివరాలు..  ఎల్లారెడ్డిపేటకు చెందిన ద్యాగం రాజయ్య, మణేవ్వ ల కూతురు పద్మను కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం లచ్చపేటకు చెందిన పడకంటి నారాయణతో15ఏళ్ల కింద వివాహమైంది. వీరికి ప్రవళిక (దివ్యాంగురాలు), పవన్​కుమార్​పిల్లలు జన్మించారు.

కొద్దిరోజుల తర్వాత వీరిద్దరి మధ్య కలహాలు జరిగి విడాకులకు దారి తీసింది. విడాకుల అనంతరం పద్మను సిద్దిపేట జిల్లా  చిన్నకోడూర్​ మండలం రామంచకు చెందిన  కొమురవెల్లి ముత్యాలు తో వివాహమైంది. అయితే  పద్మ తన ఇద్దరు పిల్లలతో అత్తారింటికి వెళ్లింది. ముత్యాలు కొద్ది రోజుల కాపురం బాగానే చేసిన తర్వాత అదనపు కట్నం కోసం వేధించాడు. దీంతో వీరిద్దరి మధ్య కలహాలు రావడంతో ఈ నెల 1న పద్మ ఇంట్లో ఎవరూలేని టైంలో  కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృత్యువుతో పోరాడి ఈ నెల 7న మరణించింది. పద్మ భర్త ముత్యాలు జైలు కెళ్లాల్సి వస్తందేమోనని భయపడి పరారయ్యారు. పద్మ అమ్మానాన్న ఇద్దరు పిల్లలను సాకుతూ ఆపన్న హస్తం కోసం ఎదురుచూస్తున్నారు. ఎల్లారెడ్డిపేట సర్పంచ్ వెంకట్​రెడ్డి, ఉప సర్పంచ్ రజిత బాల్​రాజు  వీరిని ఆదుకోవడానికి ముందుకు రావాలని కోరుతున్నారు.