యాసంగి యూరియాపై సర్కారు అలర్ట్!

యాసంగి యూరియాపై సర్కారు అలర్ట్!
  • 10.40 లక్షల టన్నులు అవసరమని అంచనా
  • కేంద్రానికి ఇండెంట్‌‌‌‌‌‌‌‌ పంపిన రాష్ట్ర సర్కారు

హైదరాబాద్, వెలుగు: యాసంగి సీజన్లో ఎరువుల కొరత ఏర్పడకుండా రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రధానంగా యూరియా సరఫరాపై ప్రత్యేక దృష్టి సారించి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టింది. వ్యవసాయ శాఖ ఈ సీజన్​లో మొత్తం 10.40 లక్షల టన్నుల యూరియా అవసరమని అంచనా వేసింది. ఇందుకోసం కేంద్రానికి ముందస్తు ఇండెంట్ పెట్టి, నిరంతరాయంగా సరఫరా కొనసాగించేందుకు వ్యవసాయశాఖ ఏర్పాట్లు చేస్తూ అప్రమత్తంగా వ్యవహరిస్తున్నది. 

యాసంగి కోసం 10.40 లక్షల టన్నుల యూరియాతో పాటు 1.45 లక్షల టన్నుల డీఏపీ, 7 లక్షల టన్నుల కాంప్లెక్స్ ఎరువులు, 0.65 లక్షల టన్నుల ఎంఓపీ, 0.60 లక్షల టన్నుల ఎస్ఎస్​పీలను కేటాయించింది. దీనిని దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వానికి ముందుగానే ఇండెంట్‌‌‌‌‌‌‌‌ పంపి కేటాయింపులు చేయాలని కోరింది.

డిసెంబర్​లోపు 6 లక్షల టన్నులు కావాలి

యాసంగి సీజన్‌‌‌‌‌‌‌‌లో ఎరువుల కొరత తలెత్తకుండా 60–70 శాతం యూరియాను ముందుగానే స్టాక్​పెట్టుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తున్నది. ఈ విధంగా సరఫరాలు జరిగితే రైతులకు ఇబ్బందులు రాకుండా ఎరువులు పంపిణీ చేయవచ్చని అధికారులు చెప్తున్నారు. రాష్ట్రానికి కేటాయించిన యూరియాలో అక్టోబర్‌‌‌‌‌‌‌‌, నవంబర్‌‌‌‌‌‌‌‌, డిసెంబర్‌‌‌‌‌‌‌‌ నెలల్లో నెలకు 2 లక్షల టన్నుల చొప్పున 6 లక్షల టన్నులు సరఫరా చేయాలని కేంద్రాన్ని రాష్ట్రం కోరింది. గతంలో ఎరువుల కొరతతో బఫర్‌‌‌‌‌‌‌‌ నిల్వలు సిద్ధం చేసుకునే దిశగా చర్యలు చేపట్టింది.

డిసెంబర్ నుంచి పెరగనున్న వినియోగం..

డిసెంబర్‌‌‌‌‌‌‌‌ మూడో వారం నుంచి యూరియా వినియోగం గరిష్ట స్థాయికి చేరనుందని.. వరి, మక్కజొన్న పంటల కోసం రైతులు పెద్ద ఎత్తున వినియోగించనున్నారని అధికారులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఎరువుల కొరత రాకుండా ఉండేందుకు, కేంద్రం వెంటనే అదనంగా 0.50 లక్షల టన్నుల దిగుమతి యూరియా కేటాయించి, సీఐఎల్‌‌‌‌‌‌‌‌ ద్వారా వేగంగా ట్రాన్స్​పోర్ట్​చేయాలని రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వర్​రావు కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రిని కోరినట్టు తెలిసింది.

రాష్ట్రానికి దిగుమతి ఎరువులు

ప్రస్తుతం రాష్ట్రంలో 1.43 లక్షల టన్నుల యూరియా, 58 వేల టన్నుల డీఏపీ, 2.09 లక్షల టన్నుల కాంప్లెక్స్‌‌‌‌‌‌‌‌ ఎరువులు అందుబాటులో ఉన్నాయని వ్యవసాయశాఖ తెలిపింది. రానున్న రోజుల్లో నిల్వలు మరింత పెరుగుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. అక్టోబర్‌‌‌‌‌‌‌‌ నెలలో రాష్ట్రానికి కేటాయించిన యూరియాలో ఇప్పటివరకు 1.88 లక్షల టన్నులు సరఫరా కాగా, ఇంకా 37 వేల టన్నులు పోర్టుల నుంచి రావాల్సి ఉంది. 

నవంబర్‌‌‌‌‌‌‌‌ నెలలో రెండు లక్షల టన్నుల యూరియా కేటాయింపును కేంద్ర ఎరువుల శాఖ ఆమోదించింది. ఇందులో 1.29 లక్షల టన్నులు దిగుమతి యూరియా (సీఐఎల్‌‌‌‌‌‌‌‌–1.02 లక్షలు, ఐపీఎల్‌‌‌‌‌‌‌‌–0.27 లక్షలు) కాగా, మిగతా 71 వేల టన్నులు దేశీయంగా తయారైనది.