- ఆ ప్రాంత ఓటర్లకు మంత్రి పొన్నం విజ్ఞప్తి
హైదరాబాద్, వెలుగు: జూబ్లీహిల్స్ ప్రజలు తమ నియోజవర్గానికి వచ్చిన ఉప ఎన్నికను అభివృద్ధి కోసం వాడుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. శనివారం హైదరాబాద్లో ఆయన మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు. ఇంతకుముందు కంటోన్మెంట్ కు ఉప ఎన్నిక జరిగిందని, అక్కడి ప్రజలు కాంగ్రెస్ ను గెలిపించి, ఆ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుంటున్నారని మంత్రి పొన్నం గుర్తు చేశారు.
ఇప్పుడు జూబ్లీహిల్స్ లో కూడా కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ను గెలిపించి నియోజకవర్గాన్ని అనుకున్న స్థాయిలో అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉందని, మరో మూడేండ్లు తామే అధికారంలో ఉంటామని, నవీన్ యాదవ్ వంటి యువకుడు, చురుకైన నేతను ఎమ్మెల్యేగా గెలిపించుకుంటే ఇక్కడి ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుకున్న స్థాయిలో సహకారం దొరుకుతుందని చెప్పారు. ఈ నెల 11 న ప్రతి ఓటరు విధిగా తమ ఓటు హక్కును వినియోగించుకొని కాంగ్రెస్ ను గెలిపించాలని పొన్నం కోరారు.
