కరీంనగర్ క్రైం, వెలుగు: ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త కుటుంబ సభ్యులు వరకట్న వేధింపులకు పాల్పడడంతో పాటు సూటిపోటి మాటలతో హింసించడంతో ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు తెలిపిన ప్రకారం.. మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం గొల్లపల్లికి చెందిన మమత(29)ను తన బంధువైన తాండూరు మండలం చంద్రపల్లికి చెందిన కంబాల నరేశ్‌ను ప్రేమించగా.. 14 నెలల క్రితం పెద్దలు వివాహం జరిపించారు. నరేశ్ గోదావరిఖనిలోని సింగరేణి వన్ ఇంక్లైన్ బావిలో పనిచేస్తూ, గంగానగర్‌లో అద్దె ఇంట్లో నివసిస్తున్నాడు.
పెళ్లైన కొద్ది రోజులకే భర్త నరేశ్, అత్త చిన్నక్క, మామ భూమయ్య, ఆడపడుచు కవిత వరకట్నం కోసం వేధింపులకు గురిచేశారు. ఈ విషయం తెలుసుకున్న మమత కుటుంబ సభ్యులు రెండు నెలల క్రితం రూ.లక్ష నగదు ఇచ్చారు. మమత ఈ నెల 16న తనను అత్తింటి వారు చిత్రహింసలు పెడుతున్నారని చిన్నాన్న కొడుకు మహేశ్‌కు ఫోన్ చేసి చెప్పింది. ఆయన వచ్చి మమతను నస్పూర్ కాలనీకి తీసుకెళ్లాడు. అనంతరం నరేశ్ అనారోగ్యంతో మెట్ల వద్ద పడిపోవడంతో హాస్పిటల్‌కు తరలించారు.
మెరుగైన వైద్యం కోసం కరీంనగర్‌లోని మెడికవర్ హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. ఈ సమయంలో అత్తింటివారు ‘నీ కారణంగానే మా కొడుకు పరిస్థితి ఇలా అయింది’ అంటూ మమతను సూటిపోటి మాటలతో ఇబ్బందిపెట్టారు. తీవ్ర మనస్తాపానికి గురైన మమత తీగలగుట్టపల్లి హనుమాన్‌నగర్ రైల్వే ట్రాక్ సమీపంలో ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకుంది.
ప్రొబేషనరీ ఐపీఎస్ అధికారి సోహం సునీల్, ఏసీపీ విజయ్ కుమార్ ఘటన స్థలాన్ని పరిశీలించారు. మమత తండ్రి ఫిర్యాదు మేరకు భర్తతో పాటు అత్తింటి వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ నిరంజన్ రెడ్డి తెలిపారు.
