డ్రోన్లతో పెస్టిసైడ్స్ పిచికారి.. ఎకరాకు రూ.500 చార్జ్

డ్రోన్లతో పెస్టిసైడ్స్ పిచికారి.. ఎకరాకు రూ.500 చార్జ్
  •     ఇఫ్కో, మారుత్ డ్రోన్ మధ్య ఒప్పందం
  •     తెలుగు రాష్ట్రాల్లో 5లక్షల ఎకరాల్లో సేవలు

హైదరాబాద్, వెలుగు: పొలాల్లో పెస్టిసైడ్స్ పిచికారి చేసే టైమ్​లో అస్వస్థతకు గురవుతున్న రైతులను దృష్టిలో పెట్టుకుని ఇండియన్ ఫార్మర్స్ ఫెర్టిలైజర్ కో ఆపరేటివ్ లిమిటెడ్ (ఇఫ్కో), మారుత్ డ్రోన్ టెక్నాలజీలు కీలక ఒప్పందం చేసుకున్నాయి. తక్కువ టైమ్​లో.. ఎక్కువ విస్తీర్ణంలో పెస్టిసైడ్స్ పిచికారి చేసేలా డ్రోన్ సర్వీస్ అందించేందుకు సిద్ధమవుతున్నాయి. ఎకరాకు కేవలం రూ.500 చార్జ్ చేయనున్నాయి. ఈ మేరకు రెండు కంపెనీలు గురువారం డీల్ కుదుర్చుకున్నాయి. డ్రోన్ యాజ్ ఏ సర్వీస్ (డీఏఏఎస్ – డాస్)గా తెలంగాణ, ఏపీలో 5 లక్షల ఎకరాల్లో డ్రోన్ల ద్వారా పిచికారి చేయనున్నారు. 

రైతులకు అందుబాటు ధరలోనే ఈ సర్వీస్​ను అందిస్తామని మారుత్ డ్రోన్ సీఈవో, కో ఫౌండర్ ప్రేమ్ కుమార్ తెలిపారు. తెలంగాణలోని అన్ని గ్రామాల్లో ఈ సేవలు అందుబాటులో ఉంటాయని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లోని యువతను ఎంట్రప్రెన్యూర్లుగా తీర్చిదిద్దేందుకూ ఇఫ్కోతో ఒప్పందం ఉపయోగపడుతుందని తెలిపారు. ఇప్పటికే చాలా మంది యువత డ్రోన్ టెక్నాలజీపై ఆసక్తి చూపిస్తున్నారన్నారు. ఈ ఒప్పందం వారిని డ్రోన్ సర్వీస్​ ప్రొవైడర్లుగానూ మారుస్తుందని చెప్పారు. అంతేగాకుండా తక్కువ టైమ్​లో డ్రోన్ల ద్వారా పిచికారి చేసుకోవచ్చని, రైతులు అనారోగ్యం బారిన పడకుండా కాపాడొచ్చని తెలిపారు. డబ్బు కూడా ఆదా అవుతుందని చెప్పారు. డ్రోన్ టెక్నాలజీ సాయంతో పంట దిగుబడులు కూడా పెంచే వీలుంటుందన్నారు. రైతులు కూడా ప్రభుత్వ సబ్సిడీ ద్వారా డ్రోన్లను కొనుగోలు చేసేందుకు వీలుంటుందన్నారు.