కార్ల అమ్మకాలలో మారుతి కాస్త బెటర్​

కార్ల అమ్మకాలలో మారుతి కాస్త బెటర్​

న్యూఢిల్లీ:  గత నెలలో మారుతి సుజుకీ అమ్మకాలు పర్వాలేదనిపించాయి. కంపెనీ సేల్స్‌ 2019 ఫిబ్రవరితో పోల్చుకుంటే, ఫిబ్రవరి 2020 లో 1.1 శాతం తగ్గాయి. 2019 ఫిబ్రవరిలో 1,48,682 వాహనాలను విక్రయించిన కంపెనీ, గత నెలలో 1,47,110 వాహనాలు అమ్మింది.  దేశియంగా అమ్మకాలు 1.6 శాతం తగ్గి 1,39,100 వాహనాల నుంచి 1,36,849 వాహనాలకు చేరుకుంది. ఆల్టో, వ్యాగన్‌ ఆర్‌‌ వంటి మిని కార్ల అమ్మకాలు 11.1 శాతం పెరిగి 27,499 వాహనాలుగా ఉన్నాయి. గత ఫిబ్రవరిలో ఈ అమ్మకాలు 24,751 వాహనాలుగా నమోదయ్యాయి. స్వీఫ్ట్‌, సెలారియో, ఇగ్నీస్‌  వంటి కాంపాక్ట్‌ సెగ్మెంట్‌ అమ్మకాలు3.9 శాతం పడిపోయి 69,828 వాహనాలుగా నమోదయ్యాయి. సియాజ్‌ వంటి మిడ్ సెడాన్‌ అమ్మకాలు 2,544 వాహనాలుగా ఉన్నాయి. ఇది గత ఫిబ్రవరిలో 3,084 వాహనాలుగా నమోదైంది. విటారా బ్రెజ్జా, ఎస్‌సీ క్రాస్‌, ఎర్టిగా వంటి యుటిలిటీ వాహనాల అమ్మకాలు 3.5 శాతం పెరిగాయి. గతేడాది ఫిబ్రవరిలో 21,834 వాహనాలుగా ఉన్న ఈ అమ్మకాలు, గత నెలలో 22,604 వాహనాలుగా ఉన్నాయి. మారుతి సుజుకీ ఎగుమతులు 7.1 శాతం పెరిగి 10,261 వాహనాలకు చేరుకుంది.

హ్యుండయ్‌ సేల్స్‌ తగ్గాయి..

హ్యుండయ్‌ అమ్మకాలు గత నెలలో 10 శాతం పడిపోయాయి. గతేడాది ఫిబ్రవరిలో 54,518 వాహనాలుగా ఉన్న అమ్మకాలు, గత నెలలో 48,910 వాహనాలుగా నమోదైంది.  దేశియంగా  కంపెనీ అమ్మకాలు 7.2 శాతం తగ్గి 40,010 వాహనాలుగా ఉంది. ఇది ఫిబ్రవరి 2019 లో 43,110 వాహనాలుగా నమోదైంది.  కంపెనీ ఎగుమతులు 22 శాతం పడిపోయాయి. గతేడాది ఫిబ్రవరిలో 11,408 వాహనాలుగా ఉన్న కంపెనీ అమ్మకాలు, గత నెలలో 8,900 వాహనాలకు తగ్గింది.