
- 22 శాతం తగ్గిన మారుతీ అమ్మకాలు
- మారుతీ బాటలోనే మహింద్రా
- ఎస్కార్స్ట్ 18 శాతం,ఐషర్ 20 శాతం డౌన్
- ఎన్నికలే కారణమంటున్న కంపెనీలు
వాహనాల విక్రయాలు మళ్లీ పడిపోయాయి. పెద్ద కంపెనీల కార్ల అమ్మకాలు బాగా తగ్గిపోయాయి. ఓ వైపు ఎన్నికలు, మరోవైపువినియోగదారుల నుంచి అంతలా డిమాండ్ రాకపోవడంతో అన్ని సెగ్మెంట్ లలో అమ్మకాలు పడిపోయాయి. అతిపెద్ద కార్ల కంపెనీమారుతీ ఎన్నడూ లేనంతగా.. ఎనిమిదేళ్లలో అతి తక్కువ సంఖ్యలోనే కార్లు అమ్మింది.
న్యూఢిల్లీ : దేశంలో అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకి ఇండియా లిమిటెడ్ విక్రయాలు వరుసగా మూడో నెలలో కూడా పడిపోయాయి. 22 శాతం క్షీణించిన మారుతీ కార్ల అమ్మకాలు, మే నెలలో 1,34,641 యూనిట్లకు పడిపోయాయి. 2018 మే నెలలో మారుతీ సుజుకి 1,72,512 యూనిట్ల వెహికిల్స్‌ను అమ్మింది. దేశీయ సేల్స్ కూడా 23.1 శాతం తగ్గిపోయి 1,25,552 యూనిట్లకు చేరాయి. గతేడాది ఇవి 1,63,200 యూనిట్లు. గత ఎనిమిది ఏళ్లలో కంపెనీకి ఇంతలా విక్రయాలు తగ్గిపోవడం ఇదే మొదటిసారి. నెల రివ్యూలో ప్యాసెంజర్ వెహికిల్ విక్రయాలు 25 శాతం తగ్గి 1,21,018 యూనిట్లకు పడిపోయాయి.
మినీ కార్లు ఆల్టో, పాత వాగన్ఆర్ సేల్స్ 56.7 శాతం తగ్గిపోయి 16,394 యూనిట్లుగా.. కాంపాక్ట్ కార్లు కొత్త వాగన్‌ఆర్, సెలెరియో, ఇగ్నిస్, స్విఫ్ట్, బాలెనో, డిజైర్ విక్రయాలు 9.2 శాతం పడి 70,135 యూనిట్లుగా నమోదయ్యాయి. సియాజ్ అమ్మకాలు కూడా 10 శాతం తగ్గిపోయాయి. యుటిలిటీ, వ్యాన్స్ విక్రయాలు కూడా 25.3 శాతం, 29.7 శాతం క్షీణించాయి. కేవలం లైట్ కమర్షియల్ వెహికిల్ విక్రయాలు మాత్రమే 31.1 శాతం పెరిగి 2232 యూనిట్లకు చేరాయి. కంపెనీ ఎగుమతులు కూడా 2.4 శాతం తగ్గిపోయాయి. గతేడాది మే నెలలో 9,312 యూనిట్ల వాహనాలను ఎగుమతి చేస్తే, ఈ ఏడాది 9,089 యూనిట్లు మాత్రమే ఎగుమతి చేసింది.
మహీంద్రాకు కూడా నిరాశే..
మారుతీతో పాటు మహింద్రా విక్రయాలు కూడా మే నెలలో 3 శాతం తగ్గిపోయి 45,421 యూనిట్లకు చేరాయి. గతేడాది ఇదే నెలలో కంపెనీ 46,848 యూనిట్లను విక్రయించినట్టు ఎం అండ్ ఎం ప్రకటించింది. దేశీయ మార్కెట్‌లో అమ్మకాలు 1.7 శాతం తగ్గి 43,056 యూనిట్లుగా నమోదయ్యాయి. ఎగుమతులు కూడా 21.9 శాతం పడిపోయాయి. గతేడాది ఇదే నెలలో 3,030 యూనిట్ల వాహనాలను ఎగుమతి చేస్తే, ఈ ఏడాది 2,365 యూనిట్లను మాత్రమే ఎగుమతి చేసింది. ప్యాసెంజర్ వెహికిల్స్ సెగ్మెంట్‌లో ఈ ఏడాది మే నెలలో 20,608 వాహనాలను విక్రయించింది. గతేడాది ఇదే నెలలో 20,715 వెహికిల్స్‌ను అమ్మింది. కమర్షియల్ వాహనాల సెగ్మెంట్‌లో కంపెనీ గతేడాది 18,748 యూనిట్లను విక్రయిస్తే, ఈ ఏడాది 17,879 వాహనాలను విక్రయించింది. మీడియం, హెవీ కమర్షియల్ వెహికిల్స్ సెగ్మెంట్‌లో 637 యూనిట్లను అమ్మినట్టు మహింద్రా పేర్కొంది. మహింద్రా ట్రాక్టర్ విక్రయాలు కూడా 16 శాతం తగ్గి 24,704 యూనిట్లకు పడిపోయాయి. ఎన్నికలకు ముందు వినియోగదారుల సెంటిమెంట్, డిమాండ్ స్తబ్దుగా ఉందని కంపెనీ తెలిపింది.
ఐషర్ మోటార్స్ ది ఇదే పరిస్థితి…
ఐషర్ మోటార్స్ లిమిటెడ్ సబ్సిడరీ వీఈ కమర్షియల్ వెహికిల్స్ లిమిటెడ్ అమ్మకాలు కూడా 19.7 శాతం పడిపోయాయి. గత నెలలో 4,801 యూనిట్లను విక్రయించింది. ఎస్కార్ట్స్ లిమిటెడ్ కూడా గత నెలలో 6,827ట్రాక్టర్లను మాత్రమే అమ్మింది. గతేడాదితో పోలిస్తే ఈ విక్రయాలు 18 శాతం తక్కువ. తమ దేశీయ విక్రయాలు 19.8 శాతం తగ్గాయని కంపెనీ ఎక్స్చేంజ్ ఫైలింగ్ లో పేర్కొం ది. అయితే ఎగుమతులు మాత్రం 42.4 శాతం పెరిగి 339 యూనిట్లుగా నమోదైనట్టు వెల్లడించింది.