మారుతీ సుజుకీ సేల్స్ జూమ్​

మారుతీ సుజుకీ సేల్స్ జూమ్​

న్యూఢిల్లీ: ఆటోమొబైల్​ కంపెనీలకు పండగలు బాగా కలిసి వచ్చాయి. దీనికితోడు సెమీ కండక్టర్ల కొరత, సప్లై చెయిన్​ ఇబ్బందులు తగ్గి స్పేర్​పార్టులు బాగానే దొరకడంతో తయారీ కూడా మెరుగుపడింది. దీంతో కంపెనీలు భారీ సంఖ్యలో డీలర్లకు స్టాక్​ పంపించాయి. ఫెస్టివల్​ డిమాండ్​ ఊపందుకోవడంతో జనం కార్లను తెగకొంటున్నారు. పోయిన నెలలో ఒకటిరెండు మినహా అన్ని కంపెనీలు తమ అమ్మకాలను భారీస్థాయిలో పెంచుకున్నాయి. బేస్​ ఎఫెక్ట్​ కూడా ఇందుకు కారణం. మారుతీ సుజుకీ, హ్యందాయ్​, టాటా వంటి కంపెనీలన్నీ రెండంకెల గ్రోత్​ను సాధించాయి. హోల్​సేల్స్​ను కనీసం 30 శాతం పెంచుకున్నాయి. కంపెనీల వారీగా అమ్మకాలు ఎలా ఉన్నాయో చూద్దాం.

మారుతీ సుజుకీ సేల్స్ జూమ్​

 దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ ఇండియాకు సెప్టెంబరు‌లో హోల్​సేల్స్​ రెండు రెట్లు పెరిగి 1,76,306 యూనిట్లకు చేరుకున్నాయి.  ఎలక్ట్రానిక్ భాగాల భారీ కొరత కారణంగా కంపెనీ 2021 సెప్టెంబరులో కేవలం 86,380 యూనిట్లను డీలర్లకు పంపగలిగింది.  దేశీయ అమ్మకాలు 68,815 యూనిట్ల నుంచి రెండు రెట్లు పెరిగి 1,54,903 యూనిట్లకు చేరుకున్నాయి. ఆల్టో, ఎస్-ప్రెస్సో వంటి మినీ కార్ల అమ్మకాలు పోయిన ఏడాది ఇదే నెలలో​14,936 యూనిట్లతో పోలిస్తే ఈసారి 29,574 యూనిట్లకు పెరిగాయి. కాంపాక్ట్ సెగ్మెంట్‌లో స్విఫ్ట్, సెలెరియో, ఇగ్నిస్, బాలెనో,  డిజైర్‌ల వంటి కార్ల సేల్స్​ 20,891 యూనిట్ల నుంచి 72,176 యూనిట్లకు పెరిగాయి. సియాజ్​అమ్మకాలు 981 యూనిట్ల నుంచి 1,359 యూనిట్లకు పెరిగాయి. విటారా బ్రెజ్జా, ఎస్-క్రాస్  ఎర్టిగాతో సహా యుటిలిటీ వెహికల్స్​ అమ్మకాలు 18,459 యూనిట్ల నుంచి 32,574 యూనిట్లకు ఎగిశాయి. ఎగుమతులు 17,565 యూనిట్ల నుంచి 21,403 యూనిట్లకు చేరాయి.

హ్యందాయ్ సేల్స్​ 38 శాతం అప్​

హ్యందాయ్  హోల్​సేల్స్​సెప్టెంబరు‌లో 38 శాతం పెరిగి 63,201 యూనిట్లకు చేరుకున్నాయి. ఈ  ఆటోమేకర్ 2021 సెప్టెంబరులో 45,791 యూనిట్లను తన డీలర్లకు పంపింది. డొమెస్టిక్​ హోల్​సేల్స్​ పోయిన నెలలో 49,700 యూనిట్లుగా ఉన్నాయి. 2021 సెప్టెంబరులో 33,087 యూనిట్లతో పోలిస్తే 50 శాతం పెరిగాయి.  ఎగుమతులు 12,704 యూనిట్ల నుంచి 13,501 యూనిట్లకు పెరిగాయి. "పోయిన కొన్ని క్వార్టర్లలో భారత ఆర్థిక వ్యవస్థ సత్తా చాటడంతో పండగ సీజన్ డిమాండ్ ఊపందుకుంది.   మూడు కొత్త మోడల్స్​ -- వెన్యూ, వెన్యూ ఎన్ లైన్,  టక్సన్​లకు కస్టమర్ల నుంచి -ఆశించిన స్పందన వచ్చింది" అని హ్యందాయ్ మోటార్ ఇండియా డైరెక్టర్ (సేల్స్, మార్కెటింగ్ & సర్వీస్) తరుణ్ గార్గ్ ఒక ప్రకటనలో తెలిపారు.

44 శాతం పెరిగిన టాటా సేల్స్​

టాటా మోటార్స్​కు ఈ సెప్టెంబరులో దేశీయ అమ్మకాలు 44 శాతం పెరిగి 80,633 యూనిట్లకు చేరాయి.  2021 సెప్టెంబరులో కంపెనీ 55,988 యూనిట్లను డీలర్లకు పంపింది. ముంబైకి చెందిన ఈ ఆటోమేకర్​ 2021 సెప్టెంబరు‌లో 25,730 యూనిట్లను అమ్మింది. పోయిన నెలలో మొత్తం దేశీయ ప్యాసింజర్ వెహికల్స్ అమ్మకాలు 85 శాతం పెరిగి 47,654 యూనిట్లకు చేరుకున్నాయి. టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ ఎండీ  శైలేష్ చంద్ర మాట్లాడతూ, నెక్సాన్,  పంచ్‌ల రికార్డు అమ్మకాలుతో కంపెనీ పోయిన నెలలో అత్యధికంగా 47,654 నెలవారీ అమ్మకాలను సాధించిందన్నారు.