మారుతీ ఎలక్ట్రిక్ కారు.. ధర 10 లక్షలకుపైనే

మారుతీ ఎలక్ట్రిక్ కారు.. ధర 10 లక్షలకుపైనే

మారుతీ సుజుకీ కంపెనీ నుంచి కూడా ఎలక్ట్రిక్ కారు రాబోతోంది.  అయితే అందుకోసం మరో మూడేళ్లు ఎదురుచూడాల్సిందే. 2025 సంవత్సరంకల్లా మారుతీ సుజుకీ నుంచి ఎలక్ట్రిక్ కారు లాంచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈవిషయాన్ని మారుతీ సుజుకీ సీఈవో  హిసాహీ తకెయూచీ ఇటీవల మీడియాకు వెల్లడించారు. తొలి ఎలక్ట్రిక్ కారు ధర రూ.10 లక్షలకుపైనే ఉంటుందని ఆయన తేల్చి చెప్పారు. ఎలక్ట్రిక్ వాహనాల తయారీకి వినియోగించే టెక్నాలజీ వ్యయప్రయాసలతో కూడుకున్నది కావడం వల్ల రూ.10 లక్షల్లోపు ధరకు ఎలక్ట్రిక్ కారును తీసుకురావడం సాధ్యపడటం లేదని తెలిపారు.

రూ.10 లక్షల్లోపు తీసుకురావాలని భావిస్తే..

ఒకవేళ రూ.10 లక్షల్లోపు ఎలక్ట్రిక్ కారును తీసుకురావాలని భావిస్తే.. తక్కువ కెపాసిటీ కలిగిన బ్యాటరీని అమర్చాల్సి ఉంటుంది. ఆ తరహా చిన్న ఎలక్ట్రిక్ కారు బ్యాటరీని ఒక్కసారి చార్జింగ్ చేస్తే.. 150 కిలోమీటర్లకు మించి జర్నీ చేసే చాన్స్ ఉండదని వాహన మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఇక 2023 సంవత్సరంలో జరగనున్న ఆటో ఎక్స్ పో వేదికగా మారుతీ సుజుకీ ఎలక్ట్రిక్ కారు కాన్సెప్ట్ మోడల్ ను ప్రదర్శించే చాన్స్ ఉంది.మారుతీ సుజుకీ ఎలక్ట్రిక్ కారును సుజుకీ, టొయోట కంపెనీలు సంయుక్తంగా అభివృద్ధి చేయనున్నాయి. వీటిని గుజరాత్ లోని అహ్మదాబాద్ లో ఉన్న మారుతీ సుజుకీ కార్ల ప్లాంట్ లో ఉత్పత్తి చేస్తారు.  ఎలక్ట్రిక్ కార్ల ఉత్పత్తికి హర్యానాలోని సోనిపట్ లో ఉన్న ఐఎంటీ ఖార్ఖోడా ప్రాంతంలో దాదాపు రూ.11వేల కోట్లతో రెండు కార్ల తయారీ ప్లాంట్లను మారుతీ ఏర్పాటు చేయనుంది. 

మారుతీ సుజుకీ ఎలక్ట్రిక్ కారుపై అంచనాలివీ..

  • ఇది మిడ్ సైజ్ స్పోర్ట్స్ యుటిలిటీ వెహికిల్. 4.2 మీటర్ల పొడవు ఉంటుంది. 
  • కారు అభివృద్ధి కోసం టొయోట కంపెనీకి చెందిన డీఎన్జీఏ మాడ్యులర్ ప్లాట్ ఫామ్ ను వినియోగించుకోనున్నారు.
  • రెండు బ్యాటరీల ఆప్షన్ తో కారును తయారు చేయనున్నారు. తద్వారా కారులో 48 కిలో వాట్లు లేదా 59 కిలోవాట్ల బ్యాటరీని అమర్చుకునే వెసులుబాటు ఉంటుంది. 
  • బ్యాటరీని ఫుల్ గా చార్జింగ్ చేస్తే దాదాపు 400 నుంచి 500 కిలోమీటర్ల దూరం జర్నీ చేయొచ్చని అంచనా వేస్తున్నారు.