మళ్లీ మాస్క్​ ! .. కరోనా వేరియంట్​తో​ అలర్ట్​ అయిన సిటిజన్లు

మళ్లీ మాస్క్​ ! .. కరోనా వేరియంట్​తో​ అలర్ట్​ అయిన సిటిజన్లు
  • మాస్క్​లతో కనిపించిన 
  • కాలేజీ, స్కూళ్లకు వెళ్లే స్టూడెంట్లు, ఆఫీసులకు వెళ్లే ఉద్యోగులు 
  • మెడికల్స్ షాపులు , రోడ్​ సైడ్​లో అమ్మకాలు

హైదరాబాద్, వెలుగు : కొన్నాళ్ల కిందట కనుమరుగైన కరోనా భయం మళ్లీ పట్టుకుంది. కరోనా(జేఎన్–1 వేరియంట్) కేసులు  పెరుగుతున్న రాష్ట్రాల్లో జాగ్రత్తలు పాటించాలని  కేంద్రం హెచ్చరించింది. అయితే, సిటీలోనూ జనం ముందస్తుగానే అలర్ట్ అయ్యారు. మంగళవారం ఉదయం స్కూల్స్,  కాలేజీకు వెళ్లే స్టూడెంట్స్​, ఆఫీసులకు వెళ్లేవారిలో కొందరు మాస్క్ లను ధరించి కనిపించారు. ప్రధానంగా జనం రద్దీగా ఉండే ప్రాంతాల్లో తిరిగేవారు మాస్క్​లను పెట్టుకుంటూ కనిపిస్తున్నారు. పక్క రాష్ట్రం కర్నాటకలో 60 ఏళ్ల పైబడిన వారికి మాస్క్ మస్ట్ అనడంతో మళ్లీ కరోనా పెరిగే చాన్స్ ఉందనే భయంతో మాస్క్ లను ధరిస్తున్నట్లు పలువురు చెబుతున్నారు. 

  మాస్క్​ల అమ్మకాలు షురూ..

కరోనా వేరియంట్ అలర్ట్​తో మాస్క్​లకు డిమాండ్ ఏర్పడింది. మెడికల్ ​షాపులతో పాటు రోడ్ సైడ్ కూడా అమ్మకాలు  మొదలయ్యాయి. కొద్ది నెలల కిందట కరోనా తగ్గుముఖం పట్టడంతో మాస్క్​ల వాడకం ఒక్కసారిగా తగ్గింది. దీంతో రోడ్డు పక్కన మాస్క్​ల అమ్మకాలు కూడా బంద్ పెట్టారు. ఇప్పుడు మళ్లీ కరోనా వేరియంట్ ప్రకటనతో చిరు వ్యాపారులు రోడ్డు పక్కన 
మాస్క్​లు అమ్ముతూ కనిపించారు. మాస్క్​ల వాడకం పెరిగితే బిజినెస్ అవుతుందని వ్యాపారులు చెబుతున్నారు. సిటీలో కొత్త వేరియంట్ కేసులు నమోదైతే రాష్ట్ర ప్రభుత్వం మరింతగా జాగ్రత్తలు తీసుకునే చాన్స్ కనిపిస్తుంది. పిల్లలు, స్టూడెంట్ల పేరెంట్స్ ఇప్పటికే అలర్ట్ అయ్యారు. 

ప్రతి ఏటా ఇదే నెల.. 

మూడేళ్లుగా డిసెంబర్ రాగానే కరోనా కేసులు పెరుగుతున్న పరిస్థితి ఉంది. 2021డిసెంబర్​లో ఒమిక్రాన్ వేరియంట్ కేసులు నమోదు అయ్యాయి. మాస్క్ మస్ట్ అని ప్రభుత్వం రూల్ పెట్టడంతో అప్పట్లో వాటి వాడకం ఒక్కసారిగా పెరిగింది.  మాస్క్​ల షార్టేజ్​తో రేట్లు ఒక్కసారిగా డబుల్ చేశారు.  ఇప్పటికైతే ఆ పరిస్థితులు కనిపించడంలేదు. ప్రస్తుతం హోల్ సేల్​లో యూజ్ అండ్ త్రో టూ ప్లయర్, త్రీ ప్లయర్ మాస్క్ ధర రూ. 2 – రూ. 3  వరకు, రిటైల్​లో రూ.5 – రూ.10  ఉన్నాయి. ఎన్ 95 మాస్క్​ల ధర ప్రస్తుతం రూ.50  వరకు ఉంది. మాస్క్ లకు డిమాండ్ ఏర్పడే చాన్స్ ఉండటంతో డీలర్లు కూడా స్టాక్​పై ఫోకస్ పెట్టారు.  

జాగ్రత్తలు తీసుకుంటే చాలు
 
దేశంలో కరోనా కేసులు మళ్లీ వస్తున్నాయి. ఈసారి ఒమిక్రాన్ సబ్ వేరియంట్ జేఎన్​–1 కేసులు కేరళతో పాటు కొన్ని రాష్ట్రాల్లో నమోదవుతున్నాయి.  దగ్గు, గొంతునొప్పి, జ్వరం, బాడీ పెయిన్స్, ఆయాసం, ఆక్సిజన్ లెవెల్స్ పడిపోవడం వంటి లక్షణాలు ఉంటాయి.  అయితే.. దీని తీవ్రత సింగపూర్, దక్షిణాసియా దేశాల్లో ఎక్కువగా ఉంది. అమెరికాలో ఇదే వైరస్ ను హెచ్ఎన్ –1 గా గుర్తించారు. ఇప్పటివరకు తెలంగాణలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. వైరస్ సోకిన వారిలో ఆక్సిజన్ లెవెల్స్ పడిపోతే హాస్పిటల్​లో అడ్మిట్ చేయించాలి. ఇప్పటికే కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వారు భయాందోళన పడాల్సిన పనిలేదు.  ప్రభుత్వం కూడా వెంటనే స్పందించి గాంధీ ఆస్పత్రిలో 50 బెడ్స్ తో ప్రత్యేక వార్డును ఏర్పాటు చేసింది. ముందస్తు జాగ్రత్తలో భాగంగా ప్రజలు మాస్క్, ఫేస్ షీల్డ్ వాడాలి.
 

 – డాక్టర్ విజయ్ భాస్కర్, ఎథిక్స్ కమిటీ క్లినికల్ రీసెర్చ్ అండ్ ట్రయల్స్ చైర్మన్