బీఆర్ఎస్ ఆవిర్భావ సభ కోసం భారీ స్థాయిలో ఏర్పాట్లు

బీఆర్ఎస్ ఆవిర్భావ సభ కోసం భారీ స్థాయిలో ఏర్పాట్లు
  • కటౌట్లు, ఫ్లెక్సీలతో రోడ్లన్నీ ఫుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌..
  • రేపు ఉదయం నుంచి రాత్రి దాకా ట్రాఫిక్ ఆంక్షలు
  • ఆర్టీసీ బస్సులన్నీ బుక్.. స్కూల్ బస్సులు కూడా..
  • 4 వేల మంది పోలీసులతో భారీ బందోబస్తు
  • 100 ఎకరాల్లో బీఆర్ఎస్ సభ.. 448 ఎకరాల్లో పార్కింగ్

ఖమ్మం, వెలుగు: ఖమ్మంలో బుధవారం జరగనున్న బీఆర్ఎస్ ఆవిర్భావ సభ కోసం అధికార పార్టీ లీడర్లు భారీ స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నారు. పార్టీ పేరు మార్పు తర్వాత మొదటిసారి నిర్వహిస్తుండటం, సీఎం కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తోపాటు మరో మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, జాతీయ స్థాయి నేతలు వస్తుండడంతో సభ నిర్వహణను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. సీఎంల కోసం ప్రత్యేకంగా రెండు హెలికాప్టర్లు సిద్ధం చేశారు. 

100 మంది ప్రముఖుల కోసం ఇప్పటికే సిటీలోని హోటల్ రూములన్నీ బుక్​చేశారు. ఐదు లక్షల మందిని సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్న లీడర్లు.. ఇందుకోసం వందలాది ఆర్టీసీ బస్సులను సభకు మళ్లిస్తున్నారు. బస్సులు సరిపోని చోట ప్రైవేట్ స్కూల్​బస్సుల కోసం ప్రయత్నిస్తున్నారు. వీటికి తోడు వేలాది  కార్లు, 3 వేలకు పైగా ఇతర వాహనాలు వస్తాయనే అంచనాతో 100 ఎకరాల్లో జరగనున్న సభ కోసం ఏకంగా 448 ఎకరాల్లో పార్కింగ్ ఏర్పాట్లు చేస్తున్నారు. సిటీ అంతటా కటౌట్లు, ఫ్లెక్సీలు, హోర్డింగులతో నింపేశారు. పలువురు ఐపీఎస్‌‌‌‌లు, ఐజీ ర్యాంక్ అధికారులకు ఖమ్మం మీటింగ్ కోసం డ్యూటీలు వేశారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి సుమారు 4,198 మంది సిబ్బందిని బందోబస్తు కోసం తరలిస్తున్నారు. ఖమ్మం నుంచి వైరా వెళ్లే రోడ్డులో కొత్త కలెక్టరేట్ వెనకాల సభాస్థలి ఉండగా, ముందు వరుసలో ఏకంగా 5 వేల మంది కూర్చునేందుకు వీలుగా సోఫాలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్తున్నారు. ఈ పబ్లిక్ మీటింగ్ కోసం బీఆర్ఎస్ ఏకంగా కోట్లాది రూపా యలు ఖర్చు చేస్తున్నదని చర్చ జరుగుతున్నది.

వందలాది బస్సులు

సభ కోసం రాష్ట్రవ్యాప్తంగా పెద్దసంఖ్యలో ఆర్టీసీ బస్సులను మళ్లిస్తున్నారు. ఖమ్మం రీజియన్‌‌‌‌లోని ఆరు డిపోల పరిధిలో 550 బస్సులకు గాను 205 బస్సులను ఇప్పటికే బుక్ చేసుకున్నారు. మరో 199 బస్సులు కావాలని అడిగారు. ఈ రీజియన్ నుంచి శబరిమల, ఇతర దూర ప్రాంతాలకు వెళ్లిన 100కు పైగా బస్సులు ఈనెల 19న తిరిగిరానున్నాయి. సంక్రాంతి పండుగ కోసం జిల్లాకు వచ్చిన జనం హైదరాబాద్ తిరిగి వెళ్లేందుకు మరికొన్ని బస్సులు అవసరం. దీంతో మరిన్ని బస్సులు కేటాయించేందుకు ఆఫీసర్లు తర్జనభర్జన పడ్తున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్, నల్గొండ, ఇతర రీజియన్ల నుంచి బస్సులను అడ్జస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నామని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. ఇక వరంగల్ రీజియన్ నుంచి మహబూబాబాద్ జిల్లా బీఆర్ఎస్ పేరుతో 1,100 బస్సులను బుక్ చేశారు. ఇందులో వరంగల్ రీజియన్ పరిధిలో 300 బస్సులను అడ్జస్ట్ చేస్తున్నారు. మిగిలిన 800 బస్సులను ఇతర రీజియన్ల నుంచి తెప్పిస్తామని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. ఖమ్మంలో తక్కువ బస్సులు అందుబాటులో ఉండడంతో ఏపీలోని నూజివీడు, తిరువూరు, జంగారెడ్డిగూడెం, విజయవాడ డిపోల నుంచి బస్సులు అద్దెకు తీసుకుంటున్నామని బీఆర్ఎస్ లీడర్లు అంటున్నారు. సూర్యాపేటలోనూ 100 ఆర్టీసీ బస్సులను బుక్ చేశారు. ఈలెక్కన రాష్ట్రవ్యాప్తంగా బుధవారం ఆర్టీసీ ప్రయాణికులకు కష్టాలు తప్పేలా లేవు.  జనం ఆ రోజు ప్రయాణాలు సాధ్యమైనంతవరకు వాయిదా వేసుకుంటేనే మంచిదని ఆఫీసర్లు ఆఫ్ ది రికార్డు చెప్తున్నారు. ఆర్టీసీ బస్సులు సరిపోని చోట స్కూల్ బస్సుల కోసం లీడర్లు ప్రయత్నిస్తున్నారు. ఇదే జరిగితే ఉమ్మడి ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాల్లోనే చాలా ప్రైవేట్ స్కూళ్లను బంద్ పెట్టక తప్పదని విద్యాశాఖ వర్గాలు చెప్తున్నాయి. మరోవైపు ఈనెల 18న ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ఖమ్మంలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. సిటీకి వచ్చే వాహనాలను, ఖమ్మం నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లే వాహనాలను దారి మళ్లిస్తున్నారు.

అడుగుకో హోర్డింగ్

సభకు రెండు రోజుల ముందే ఖమ్మం నగరాన్ని బీఆర్ఎస్ లీడర్లు గులాబీమయం చేశారు. సిటీకి చేరుకునే అన్ని ప్రధాన రోడ్లపై భారీగా ఫ్లెక్సీలు, హోర్డింగ్​లు ఏర్పాటు చేశారు. ఉమ్మడి జిల్లా నుంచే కాకుండా పక్కనున్న మహబూబాబాద్, సూర్యాపేట జిల్లాల్లోని మొత్తం 18 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి 5 లక్షల మంది జనాన్ని సమీకరించేందుకు ఎమ్మెల్యేలకు టార్గెట్ విధించారు. ఆ అంచనాతో ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధానంగా 13 నియోజకవర్గాలపై ప్రధానంగా ఫోకస్ పెట్టారు. స్థానిక ఎమ్మెల్యేకు అదనంగా మరో ఎంపీ, ఎమ్మెల్యే, లేదా ఎమ్మెల్సీకి ఆయా నియోజకవర్గాల్లో బాధ్యతలు అప్పగించారు. జనాలను తరలించేందుకు ఆర్టీసీ బస్సులతో పాటు, ప్రైవేట్ బస్సులు, లారీలు, డీసీఎంలు, వ్యాన్లు, ఆటోలను కూడా బుక్ చేస్తున్నారు.

కమ్యూనిస్టు లీడర్లకు టాప్ ప్రయారిటీ

ఖమ్మం మీటింగ్‌‌‌‌కు ఆమ్​ఆద్మీ పార్టీ చీఫ్, ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్‌‌‌‌, సీపీఎంకు చెందిన కేరళ సీఎం పినరయి విజయన్, సమాజ్‌‌‌‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్, సీపీఐ జాతీయ కార్యదర్శి రాజా, రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తదితరులు హాజరవుతున్నారు. వీళ్లతోపాటు సీపీఐ జాతీయ నేత, రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ తండ్రి పువ్వాడ నాగేశ్వరరావు, ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులను మాత్రమే సభా వేదిక పైకి అనుమతించనున్నారు. మిగిలిన రాష్ట్ర మంత్రులు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, ముఖ్య నేతలంతా సభావేదిక ముందు కూర్చుకునేందుకు ప్రత్యేకంగా సోఫాలను, వీఐపీ కుర్చీలను ఏర్పాటు చేస్తున్నారు. సీపీఎం నుంచి సీఎం పినరయి విజయన్ అటెండ్ అవుతుండడంతో ఆ పార్టీ జాతీయ కార్యదర్శి రావడం లేదు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్‌‌‌‌తో సీపీఐ, సీపీఎం పొత్తు ఖరారు అయినందుకే ఆ పార్టీ లీడర్లకు సీఎం కేసీఆర్ టాప్ ప్రయారిటీ ఇస్తున్నారన్న అభిప్రాయాలున్నాయి.

ప్రగతి భవన్‌‌‌‌లో బ్రేక్ ఫాస్ట్, యాదాద్రి దర్శనం

మంగళవారం సాయంత్రం 6 గంటలకు కేజ్రీవాల్, రాత్రి 9 గంటలకు విజయన్, రాత్రి 10 గంటలకు అఖిలేశ్‌‌‌‌ హైదరాబాద్ కు చేరుకుంటారు. బేగంపేటలోని ఐటీసీ కాకతీయ హోటల్ లో బస చేస్తారు. పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్ కూడా హాజరవుతారని చెప్తున్నా ఇప్పటి వరకు ఆయన షెడ్యూల్ అధికారికంగా ఖరారు కాలేదని సమాచారం. నేతలంతా బుధవారం ప్రగతి భవన్‌‌‌‌లో సీఎం కేసీఆర్‌‌‌‌‌‌‌‌తో సమావేశమవుతారు. ప్రస్తుత జాతీయ రాజకీయాలపై చర్చిస్తారు. తర్వాత బ్రేక్ ఫాస్ట్ చేస్తారు. అక్కడి నుంచి రెండు హెలికాప్టర్లలో యాదాద్రి వెళ్లి.. లక్ష్మీ నర్సింహస్వామి దర్శనం చేసుకుంటారు. ఖమ్మం వెళ్లి కొత్త కలెక్టరేట్‌‌‌‌ను ప్రారంభిస్తారు. నలుగురు ముఖ్యమంత్రులు, అఖిలేశ్, డి.రాజా చేతులమీదుగా కంటివెలుగు రెండో విడతను ప్రారంభిస్తారు. లంచ్ తర్వాత బహిరంగ సభలో లీడర్లు పాల్గొంటారు. అతిథులకు కప్పే శాలువాలను నారాయణపేట, పోచంపల్లి నుంచి తెప్పిస్తున్నారు.