యాదగిరిగుట్టలో భక్తుల రద్దీ

యాదగిరిగుట్టలో భక్తుల రద్దీ
  •     ధర్మదర్శనానికి రెండు, స్పెషల్ దర్శనానికి అరగంట సమయం

యాదగిరిగుట్ట, వెలుగు : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చిన భక్తులతో లక్ష్మీపుష్కరిణి, కల్యాణకట్ట, పార్కింగ్ ఏరియా, బస్ బే ప్రాంగణం, దర్శన, ప్రసాద క్యూలైన్లు, ప్రధానాలయ ప్రాంగణం కోలాహలంగా మారాయి. రద్దీ కారణంగా స్వామివారి దర్శనానికి రెండు గంటలు, స్పెషల్ దర్శనానికి అరగంట సమయం పట్టిందని భక్తులు తెలిపారు.

ఆలయంలో నిర్వహించిన నిత్యకల్యాణం, సుదర్శన నారసింహ హోమం, బ్రహ్మోత్సవ పూజల్లో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. స్వామివారిని ఆదివారం పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినీరెడ్డి దర్శించుకున్నారు. గర్భగుడిలో స్వయంభ నారసింహుడిని దర్శించుకుని ప్రధానాలయ ముఖ మంటపంలో ఉత్సవమూర్తులకు అష్టోత్తర పూజలు నిర్వహించారు.

ఆలయ అర్చకులు ఆమెకు వేదాశీర్వచనం చేయగా.. అధికారులు లడ్డూ ప్రసాదం, స్వామివారి శేషవస్త్రాలు అందజేశారు. ఆదివారం భక్తులు జరిపించిన పలు రకాల పూజలు, నిత్య కైంకర్యాల ద్వారా ఆలయానికి రూ.42,45,140 ఆదాయం సమకూరింది. ప్రసాద విక్రయం ద్వారా అత్యధికంగా రూ.14,18,840, వీఐపీ దర్శన టికెట్ల ద్వారా రూ.7.35 లక్షల ఆదాయం వచ్చినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు.