సరస్వతి పుష్కరాలకు పోటెత్తిన భక్తులు

సరస్వతి పుష్కరాలకు పోటెత్తిన భక్తులు
  • ఆదివారం కావడంతో వివిధ జిల్లాల నుంచి రాక

జయశంకర్ భూపాలపల్లి/ మహదేవ్‌పూర్‌, వెలుగు : కాళేశ్వరంలో జరుగుతున్న సరస్వతి పుష్కరాలకు భక్తులు తండోపతండాలుగా తరలివస్తున్నారు. ఆదివారం కావడంతో ఉదయం నుంచే లక్షలాది మంది భక్తులు త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు ఆచరించారు. దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన భక్త జనం కాళేశ్వరుడిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. ఆదివారం ఉదయం, సాయంత్రం వాహనాలు ట్రాఫిక్ లో చిక్కుకున్నాయి.

కాళేశ్వరం నుంచి మహదేవపూర్  మధ్యలో 16 కిలోమీటర్ల వరకు వాహనాలు నిలిచిపోయాయి. పుష్పగిరి పీఠాధిపతులు సభినవోద్దండ విద్యాశంకర భారతీ మహస్వామి పుష్కర స్నానం ఆచరించి స్వామిని దర్శించుకున్నారు. హైకోర్టు జడ్జి సుధామూర్తి, సినీ నటుడు రాజేంద్ర ప్రసాద్  పుష్కరస్నానం ఆచరించారు. 

హెలికాప్టర్‌  జాయ్  రైడ్స్‌  స్టార్ట్‌..‌

కాళేశ్వరంలో ఆదివారం నుంచి హెలికాప్టర్  చక్కర్లు కొడుతోంది. హెలీకాప్టర్‌  జాయ్‌  రైడ్స్‌ను కలెక్టర్‌ రాహుల్‌ శర్మ ప్రారంభించారు. 7 నిమిషాల రైడ్‌  కోసం ఒక్కొక్కరికి రూ.4,500 చొప్పున రేట్‌ ఫిక్స్‌  చేశారు. యాత్రధామ్.ఓఆర్జీ యాప్​లో ఆన్​లైన్​లో బుక్ చేసుకోవాలని ఆఫీసర్లు సూచించారు. టెంట్‌ సిటీ, దేవస్థానం పూజలను ఈ యాప్​లో  పొందుపర్చినట్లు తెలిపారు. కాళేశ్వరంలో భక్తుల రద్దీ నెలకొనడంతో కలెక్టర్  హెలికాప్టర్  ద్వారా ఏరియల్  సర్వే నిర్వహించారు. నదీ తీరం, వాహనాల రాకపోకలు, ఏర్పాట్లను పర్యవేక్షించారు.