కోఠిలో భారీ అగ్నిప్రమాదం.. రూ. కోటి వరకు ఆస్తి నష్టం

కోఠిలో భారీ అగ్నిప్రమాదం.. రూ. కోటి వరకు ఆస్తి నష్టం

హైదరాబాద్‌లో రోడ్‌సైడ్ షాపింగ్‌కు ఎంతో ఫేమస్ అయిన కోటిలో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 8 బట్టల షాపులు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఈ సంఘటన కోటి చౌరస్తాలోని ఆంధ్రా బ్యాంక్ ఎదురుగా ఉన్న షాపుల సముదాయంలో చోటుచేసుకుంది. శనివారం రాత్రి 11 గంటల 45నిమిషాల సమయంలో బట్టషాపుల్లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఈ మంటల్లో షాపుల్లోని బట్టలు పూర్తిగా దగ్దమయ్యాయి. విషయం తెలిసి ఘటనాస్థలానికి అధికారులు నాలుగు ఫైరింజన్లతో వచ్చి.. మంటలు ఆర్పేందుకు ఎంత ప్రయత్నించినా మంటలు అదుపులోకి రాలేదు. కేవలం గంట వ్యవధిలోనే షాపుల్లోని బట్టలు పూర్తిగా కాలిపోయాయి. ఈ మంటల్లో మొత్తం ఎనిమిది బట్టల దుకాణాలు అగ్నికి ఆహుతయ్యాయి. న్యూ లార్డ్స్, సందీప్ ఖురానా, హర్యానా హ్యాండ్లూమ్స్, సతీష్ చంద్ జైస్వాల్, హర్యానా హ్యాండ్లూమ్స్, భవానీ ఫ్యాషన్ వేర్ మొదలైన షాపులు కాలిపోయాయి. అన్ని షాపుల్లో కలిపి దాదాపు రూ. కోటి వరకు నష్టం జరిగినట్లు తెలుస్తోంది. రాత్రి సమయంలో ప్రమాదం జరగడంతో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు.

మంటల్లో తగలబడిపోతున్న షాపుల వద్దకు వచ్చిన వ్యాపారులు కన్నీటి పర్యంతమయ్యారు. లక్షల రూపాయల బట్టలు మంటల్లో కాలి బుడిదయ్యాయని, తమను ప్రభుత్వమే ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ స్థలాన్ని స్వాధీనం చేసుకోవడం కోసం కొందరు ప్రైవేట్ వ్యక్తులు.. ఈ భూమి తమదేనంటూ కేసు వేశారని షాపుల యజమానులు అంటున్నారు. ఆ కేసుకు సంబంధించి కోర్టులో వివాదం నడుస్తోందని.. వారే కావాలని ఈ పని చేసి ఉండొచ్చని బాధిత వ్యాపారులు ఆరోపించారు. ప్రమాదంపై సమగ్ర విచారణ జరిపాలని స్థానిక నాయకులు డిమాండ్ చేశారు. షాపుల్లో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయా లేక ఎవరైనా కావాలనే చేశారా అనే కోణంలో విచారణ చేపట్టి వ్యాపారులకు న్యాయం చేయాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. సంఘటనా స్థలాన్ని షీ టీమ్స్ అడిషనల్ డీసీపీ శిరీష రాఘవేంద్ర, ఏసీపి బీఆర్ నాయక్ పరిశీలించారు. ప్రమాద స్థలంలో క్లూస్ టీం ఆధారాలను సేకరించింది.

For More News..

వెహికల్స్ నడిపేటప్పుడు పల్స్ రేట్ తగ్గినా హెచ్చరించే గ్లోవ్స్

మమత ఈగో వల్ల రైతులు నష్టపోయారు

‘చక్కాజామ్‌’తో మూడు రాష్ట్రాల్లో బండ్లు కదల్లే..

ప్రగతిభవన్‌కు పోనీయరు.. బీఆర్కే భవన్‌కు రానీయరు