7 కిలోమీటర్ల ప్రయాణానికి 30 గంటలా..! నాలుగు రోజులుగా రోడ్ల పైనే.. ఇదేం ట్రాఫిక్ జామ్ దేవుడో..!

7 కిలోమీటర్ల ప్రయాణానికి 30 గంటలా..! నాలుగు రోజులుగా రోడ్ల పైనే.. ఇదేం ట్రాఫిక్ జామ్ దేవుడో..!

దసరా, సంక్రాంతి సమయంలో హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై ట్రాఫిక్ జామ్ కారణంగా అర గంట వాహనాలు ఆగిపోతేనే మీడియాలో, సోషల్ మీడియాలో వీడియోలు హల్చల్ చేస్తుంటాయి. కానీ.. నాలుగు రోజులుగా హైవేపై తిండీతిప్పలు లేకుండా ట్రాఫిక్లో చిక్కుకుపోతే ఎలా ఉంటుంది ? అంతకు మించిన నరకం ఉండదు. ఢిల్లీ–కోల్ కత్తా హైవేపై ఇదే జరిగింది.

నాలుగు రోజులుగా నేషనల్ హైవే 19పై ప్రయాణికులు చుక్కలు చూస్తున్నారు. వందల వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. 7 కిలోమీటర్లు వెళ్లడానికి 30 గంటలు పట్టిందంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. గత శుక్రవారం బీహార్లోని రోహ్తాస్ జిల్లాలో కుండపోత వర్షాలు కురిశాయి. ఫలితంగా.. నేషనల్ హైవే 19పై గుంతలు.. గోతులు ఏర్పడ్డాయి. నేషనల్ హైవే 19 చాలా వరకూ పాడైపోవడంతో ప్రయాణం చాలా కష్టమైపోయింది.

ఈ కారణంగా.. రోజుకు కేవలం ఐదు కిలోమీటర్లు మాత్రమే ప్రయాణం చేయగలిగిన పరిస్థితులున్నాయి. రెండు రోజులుగా ట్రాఫిక్ జామ్‌లో చిక్కుకుపోయామని, ఆకలితో, దాహంతో, దయనీయ స్థితిలో ఉన్నామని ఆవేదన వ్యక్తం చేశారు. కొన్ని కిలోమీటర్లు ప్రయాణించడానికి కూడా గంటల సమయం పడుతుందని కోల్‌కతాకు చెందిన ట్రక్ డ్రైవర్ సంజయ్ సింగ్ తన చేదు అనుభవం గురించి వివరించారు.

ట్రాఫిక్ జామ్ వ్యాపారాలను కూడా దెబ్బతీసింది. త్వరగా వెళ్లాల్సిన అవసరం ఉన్నప్పటికీ ఫుడ్ ప్రొడక్ట్స్ తీసుకెళుతున్న కొన్ని లారీలు కూడా ఈ ట్రాఫిక్ జాంలో చిక్కుకుపోవడంతో ఆహార పదార్థాలు పాడైపోయాయి. ఇలా ఢిల్లీ–కోల్ కత్తా హైవేపై వాహనాదారులు నాలుగు రోజుల నుంచి నరకం చూస్తున్నారు.