మెదక్ టౌన్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం చివరి గింజ వరకు కొనుగోలు చేస్తుందని, జిల్లా వ్యాప్తంగా ముమ్మరంగా వడ్ల కొనుగోళ్లు జరుగుతున్నాయని మెదక్ కలెక్టర్ ప్రతిమాసింగ్ అన్నారు. ఎప్పటికప్పుడు ధాన్యాన్ని మిల్లులకు తరలిస్తున్నట్లు ఆమె తెలిపారు.
మంగళవారం ఆమె మాట్లాడుతూ ఇప్పటివరకు 38,402 మంది రైతుల ఖాతాల్లో రూ.423,52 కోట్లు జమ చేసినట్లు పేర్కొన్నారు. మెదక్ జిల్లా వెనుకబడిన తరగతుల(బీసీ) వెల్ఫేర్ అధికారిగా ఉపేందర్ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన కలెక్టర్ ప్రతిమాసింగ్‌ను కలిసి పూలమొక్క అందించారు.
ధాన్యాన్ని వెంటనే తరలించాలి
సిద్దిపేట రూరల్ : అకాల వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిక నేపథ్యంలో జిల్లాలోని కొనుగోలు సెంటర్లలోని వడ్లను యుద్ధప్రాతిపదికన తరలించాలని సిద్దిపేట కలెక్టర్ కె.హైమావతి అధికారులను ఆదేశించారు.
మంగళవారం చిన్నకోడూరు మండలంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ గోదాం, జిల్లా కేంద్రంలోని ఆధునిక వ్యవసాయ మార్కెట్ యార్డ్‌లో కొనుగోలు, దిగుమతి ప్రక్రియను కలెక్టర్ పరిశీలించారు. ఆమె మాట్లాడుతూ వరి, మక్కల కొనుగోళ్లు ఒకేసారి చేపట్టాల్సి రావడంతో హమాలీ, లారీల కొరత ఏర్పడిందన్నారు. ప్రణాళిక ప్రకారం కొనుగోళ్లు స్పీడప్చేసినట్లు కలెక్టర్ చెప్పారు. రైతులు సంయమనం పాటిస్తూ అధికారులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
