కరీంనగర్ లో దొంగలు రెచ్చిపోతున్నారు. టార్గెట్ చేసి మరీ ఇళ్లు గుల్ల చేస్తున్నారు. రోజూ ఎక్కడికెళ్తున్నారో గమనించి పక్కాగా ఇంట్లో లేని సమయంలో చోరీలకు పాల్పడుతున్నారు. డిసెంబర్ 3న అర్థరాత్రి రెండు గంటలకు సప్తగిరి కాలనీలోని విజేత మనోహర హెవెన్స్ అపార్ట్ మెంట్ లో భారీ చోరీకి పాల్పడ్డారు దొంగలు.
అపార్టు మెంట్ లోకి చొరబడిన ముగ్గురు దొంగలు మొదట అపార్ట్ మెంట్ వాచ్ మెన్ నివాసముండే గదికి బయట నుంచి గడియపెట్టి చోరీకి పాల్పడ్డారు.. ఒకరు గేటు దగ్గరా కాపలాగా ఉండగా.. మరో ఇద్దరు పైకి వెళ్లి మొదటి అంతస్తు, నాలుగో అంతస్తులోని రెండు ప్లాట్ల ఇంటి తాళాలు పగుల గొట్టి దొంగతనం చేశారు. కరీంనగర్ లో బేకరీ వ్యాపారి అయిన సందీప్ ప్లాట్ లో 10 తులాల బంగారం, కిలో వెండి, లక్షా 75 వేల రూపాయల నగదు దొంగిలించారు. నాలుగో అంతస్తులోని మూల కిష్టయ్య అనే రిటైర్డ్ సింగరేణి కార్మికుని ఇంట్లో 8 తులాల గోల్డ్, 20 తులాల వెండి ఎత్తుకెళ్లారు దొంగలు.
ఇద్దరూ ఇంట్లో లేరని తెలుసుకుని నేరుగా అవే ప్లాట్లను టార్గెట్ చేసి చోరీ చేశారు. చోరీ దృశ్యాలు అపార్ట్ మెంట్ లోని సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితులను పట్టుకుంటామని చెప్పారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా దొంగల ఆచూకీ దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు పోలీసులు .
