బినామీ పేర్లతో జీతాలు..మెంబర్ షిప్ ల డబ్బులు మాయం!

బినామీ పేర్లతో జీతాలు..మెంబర్ షిప్ ల డబ్బులు మాయం!
  • కల్పలత సూపర్ బజార్ లో కుంభకోణం
  • ఎమ్మెల్యే నాయిని ఆకస్మిక తనిఖీతో వెలుగులోకి..

హనుమకొండ, వెలుగు: జిల్లా కోఆపరేటివ్ స్టోర్స్ లిమిటెడ్ ఆధ్వర్యంలో నడిచే వరంగల్ రంగంపేటలోని కల్పలత సూపర్ బజార్ లో భారీ కుంభకోణం బయటపడింది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఏర్పడిన పాలకవర్గ సభ్యులు బినామీ పేర్లతో జీతాలు తీసుకోవడంతో పాటు మెంబర్ షిప్ లతో సంస్థకు రావాల్సిన ఆదాయాన్ని దోచుకున్నట్లు తేలింది. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మంగళవారం కల్పలత సూపర్ బజార్ ను ఆకస్మికంగా తనిఖీ చేయగా, అవినీతి బట్టబయలైంది. 

దీంతో ఎమ్మెల్యే హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీశ్ తో ఫోన్ లో మాట్లాడి ఫిర్యాదు చేశారు. వెంటనే కమిటీని రద్దు చేసి, విచారణ జరిపించి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. కాగా ఆర్డీవో రమేశ్ రాథోడ్ కల్పలత సూపర్ బజార్ కు చేరుకుని విచారణ చేపట్టారు. సూపర్ బజార్ కు సంబంధించిన రికార్డులు సీజ్ చేశారు. సూపర్ బజార్ లో ఎంత వరకు స్కామ్ జరిగిందనే దానిపై విచారణ జరుపుతున్నారు.

సభ్యత్వ నమోదు, జీతాల పేరుతో స్కామ్..

కల్పలత సూపర్ బజార్ లో అవకతవకలు జరిగినట్లు ఎమ్మెల్యే నాయినికి ఇప్పటికే ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలో మంగళవారం ఆయన సూపర్ బజార్ ను సడెన్ విజిట్ చేశారు. ఆ సమయంలో పది మందికి బదులు కేవలం ముగ్గురు సిబ్బంది మాత్రమే విధుల్లో ఉండటంతో అసహనం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే, అక్కడి సిబ్బందితో మాట్లాడి వివరాలు సేకరించారు.

 సూపర్ బజార్ లో అవకతవకలపై ఆర్డీవో రమేశ్ రాథోడ్ ను పిలిపించి విచారణ చేపట్టారు. ఆఫీస్ లో ఉన్న రికార్డులను పరిశీలించగా, సూపర్ బజార్ ఆధ్వర్యంలో నడుస్తున్న పెట్రోల్ బంక్ నుంచి 10 మంది బినామీ ఉద్యోగుల పేర్లతో మూడేండ్లుగా ప్రతినెలా రూ.10 వేల వరకు జీతాలు తీసుకున్నట్లు తేలింది. సూపర్ బజార్ మెంబర్ షిప్ పేరున కూడా స్కామ్ కు జరిగినట్లు సిబ్బంది ఆరోపిస్తున్నారు.

 కొంతమందికి ఫేక్ మెంబర్ షిప్ లు చేశారని, వారి నుంచి సంస్థకు చెల్లించాల్సిన సభ్యత్వ రుసుంను కూడా సొంత ఖర్చులకు వాడుకున్నట్లు ఆఫీసర్ల దృష్టికి తీసుకెళ్లారు. కల్పలత సూపర్ బజార్ ఆధ్వర్యంలో నడిచే పెట్రోల్ బంక్ నుంచి దాదాపు మూడేళ్లుగా పెట్రోల్, డీజిల్ ను  ఫ్రీగా వాడుకున్నట్లు ఆఫీసర్లు గుర్తించారు. కాగా, సూపర్ బజార్ లో పని చేస్తున్న తమకు రావాల్సిన రూ.12 వేలలో రూ.6 వేలు మాత్రమే చెల్లించి మొత్తం జీతం ఇచ్చినట్లుగా సంతకాలు పెట్టించుకుంటున్నారని అక్కడి మహిళా సిబ్బంది ఆరోపించారు. 

సంస్థకు రావాల్సిన ఆదాయాన్ని సొంతంగా వాడుకున్నారని, ఇదేంటని ప్రశ్నిస్తే తమను చంపుతామని బెదిరిస్తున్నారని మహిళా సిబ్బంది ఎమ్మెల్యే నాయిని, ఆఫీసర్ల ఎదుట వాపోయారు. కమిటీ చైర్మన్ జనార్దన్ భయభ్రాంతులకు గురి చేస్తున్నారని, పాలకవర్గం అవినీతిని బయటపెట్టినందుకు చైర్మన్, డైరెక్టర్ల నుంచి తమకు ప్రాణహాని ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ఎమ్మెల్యే నాయిని వారికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

రికవరీ చేసేదాక వదిలిపెట్టం..

కల్పలత సూపర్ బజార్ పై వచ్చిన ఫిర్యాదుల మేరకు తనిఖీ చేస్తే నిజాలు బయటకు వస్తున్నాయి.  పాలకవర్గ సభ్యులు ప్రజా ధనాన్ని దుర్మార్గంగా వాడుకున్నారు. కల్పలత సూపర్ బజార్ లో జరిగిన అక్రమాలపై కలెక్టర్ తో పాటు విజిలెన్స్ కు ఫిర్యాదు చేశాం. ఎంక్వైరీ కమిటీ వేసి, స్కామ్ పై చర్యలు తీసుకోవాలని కోరాం. ఎన్ని రూ.కోట్ల స్కామ్ అనేది విచారణ అనంతరం తెలుస్తుంది. ఎంక్వైరీ జరిపి, దుర్వినియోగమైన సొమ్మును రికవరీ చేసేదాక ఎవరినీ వదిలిపెట్టం. - నాయిని రాజేందర్ రెడ్డి, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే