లాక్​డౌన్​ తర్వాత పిరమైన వంట సామాన్లు

లాక్​డౌన్​ తర్వాత పిరమైన వంట సామాన్లు
లాక్​డౌన్​ తర్వాత పిరమైన వంట సామాన్లు భారీగా పెరిగిన మంచి నూనె బ్రాండ్​ను బట్టి లీటరుకు రూ.50 నుంచి రూ.60 దాకా పప్పు, కారం, బియ్యం రేట్లకు రెక్కలు వాటి బాటలోనే కూరగాయలు హైదరాబాద్​, వెలుగు:మంచినూనె కాగిపోతున్నది.. చక్కెర చేదెక్కుతున్నది.. కారం మండిపోతున్నది.. ఒక్కటేంటి ఇంటి సామాన్లను ఏది చూసినా మస్తు పిరమై కూర్చున్నయి. చేతికి అందనంటున్నయి. ఓ సగటు శ్రమజీవిని పరేషాన్​ చేస్తున్నయి. లాక్​డౌన్ తర్వాత వంటసామాన్ల ధరలు భారీగా పెరిగాయి. అసలే కరోనా లాక్​డౌన్​తో ఉపాధి పోయి చాలా మంది కూలీలు, కార్మికులకు అప్పట్లో పూట గడవడమే కష్టమైంది. లాక్​డౌన్​ అయిపోయాక కూలీలు దొరుకుతున్నా.. పెరిగిన సరుకులు, కూరగాయల ధరలతో పూటగడవడం కష్టమవుతోంది. మిడిల్ క్లాస్​ వాళ్లు తమ నెల వంట సామాన్లలో కోతలు పెట్టుకోవాల్సిన పరిస్థితి. అన్ని సామాన్లలోకెల్ల మంచినూనెల రేట్లు భారీగా పెరిగాయి. బ్రాండ్​ను, మంచినూనె రకాన్ని బట్టి లీటరుకు 50 రూపాయల నుంచి 60 రూపాయల దాకా ధరలు ఎక్కువయ్యాయి. లాక్​డౌన్​కు ముందు మార్చిలో లీటర్ పల్లీ నూనె ధర సగటున రూ.140 దాకా ఉండగా.. ఇప్పుడు బ్రాండ్​ను బట్టి లీటరు రేటు రూ.175 నుంచి రూ.200 దాకా పెరిగింది. సగటున ఒక్క లీటర్​ ఆయిల్ ప్యాకెట్ ఎంఆర్​పీ రూ.164కు పెరిగింది. దీంతో చాలా మంది మంచినూనె వాడకం తగ్గించుకుంటున్నారు. ఐదు లీటర్లు కొనే దగ్గర రెండు మూడు లీటర్లతోనే సరిపెట్టుకుంటున్నారు. పప్పులు, ఉప్పుల రేట్లు కూడా పెరిగాయి. కందిపప్పు కిలోకు రూ.35 పెరగ్గా, శనగపప్పుపై రూ.15 వరకు పెరిగింది. అన్ని రకాల సన్న బియ్యంపై కిలో రూ.5 నుంచి రూ.10 వరకు ఎక్కువయ్యాయి. లాక్​డౌన్​ టైంలో నో స్టాక్​ పేరిట చాలా షాపుల్లో ధరలు పెంచి నిత్యావసరాలను అమ్మారు. అయితే, ఇప్పుడు డైరెక్ట్​గా కంపెనీలే ఎంఆర్​పీని పెంచేశాయి. దీంతో సామాన్యులపై భారం పడుతోంది. చాలా మంది ధరలు ఎక్కువున్న కొన్ని వస్తువుల జోలికే వెళ్లడం లేదు. అత్యవసరమైనవి, ధర పెద్దగా పెరగని సామాన్లనే కొంటున్నారు. లాక్​డౌన్​లోనే తక్కువున్నయ్​ లాక్​డౌన్​ టైంలో కూడా ధరలు గింతగనం లేవు. వంట సామాన్లు, కాయగూరల ధరలు అన్ని ఎక్కువగానే ఉన్నాయి. రోజూవాడే పప్పు, ఉప్పు, కారం, పసుపు, నూనె, పాలు, గుడ్లు ఇలా అన్నింటి ధరలు ఒక్కసారిగా పెరిగినయి. కొన్ని వస్తువులను కొనలేక.. ఏదైతే అత్యవసరముంటుందో ఆ వస్తువులు మాత్రమే కొంటున్నం. – సుదర్శన్​, వినియోగదారుడు కాయగూరల ధరలు అంతే… వంట సామాన్ల బాటలోనే కాయగూరల ధరలూ మండిపోతున్నాయి. ప్రజలకు చుక్కలు చూపిస్తున్నాయి. ఏది కొందామన్నా కిలో 50 రూపాయలకు తక్కువ లేవు. ఆలుగడ్డ, ఉల్లిగడ్డ, బెండకాయ, వంకాయ, బీరకాయ, బీన్స్, క్యాబేజ్, పచ్చిమిర్చి.. ఇట్ల ఏది పట్టినా రేట్లు భగ్గుమంటున్నయి. నగర శివారు ఏరియాల్లో కాయగూరల సాగు తగ్గడంతో ఈ పరిస్థితి నెలకొందని చెబుతున్నారు. నిజానికి ప్రతి చలికాలంలో కాయగూరల ధరలు తగ్గుతాయి. కానీ ఈ ఏడాది ధరలకు రెక్కలొచ్చాయి. గుడిమల్కాపూర్​, బోయిన్​పల్లి, ఎల్బీనగర్​, సికింద్రాబాద్​ మోండా, మాదన్నపేట వంటి మార్కెట్లతో పాటు గ్రేటర్ పరిధిలోని 11 రైతుబజార్లకు రోజువారీగా కాయగూరల రాక తగ్గిపోయింది. దీంతో ధరలు విపరీతంగా పెరిగాయి.