నీట్ పేపర్​ లీక్ ​కేసులో సూత్రధారి అరెస్ట్​

నీట్ పేపర్​ లీక్ ​కేసులో సూత్రధారి అరెస్ట్​
  •  బిహార్​లోని పాట్నాలో రాకేశ్​ రంజన్​ను అదుపులోకి తీసుకున్న సీబీఐ
  • పాట్నా, కోల్​కతాలోని పలు ప్రదేశాల్లో సోదాలు
  • కేసుకు సంబంధించి కీలక డాక్యుమెంట్లు స్వాధీనం
  • 10 రోజుల కస్టడీ విధించిన లోకల్​ కోర్టు
  • సుప్రీంకోర్టులో విచారణ ఈ నెల 18కి వాయిదా 

పాట్నా: నీట్​యూజీ పేపర్​ లీకేజీ కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ దూకుడు పెంచింది. బిహార్​ రాజధాని పాట్నాలో ఈ కేసుకు సంబంధించిన కీలక సూత్రధారిని గురువారం అరెస్ట్​ చేసింది. అనంతరం పాట్నాతోపాటు పశ్చిమ బెంగాల్​లోని కోల్​కతాలో అతడికి సంబంధించిన వివిధ ప్రదేశాల్లో సోదాలు నిర్వహించింది. కేసుకు సంబంధించిన కీలకమైన డ్యాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నది. 

మరోవైపు విచారణ నిమిత్తం ప్రధాన నిందితుడిని 10 రోజుల సీబీఐ కస్టడీకి స్థానిక కోర్టు అప్పగించింది. సీబీఐ తెలిపిన వివరాల ప్రకారం.. బిహార్​లో నీట్​ పేపర్​లీకేజీ ప్రధాన సూత్రధారి రాకేశ్​ రంజన్​ అలియాస్​ రాకీ. ఇతడు జార్ఖండ్​లోని రాంచీలో ఓ హోటల్​ యజమాని. లీకైన నీట్​పేపర్​ను ఇతడు చింటూ అనే వ్యక్తికి పంపాడు. అనంతరం ఆన్సర్స్​తో కూడి పేపర్స్​ను చింటూ సర్క్యులేట్​ చేశాడు. 

పేపర్​ను సాల్వ్​ చేసేందుకు  పాట్నా, రాంచీకి చెందిన పలువురు ఎంబీబీఎస్ విద్యార్థులను రాకీ  నియమించుకున్నాడు. ఈ ​కేసులో మరో నిందితుడైన సంజీవ్​ ముఖియాకు రాకీ మేనల్లుడు కావడం గమనార్హం. కాగా, ఈ కేసులో రెండు రోజుల క్రితమే నలందకు చెందిన నీట్‌‌-యూజీ అభ్యర్థి సన్నీ,  గయాకు చెందిన మరో అభ్యర్థి తండ్రి రంజిత్‌‌ కుమార్‌‌ ను సీబీఐ అరెస్ట్ చేసింది. తాజా అరెస్ట్​తో  ఈ కేసులో అరెస్టైన వారి సంఖ్య 12కు చేరింది.    

ఇతర రాష్ట్రాల అభ్యర్థులకు గుజరాతీలో నీట్​

నీట్​ పేపర్​ లీకేజీ జరిగిన గుజరాత్​ రాష్ట్రంలోని గోద్రా పట్టణం, ఖేడా జిల్లాలోని పరీక్షా కేంద్రంలో ఇతర రాష్ట్రాల విద్యార్థులు పరీక్ష లాంగ్వేజీని గుజరాతీగా ఎంచుకున్నట్టు తేలింది. ఒడిశా, బిహార్, మహారాష్ట్ర, రాజస్థాన్​, ఉత్తర ప్రదేశ్​స్టూడెంట్స్​కు గుజరాతీ భాష ఎంచుకోవాల్సిందిగా ఇప్పటికే అరెస్టయిన నిందితులు సూచించినట్టు సీబీఐ గుర్తించింది. పరీక్షా ప్రక్రియలో భాగమైన గుజరాతీ వ్యక్తులు ఆ స్టూడెంట్స్​ జవాబు పత్రాలను పూరించడానికి వీలుగా ఇలా చేశారని, నిందితులను కస్టడీ కోరుతూ సీబీఐ.. గుజరాత్ కోర్టుకు తెలిపింది. 

అలాగే, ఆ స్టూడెంట్స్​ పర్మనెంట్​ అడ్రస్​ను పంచమహల్​ లేదా వడోదరగా చూయించాలని నిందితులు సూచించినట్టు సీబీఐ తేల్చింది. పేపర్​లీక్​ అయిన రెండు పరీక్షా కేంద్రాల నిర్వాహకులు ఒకరేనని దర్యాప్తు సంస్థ పేర్కొంది. వివిధ రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులందరినీ నిందితులు వేర్వేరు లింక్‌‌ల ద్వారా సంప్రదించారని తెలిపింది. 

సుప్రీంలో విచారణ వాయిదా.. 

నీట్​ యూజీ పరీక్షలో అవకతవకలపై దాఖలైన వివిధ పిటిషన్లపై సుప్రీంకోర్టు గురువారం విచారణ జరిపింది. కేసు విచారణను ఈ నెల 18వ తేదీకి వాయిదా వేసింది. కేంద్రం, ఎన్టీఏ దాఖలు చేసిన అఫిడవిట్లను స్వీకరించినట్టు తెలిపింది. అయితే, ఈ అఫిడవిట్లన్నీ పిటిషనర్లకు చేరలేదని, వాటిని పరిశీలించేందుకు వీలుగా సమయమిస్తూ విచారణను వాయిదా వేస్తున్నట్టు సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్​ తెలిపారు. కాగా, లీకైన నీట్​ పేపర్​ బిహార్​లోని ఒక్క సెంటర్​కే పరిమితమైందని, దేశవ్యాప్తంగా కాదని, సోషల్​ మీడియాలో కూడా సర్క్యులేట్​ కాలేదని సీబీఐ కోర్టుకు తెలిపినట్టు సమాచారం. ఇందుకు సంబంధించిన సమాచారాన్ని సీల్డ్​ కవర్​లో గురువారం కోర్టుకు అందజేసింది.