MI vs CSK: మరికొన్ని గంటల్లో ముంబైతో మ్యాచ్.. సీఎస్‌కే స్టార్ పేసర్ దూరం

MI vs CSK: మరికొన్ని గంటల్లో ముంబైతో మ్యాచ్.. సీఎస్‌కే స్టార్ పేసర్ దూరం

ఆదివారం(ఏప్రిల్ 14) వాంఖడే వేదికగా చెన్నై సూపర్‌ కింగ్స్‌, ముంబై ఇండియన్స్‌ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌కు ముందు చెన్నై జట్టుకు భారీ షాక్ తగిలింది. గాయం కారణంగా కోల్‌కతా,సన్ రైజర్స్ మ్యాచ్‌లకు దూరంగా ఉన్న మాతీష పతిరణ.. ముంబై పోరుకు దూరం కానున్నారు. అతను పూర్తిగా కోలుకోలేదని, సీఎస్‌కే ఆడబోయే తదుపరి మ్యాచ్‌ వరకు కోలుకుంటారని ఆ జట్టు హెడ్‌ కోచ్‌ స్టీఫెన్‌ ఫ్లెమింగ్‌ తెలిపారు. 

ముంబై బ్యాటర్లను ఆపేదెలా..!

రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, సూర్య, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, టిమ్ డేవిడ్, రొమారియో షెపర్డ్, మహ్మద్ నబీల రూపంలో ముంబై బ్యాటింగ్ లైనప్ బలంగా కనిపిస్తోంది. వీరిని కట్టడి చేయాలంటే చెన్నై బౌలర్లు తెలివిగా వ్యూహరచనలు చేయాల్సిందే. అందునా మ్యాచ్ వారి సొంతగడ్డ వాంఖడే వేదికగా జరుగుతోంది. ఇది వారికి అదనపు బలం. చెన్నై జట్టులో జడేజా, తీక్షణ రూపంలో ఇద్దరు నాణ్యమైన స్పిన్నర్లు ఉన్నప్పటికీ.. వాంఖడే పిచ్ స్పిన్నర్లకు పెద్దగా అనుకూలించడం లేదు. ఇక పేస్ విషయానికొస్తే.. ముస్తాఫిజుర్ రెహమాన్ మినహా శార్దూల్ ఠాకూర్, తుషార్ దేశ్‌పాండే అంతంత మాత్రమే. ఈ లెక్కల పరంగా పతిరణ గైర్హాజరీతో సీఎస్‌కే బౌలింగ్ లైనప్ కాస్త బలహీనంగా ఉందని చెప్పుకోవాలి.

మూడో స్థానంలో ముంబై.. ఏడో స్థానంలో చెన్నై

ప్రస్తుత సీజన్‌లో ముంబై ఇండియన్స్‌ వరుసగా రెండు విజయాలతో గాడిలో పడగా.. చెన్నై సూపర్‌ కింగ్స్‌ మొదటి నుంచి పర్వాలేదనిపిస్తోంది. ఆడిన 5 మ్యాచ్‌ల్లో 3 విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉంది. మరోవైపు, ముంబై ఆడిన 5 మ్యాచ్‌ల్లో 2 విజయాలతో ఏడో స్థానంలో ఉంది. ఇక, ఇప్పటివరకూ ఈ ఇరు జట్లు మధ్య 36 మ్యాచ్‌లు జరగ్గా.. ముంబై 20 సార్లు, చెన్నై 16 సార్లు విజయం సాధించాయి.