
బెల్లంపల్లి, వెలుగు: చత్తీస్‌గఢ్ గరియాబంధ్ ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన మావోయిస్ట్ పార్టీ బస్తర్ డివిజన్ కమిటీ సభ్యుడు జాడి వెంకటికి ఆదివారం ఆయన స్వగ్రామం మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం చంద్రవెల్లిలో కన్నీటి వీడ్కోలు పలికారు. సాయంత్రం డెడ్‌బాడీ గ్రామానికి చేరుకోగా ప్రజాసంఘాలు, కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నేతలు నివాళి అర్పించారు.
గ్రామకూడలి నుంచి ప్రారంభమైన అంతిమయాత్ర రాత్రి 8 గంటల వరకు కొనసాగింది. ప్రజాసంఘాల నాయకులు, మాజీ నక్సలైట్లు, గ్రామస్తులు 100 అడుగుల ఎర్రజెండా పట్టుకొని విప్లవగీతాలు పాడుతూ నినాదాలు చేశారు. ఆపరేషన్ కగార్ నిలిపివేయాలని, మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని డిమాండ్ చేశారు. ఎన్కౌంటర్లు మోదీ, అమిత్ షా చేయిస్తున్న హత్యలని విమర్శించారు.
అంతిమయాత్రలో అమరవీరుల బంధుమిత్రుల కమిటీ రాష్ట్ర అధ్యక్షురాలు పద్మకుమారి, రాష్ట్ర కార్యదర్శి శాంతక్క, పౌరహక్కుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాదన కుమారస్వామి, రైతు హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు ముదిమడుగుల మల్లయ్య, విప్లవ రచయితల సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు బాలసాని రాజన్న, సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు కలవేని శంకర్, రాష్ట్ర సమితి సభ్యులు పాల్గొని మాట్లాడారు.