
నెట్వర్క్, వెలుగు: మే డేను ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గురువారం ఘనంగా జరుపుకొన్నారు. వాడవాడలా ఎర్ర జెండాలు రెపరెపలాడాయి. ముఖ్యంగా సింగరేణి కార్మిక క్షేత్రాలైన శ్రీరాంపూర్, మందమర్రి, రామకృష్ణాపూర్ పట్టణాల్లో కార్మిక, రాజకీయ సంఘాలు మేడేను ఘనంగా నిర్వహించారు. బొగ్గు గనులు, డిపార్ట్మెంట్లు, యూనియన్లు, రాజకీయ పార్టీల ఆఫీసులతో పాటు పలు కార్మికవాడల్లో ఏఐటీయూసీ, సీఐటీయూ, ఐఎన్టీయూసీ, ఇప్టూ ఆధ్వర్యంలో లీడర్లు ఎర్ర జెండాలను ఎగురవేశారు. ర్యాలీలు నిర్వహించారు. కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వాలు పనిచేయాలని డిమాండ్ చేశారు.
ఎర్రజెండా నీడలో దేశంలో బీజేపీ ప్రభుత్వం అవలంభిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై పోరాడాలని పిలుపునిచ్చారు. నేరడిగొండ లోని ఎమ్మెల్యే నివాసంలో అనిల్‌జాదవ్ కార్మికులను శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. కార్మికుల హక్కులను కాపాడేందుకు కోర్టులు అండగా ఉంటాయని నిర్మల్ జడ్జి రాధిక అన్నారు. టీయూసీఐ రాష్ట్ర కార్యదర్శి రాజన్న ఆధ్వర్యంలో పట్టణంలో నిర్వహించిన సదస్సులో జడ్జి పాల్గొని ప్రసంగించారు. కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం 44 చట్టాలను నాలుగు కోడ్స్ గా మార్చి అమలు చేస్తున్నట్లు తెలిపారు.