రోహిత్ కు కరోనా.. జట్టులోకి మయాంక్

రోహిత్ కు కరోనా.. జట్టులోకి మయాంక్

జులై 1 నుంచి ఎడ్జ్‌బాస్టన్‌లో ఇంగ్లండ్‌తో జరగనున్న ఐదో టెస్టు మ్యాచ్‌కు భారత్ ఓపెనర్ మయాంక్ అగర్వాల్‌కు బీసీసీఐ నుండి పిలుపొచ్చింది. దీంతో అతను ఈ సాయంత్రానికి ఇంగ్లండ్‌లో ఉన్న భారత జట్టుతో కలవనున్నాడు. కెప్టెన్ రోహిత్ శర్మకు కరోనా సోకడంతో అతను ఈ టెస్టు మ్యాచ్ కు దూరమయ్యాడు. మరోవైపు గాయం కారణంగా రాహూల్ కూడా మ్యాచ్ కు దూరమయ్యాడు. ప్రస్తుతం శుభమాన్ గిల్ మాత్రమే అందుబాటులో ఉండటంతో భారత్‌కు ఓపెనర్ల కొరత ఏర్పడింది. ఈ క్రమంలో మయాంక్ స్టాండ్-బై ఓపెనర్‌గా అందుబాటులో ఉంటాడని బీసీసీఐ భావించింది.

ఇప్పటికే టెస్టుల్లో రెండు డబుల్ సెంచరీలు, నాలుగు సెంచరీలు చేసిన మయాంక్ అగర్వాల్‌కి సుదీర్ఘ ఫార్మాట్‌లో మంచి రికార్డు ఉంది. మయాంక్ ఇప్పటి వరకు ఇంగ్లండ్‌తో ఏ టెస్టు ఆడలేదు. ఒకవేళ అతనికి అవకాశం లభిస్తే ఇదే అతనికి ఇంగ్లండ్‌తో తొలి టెస్టు అవుతుంది.  ఇదిలావుండగా ఎడ్జ్‌బాస్టన్‌ టెస్టు మ్యాచ్ కు బుమ్రా కెప్టెన్ గా వ్యవహరించే అవకాశం ఉంది. గత ఏడాది సెప్టెంబర్‌లో మంచెస్టర్ వేదికగా  ఇంగ్లండ్‌, భారత్ ల మధ్య జరగాల్సిన ఐదో టెస్టు మ్యాచ్ కరోనా కారణంగా వాయిదా పడింది. అప్పటికే భారత జట్టు 2-1 తేడాతో ఆధిక్యంలో ఉంది. ఈ మ్యాచ్ లో గెలిచినా, డ్రా చేసుకున్నా సిరీస్ భారత్ వశమవుతుంది.