IPL 2024: ఐపీఎల్‌లో అదరగొడుతున్న యంగ్ క్రికెటర్స్.. ఆ ఇద్దరికీ టీ20 వరల్డ్ కప్‌లో చోటు

IPL 2024: ఐపీఎల్‌లో అదరగొడుతున్న యంగ్ క్రికెటర్స్.. ఆ ఇద్దరికీ టీ20 వరల్డ్ కప్‌లో చోటు

ఐపీఎల్ లో యంగ్ క్రికెటర్లు రాణించడం సహజమే. ప్రతి సీజన్ లో ఒకరిద్దరు తమ టాలెంట్ నిరూపించుకొని టీమిండియాలోకి ఎంట్రీ ఇస్తారు. అయితే ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ లో మాత్రం కుర్రాళ్లే సత్తా చాటుతున్నారు. ఐపీఎల్ సీజన్  ముగిసిన  వారం రోజుల వ్యవధిలోనే  టీ20 వరల్డ్ కప్ లో ఉండడంతో ఈ మెగా టోర్నీలో చోటు సంపాదించుకునేందుకు ఇద్దరు కుర్రాళ్ళు రేస్ లో ఉన్నారు. వారిలో ఒకరు రాజస్థాన్ తరపున బ్యాటింగ్ లో అదరగొడుతున్న రియాన్ పరాగ్ అయితే మరొకరు లక్నో జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న మయాంక్ యాదవ్.
 
రియాన్ పరాగ్: 

రాజస్థాన్ రాయల్స్ జట్టులో ఘోరంగా విఫలమవుతున్నా.. పరాగ్ ప్రతి సీజన్ లో స్థానం దక్కించుకుంటున్నాడు. గత సీజన్ లో అత్యంత చెత్త ప్రదర్శనతో ట్రోల్స్ ఎదుర్కొన్న ఈ యంగ్ ప్లేయర్.. ప్రస్తుతం జరుగుతున్న టోర్నీలో అసాధారణ ఫామ్ లో ఉన్నాడు. ఆడిన మూడు మ్యాచ్ ల్లో కీలక ఇన్నింగ్స్ ఆడటమే కాదు.. మ్యాచ్ విన్నింగ్ నాక్స్ ఆడాడు. ముఖ్యంగా ఒత్తిడిలో పరాగ్ ఆడుతున్న తీరు అద్భుతమనే చెప్పాలి. ఎంతో పరిణితి చెందిన ఆటగాడిలా ఆడుతూ టీమిండియా భవిష్యత్తు ఆశాకిరణంలో మారాడు.

ఇప్పటివరకు మూడు ఇన్నింగ్స్ ల్లో 181 పరుగులు చేసిన పరాగ్.. టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల లిస్టులో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. ముఖ్యంగా ఢిల్లీపై  మ్యాచ్ లో తీవ్ర ఒత్తిడి సమయంలో 85 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఇక ముంబైపై జరిగిన మ్యాచ్ లోనూ స్టార్ ఆటగాళ్లు విఫలమైనా.. మ్యాచ్ చివరి వరకు క్రీజ్ లో ఉండి రాజస్థాన్ కు విజయాన్ని అందించాడు. పరాగ్ ఇదే ఫామ్ ను కంటిన్యూ చేస్తే టీ20 వరల్డ్ కప్ లో చోటు ఖాయంగా కనిపిస్తుంది. తుది జట్టులో అవకాశం రాకపోయినా 15 మంది స్క్వాడ్ లో ఉండొచ్చు. 

మయాంక్ యాదవ్:

లక్నో సూపర్ జయింట్స్ తరపున ఆడుతున్న ఎక్స్ ప్రెస్ పేసర్ మయాంక్ యాదవ్ టీ20 వరల్డ్ కప్ లో చోటు దక్కించుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. గంటకు నిలకడగా 150 కిలోమీటర్ల వేగంతో పాటు.. ఖచ్చితత్వం కూడిన లైన్ లెంగ్త్ బంతులు వేయడం మయాంక్ స్పెషాలిటీ. ధావన్, బెయిర్ స్టో, మ్యాక్స్ వెల్, పటిదార్ లాంటి స్టార్ ఆటగాళ్లు సైతం ఈ 21 ఏళ్ళ పేస్ ధాటికి సమాధానం లేకుండా పోయింది. ఇప్పటివరకు 2 మ్యాచ్ లాడిన ఈ యంగ్ బౌలర్ 6 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. రెండు మ్యాచ్ ల్లోనూ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు ను గెలుచుకున్నాడు. 

వికెట్లు తీయడంతో పాటు పొదుపుగా బౌలింగ్ చేస్తుండడంతో మయాంక్ టీ20 వరల్డ్ కప్ కి జట్టులో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. బుమ్రా జతగా మయాంక్ బౌలింగ్ వేస్తే ప్రత్యర్ధులు బెంబెలెత్తడం ఖాయం. ఏప్రిల్ చివరి వారంలో భారత జట్టును ప్రకటిస్తారు. ఈ లోపు లక్నో నాలుగు లేదా ఐదు మ్యాచ్ లు ఆడాల్సి ఉంది. ఇదే ఊపును కొనసాగిస్తే 21 ఏళ్లకే భారత జట్టులోకి ఎంట్రీ ఇచ్చినా ఆశ్చర్యం లేదు.