జీవీకే గ్రూప్‌‌ 11 కంపెనీలపై ఎంసీఏ డేగ కన్ను

జీవీకే గ్రూప్‌‌ 11 కంపెనీలపై ఎంసీఏ డేగ కన్ను

    నిధుల మళ్లింపు ఆరోపణలు

    రిలేటెడ్‌‌ పార్టీలకే కాంట్రాక్టులు, వ్యయం పెంచేందుకు ఫేక్‌‌బిల్స్‌‌, బోగస్‌‌ బిల్స్‌‌తో అక్రమ ఎక్సైజ్‌‌, కస్టమ్స్‌‌ డ్యూటీ బెనిఫిట్స్‌‌ ఆరోపణలు

    విజిల్‌‌ బ్లోయెర్‌‌ కంప్లైంట్‌‌తోనే రంగంలోకి ఎంసీఏ

    ఆడిటర్లూ, కంపెనీ సెక్రటరీలపైనా గురి

      ఒక్క కంపెనీకే లెటర్‌‌ వచ్చిందంటున్న జీవీకే

 

హైదరాబాద్‌‌ కేంద్రంగా పనిచేస్తున్న ఇన్‌‌ఫ్రా దిగ్గజం జీవీకే గ్రూప్‌‌లోని కంపెనీలపై కార్పొరేట్‌‌ ఎఫైర్స్‌‌ మంత్రిత్వ శాఖ దృష్టి సారించింది. జీవీకే గ్రూప్‌‌లోని కంపెనీల అకౌంట్‌‌ బుక్స్‌‌ను పరిశీలించాలని ఎంసీఏ నిర్ణయించింది. ఈ గ్రూప్‌‌ కంపెనీల ఆడిటర్లు, కంపెనీ సెక్రటరీల పైనా ఎంసీఏ కన్ను పడింది.  గ్రూప్‌‌ కంపెనీలలో నిధులు దారి మళ్లించారనే విజిల్‌‌ బ్లోయెర్‌‌ కంప్లెయింట్‌‌ ఆధారంగా చేసుకుని ఎంసీఏ ఆయా కంపెనీల రికార్డుల తనిఖీకి నడుం కట్టింది. రిలేటెడ్‌‌ పార్టీకి ఇచ్చిన కాంట్రాక్టులు, వ్యయం పెంచేందుకు ఫేక్‌‌ బిల్స్‌‌ సృష్టి, బోగస్‌‌ బిల్స్‌‌ ద్వారా  అర్హత లేని కస్టమ్స్‌‌, ఎక్సైజ్‌‌ మినహాయింపులు వంటి ఆరోపణలు జీవీకే గ్రూప్‌‌లోని కంపెనీలపై వచ్చాయి.  జీవీకే గ్రూప్‌‌పై విజిల్‌‌ బ్లోయర్‌‌ లెటర్‌‌ కార్పొరేట్‌‌ ఎఫైర్స్‌‌ మంత్రిత్వ శాఖలోని  అత్యున్నత స్థాయి వ్యక్తులకు చేరినట్లు అధికార వర్గాలు వెల్లడిస్తున్నాయి.

పరిశీలనలో 11 కంపెనీలు…

గ్రూప్‌‌లోని ఫ్లాగ్‌‌షిప్‌‌ కంపెనీ జీవీకే పవర్‌‌ అండ్‌‌ ఇన్‌‌ఫ్రాస్ట్రక్చర్‌‌ లిమిటెడ్‌‌ సహా మొత్తం 11 కంపెనీలు ఎంసీఏ పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. ముంబై ఇంటర్‌‌నేషనల్‌‌ ఎయిర్‌‌పోర్ట్‌‌, జీవీకే జైపూర్‌‌ ఎక్స్‌‌ప్రెస్‌‌వే ప్రైవేట్‌‌ లిమిటెడ్‌‌, జీవీకే పవర్‌‌, జీవీకే ఇండస్ట్రీస్‌‌, నోవాపాన్‌‌, గౌతమి పవర్‌‌, బెంగళూరు ఇంటర్‌‌నేషనల్‌‌ లిమిటెడ్‌‌ వంటి కంపెనీలు ఈ జాబితాలో ఉన్నాయి. నవీ ముంబైలో కొత్తగా ఎయిర్‌‌పోర్టు నిర్మిస్తున్న నవీ ముంబై ఇంటర్‌‌నేషనల్‌‌ ఎయిర్‌‌పోర్ట్‌‌పైనా ఎంసీఏ దర్యాప్తుకు ఆదేశించారు. జీవీకే గ్రూప్‌‌లోని వివిధ కంపెనీల జురిడిక్షన్​ వేరు వేరు ప్రాంతాలలో ఉండటంతో ఆయా ప్రాంతీయ అధికారులు తమ ప్రాంతంలోని కంపెనీలకు ఇన్‌‌స్పెక్షన్‌‌ లెటర్లు పంపించినట్లు తెలిసింది. ఈ కంపెనీలు హైదరాబాద్‌‌, బెంగళూరు, రాజస్థాన్‌‌, ముంబైలలో ఉన్నాయి.  జీవీకే గ్రూప్‌‌ హెడ్‌‌ క్వార్టర్స్‌‌తోపాటు, పలు గ్రూప్‌‌ కంపెనీలకూ హైదరాబాద్‌‌ కేంద్రం కావడంతో  ఎంసీఏ రీజినల్‌‌ డైరెక్టర్‌‌ ఎం ఆర్‌‌ భట్‌‌ నుంచి ఈ లెటర్లు వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ విషయంపై మాట్లాడేందుకు ఎం ఆర్‌‌ భట్‌‌ అందుబాటులోకి రాలేదు. హైదరాబాద్‌‌లో రిజిస్ట్రార్‌‌ ఆఫ్‌‌ కంపెనీస్‌‌గా ఇటీవలే బాధ్యతలు చేపట్టడంతో తనకు ఈ విషయాలపై అవగాహన లేదని ఆర్‌‌ఓసీ జోస్‌‌ కుట్టి వెల్లడించారు. ఇదిలావుంటే, ముంబై ఇంటర్‌‌నేషనల్‌‌ ఎయిర్‌‌పోర్ట్‌‌ (ఎంఐఏఎల్‌‌)కి మాత్రమే ఎంసీఏ నుంచి లెటర్‌‌ వచ్చినట్లు జీవీకే అధికార ప్రతినిధి వెల్లడించారు. వెస్టర్న్‌‌ రీజియన్‌‌ రీజినల్‌‌ డైరెక్టర్‌‌ నుంచి ఆ లెటర్‌‌ వచ్చిందని పేర్కొన్నారు. ఆ లెటర్‌‌కు సమాధానం పంపిస్తామని తెలిపారు.  విజిల్‌‌ బ్లోయెర్‌‌ కంప్లైంట్‌‌ గురించి తమకు సమాచారం లేదని, అయినా ఆధారాలులేని అలాంటి కంప్లైంట్ల మీద స్పందించాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు.