మున్సిపల్‌‌ కార్పొరేషన్‌‌ ఎన్నికలకు ఆప్‌‌ హామీలు

మున్సిపల్‌‌ కార్పొరేషన్‌‌ ఎన్నికలకు ఆప్‌‌ హామీలు

మేనిఫెస్టోను రిలీజ్‌‌ చేసిన సీఎం అర్వింద్​ కేజ్రీవాల్‌‌

న్యూఢిల్లీ: ఢిల్లీలో కార్పొరేషన్‌‌ ఎన్నికల హడావుడి మొదలైంది. డిసెంబర్‌‌‌‌ 7న జరగనున్న ఢిల్లీ మున్సిపల్‌‌ కార్పొరేషన్‌‌(ఎంసీడీ) ఎన్నికల్లో తమ పార్టీ కచ్చితంగా గెలిచి తీరుతుందని ఆఫ్‌‌ చీఫ్, ఆ రాష్ట్ర సీఎం అరవింద్‌‌ కేజ్రీవాల్‌‌ అన్నారు. ఆప్‌‌ ఏం చెప్తుందో.. అదే చేస్తుందన్న కేజ్రీవాల్‌‌.. శుక్రవారం ఢిల్లీ వాసులకు పలు హామీలు ఇచ్చి, మేనిఫెస్టోను రిలీజ్‌‌ చేశారు. కార్పొరేషన్‌‌లో అవినీతిని అంతం చేయడంతో పాటు చెత్తలేని, బ్యూటీఫుల్‌‌ సిటీగా మారుస్తామని చెప్పారు. గత 15 ఏండ్లుగా ఢిల్లీ కార్పొరేషన్‌‌లో బీజేపీ హామీలు ఇవ్వడం, అధికారంలోకి వచ్చాక మేనిఫెస్టోను చెత్త బుట్టలో పారివేయడం కామన్‌‌ అయిపోయిందని ఆరోపించారు. ఈసారి బీజేపీ 20 సీట్లు కూడా గెలవదని చెప్పారు. ఢిల్లీని ‘‘బెస్ట్‌‌ గ్లోబల్‌‌ సిటీ’’గా మార్చేందుకు బ్లూఫ్రింట్‌‌ కూడా సిద్ధం చేశామని తెలిపారు. ఈ ఎన్నికల్లో ఆప్‌‌ను గెలిపించాలని కోరుతూ 10 హామీలను ఇచ్చారు. ‘‘ఢిల్లీలో ఎప్పటికప్పుడు చెత్తను పారవేయడంతో పాటు డ్రైనేజీ ని శుభ్రంగా ఉంచుతాం. 

కొత్త చెత్త డంప్‌‌లు ఉండవు. వీధులు, రోడ్లు శుభ్రపరుస్తాం. ఢిల్లీ మున్సిపల్‌‌ కార్పొషన్‌‌ పరిధిలో ఉన్న స్కూళ్లు, హాస్పిటళ్లలో వసతులను మెరుగుపర్చడంతో పాటు వాటిని పరిశుభ్రంగా ఉంచుతాం. పార్కింగ్‌‌ సమస్యకు శాశ్వత సమస్య చూపించడంతో పాటు పార్కులను బ్యూటీఫుల్‌‌గా మారుస్తాం. కార్పొరేషన్‌‌లో పనిచేసే తాత్కాలిక ఉద్యోగులను రెగ్యులరైజ్‌‌ చేస్తాం. వీధి వ్యాపారులకు లైసెన్సులు ఇచ్చి, వెండింగ్‌‌ జోన్ల ను ఏర్పాటు చేస్తాం”అని హామీ ఇచ్చారు. ఎంసీడీ ఎన్నికలతో పాటు గుజరాత్‌‌ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఆప్‌‌ విజయం సాధిస్తుందని కేజ్రీవాల్‌‌ తెలిపారు. వచ్చే ఎన్నికల నాటికి ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామని స్పష్టం చేశారు.