త్వరలో ఆర్టీసీలో రిక్రూట్ మెంట్‌.. 813 మందికి కారుణ్య నియామకాలు: ఆర్టీసీ ఎండీ సజ్జనార్

 త్వరలో ఆర్టీసీలో రిక్రూట్ మెంట్‌.. 813 మందికి  కారుణ్య నియామకాలు: ఆర్టీసీ ఎండీ సజ్జనార్

హైదరాబాద్​: త్వరలో ఆర్టీసీలో రిక్రూట్ మెంట్‌ చేపడతామని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. బస్‌ భవన్‌లో  జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి మాట్లాడారు. పెరిగిన రద్దీకి అనుగుణంగా కొత్త బస్సులను సమకూర్చుకోవాలని  యాజమాన్యం నిర్ణయించిందన్నారు. ఇప్పటికే 1,325 డీజిల్, మరో 1,050 ఎలక్ట్రిక్ బస్సులు వాడకంలోకి తెస్తోందన్నారు. మొత్తం 2,375 బస్సులను విడతల వారీగా అందుబాటులోకి తీసుకు వస్తామన్నారు.  

అలాగే మరిన్ని కొత్త బస్సులను కొనుగోలు చేసేందుకు సంస్థ  ప్రయత్నిస్తోందన్నారు. కొత్త బస్సుల్లో విధులు నిర్వర్తించేందుకు వీలైనంత త్వరగా డ్రైవర్లు, కండక్టర్ల  పోస్టుల భర్తీని చేపడుతామన్నారు. కారుణ్య నియామకాల కింద 813 మంది కండక్టర్ల నియామక ప్రక్రియను ప్రారంభించామన్నారు.  ట్రైనింగ్ లో ఉన్న 80 మంది ఆర్టీసీ కానిస్టేబుళ్లు ఫిబ్రవరి మొదటి వారంలో  డ్యూటీలో చేరుతారన్నారు. సిబ్బంది పెండింగ్ అంశాలను పరిష్కరించేందుకు ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందన్నారు.  

డిసెంబర్ 9 నుంచి ఇప్పటివరకు 11 కోట్ల మందికి పైగా మహిళలు ప్రయాణించారన్నారు. మహాలక్ష్మి స్కీమ్‌ను ప్రతి రోజు సగటున 27 లక్షల మంది మహిళలు వినియోగించుకుంటున్నారని తెలిపారు.