రాష్ట్రపతికి జిన్పింగ్ సీక్రెట్ లెటరేం రాయలే:బ్లూమ్బర్గ్ కథనంఫేక్:విదేశాంగ శాఖ

రాష్ట్రపతికి జిన్పింగ్  సీక్రెట్ లెటరేం రాయలే:బ్లూమ్బర్గ్ కథనంఫేక్:విదేశాంగ శాఖ
  1. మీడియా బాధ్యతాయుతంగా ఉండాలని హితవు

న్యూఢిల్లీ: ఇండియాతో సంబంధాలు పునరుద్ధరించుకునేందుకు చైనా అధ్యక్షుడు జిన్​పింగ్.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ‘సీక్రెట్ లెటర్’ రాశారన్న వార్తలను దేశ విదేశాంగ శాఖ శుక్రవారం ఖండించింది. వార్తల కవరేజీ విషయంలో మీడియా సంస్థలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించింది. ఈ మేరకు విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్‌‌‌‌ జైస్వాల్‌‌‌‌ స్పందించారు. ‘‘ఈ ఏడాది మార్చిలో అమెరికా, చైనా మధ్య ట్రేడ్ వార్ కొనసాగింది. 

ఈ సమయంలోనే ఇండియాతో సంబంధాలు మెరుగుపర్చుకునేందుకు జిన్ పింగ్ ప్రయత్నించారంటూ బ్లూమ్ బర్గ్ ఓ వార్తను పబ్లిష్ చేసింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు జిన్​పింగ్ మార్చిలోనే ఓ ‘సీక్రెట్ లెటర్’ రాశారని, ఈ విషయాన్ని ఆమె మోదీకి చెప్పారని అందులో పేర్కొన్నది. ఆ తర్వాత జూన్​ నుంచి ఇండియా, చైనా మధ్య సంబంధాలు మెరుగుపడ్డాయని బ్లూమ్​బర్గ్ తన కథనంలో చెప్పింది. చైనా అధికారులు ‘డ్రాగన్ – ఏలిఫెంట్ టాంగో’ అని కామెంట్లు చేశారని తెలిపింది. 

అయితే.. ఈ కథనాన్ని నేను కూడా చదివాను. అందులో ఉన్నదంతా ఫేక్ న్యూస్. రాష్ట్రపతి ముర్ముకు జిన్​పింగ్ ఎలాంటి సీక్రెట్ లెటర్ రాయలేదు. అంతర్జాతీయ అంశాలకు సంబంధించిన వ్యవహారాల్లో మీడియా ఆచితూచి వ్యవహరిస్తే బాగుంటది. ఇప్పటికైనా బాధ్యతాయుతంగా ఉండాలని మీడియా సంస్థలను కోరుతున్నా’’ అంటూ రణధీర్ జైశ్వాల్ బ్రీఫింగ్ ఇచ్చారు.

శాంతి స్థాపనలో ఇండియా మద్దతు ఉంటది

రష్యా, ఉక్రెయిన్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులకు వీలైనంత తొందరగా తెరపడాలని ఇండియా కోరుకుంటున్నట్లు విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ వెల్లడించారు. శాంతి స్థాపనకు ఇండియా తనవంతు సహకారం అందిస్తుందని చెప్పారు. యుద్ధాన్ని ముగించాలంటూ అమెరికా ఒత్తిడి చేస్తున్న నేపథ్యంలో విదేశాంగ శాఖ శుక్రవారం స్పందించింది. ‘‘శాంతి స్థాపనకు రష్యా, ఉక్రెయిన్ చేపడ్తున్న చర్యలను ఇండియా స్వాగతిస్తున్నది. 

ఇండియా కూడా మద్దతు ఇస్తున్నది. గురువారం మన విదేశాంగ మంత్రి జైశంకర్.. ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి ఆండ్రీ సిబిహాతో ఫోన్​లో మాట్లాడారు. అక్కడ నెలకొన్న పరిస్థితుల గురించి అడిగి తెలుసుకున్నారు. శాంతి స్థాపనకు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారనే దానిపై చర్చించారు’’అని రణధీర్ జైశ్వాల్ తెలిపారు.