పాడైపోయిన, ఫ్రిజ్​లోనిల్వ ఉంచి మాంసం డెలివరీ

పాడైపోయిన, ఫ్రిజ్​లోనిల్వ ఉంచి మాంసం డెలివరీ

హైదరాబాద్, వెలుగు: కరోనా కారణంగా ఫుడ్​తో పాటు గ్రాసరీ, మెడిసిన్స్​తో పాటు నిత్యావసరాలను సైతం ఆన్ లైన్​లో ఆర్డర్లు చేసేవారి సంఖ్య పెరిగింది. ఇందుకోసం ఎన్నో ఆన్ లైన్ డెలివరీ యాప్​లు పుట్టుకొచ్చాయి. మీట్​(మాంసం) స్టోర్ యాప్​లు సైతం అందుబాటులోకి రావడంతో చాలామంది ఆన్ లైన్​లో ఫ్రెష్ మీట్ ఆర్డర్ చేసుకోవడం మొదలుపెట్టారు. అప్పటికప్పుడు కట్ చేసిన  ఫ్రెష్ మీట్​ను హోం డెలివరీ చేస్తుండటంతో ఇలాంటి యాప్​లకు డిమాండ్ పెరిగింది.  కానీ గత కొంతకాలంగా కొన్ని మీట్ స్టోర్లు.. పాడైపోయిన, ఎక్కువ కాలం నిల్వ చేసిన, ఎక్స్ పైరీ డేట్ ముగిసిన మాంసాన్ని డెలివరీ చేస్తున్నాయంటూ కస్టమర్లు చెప్తున్నారు.  వీకెండ్స్‌‌‌‌లో ఇలాంటి డెలివరీలు ఎక్కువగా ఉంటున్నాయంటున్నారు. ​ ఫ్రిజ్​లో ఎక్కువ రోజులు నిల్వ చేసిన మాంసాన్ని ఫ్రెష్ ​మీట్ అని చెప్పి డెలివరీ చేస్తున్నారని.. యాప్​లకు సంబంధించిన హెల్ప్ లైన్​కు​ కాల్ చేస్తే రెస్పాన్స్ ఉండట్లేదని కస్టమర్లు వాపోతున్నారు. 

గతంలో ప్యాక్ చేసినవి పంపిస్తూ..

వీకెండ్స్ లో ఈ ఆన్‌‌‌‌లైన్‌‌‌‌ మీట్ స్టోర్లకు ఫుల్ గిరాకీ ఉంటోంది. ఉదయం నుంచే ఆర్డర్లు మొదలవుతుంటాయి. మీట్ స్టోర్ యాప్‌‌‌‌లలో చుట్టుపక్కల ఉండే చికెన్, మటన్, ఫిష్​ స్టోర్లు కూడా అందుబాటులోకి వచ్చేశాయి. వీకెండ్స్‌‌‌‌లో ఉదయం 11 గంటలకే చాలా యాప్‌‌‌‌లో ‘సోల్డ్ ఔట్’ అని కనిపిస్తుంటుంది. దీన్ని అవకాశంగా తీసుకుని కొందరు షాప్ ఓనర్లు అంతకుముందే ప్యాక్ చేసిన, నిల్వ చేసి ఉంచిన మాంసాన్ని పంపించేస్తున్నారు. ఈ పార్సిల్స్ పై ఎక్స్‌‌‌‌పైరీ డేట్‌‌‌‌లు లేకపోగా మాంసం మొత్తం గడ్డకట్టుకుపోయి ఉంటోందని కస్టమర్లు చెప్తున్నారు. ఒక్కోసారి ఒక ఐటమ్​కు బదులు మరో దాన్ని సైతం డెలివరీ చేస్తున్నారంటున్నారు. మాంసం కుళ్లిపోవడం లేదా గడ్డకట్టుకుని ఉండటంతో కొందరు హెల్ప్ లైన్ నంబర్ కు కాల్ చేసి రీఫండ్ పొందుతున్నారు. కొన్నిసార్లు కాల్ చేసినా  రెస్పాన్స్‌‌‌‌ లేకపోవడంతో సంబంధిత యాప్‌‌‌‌లలో రివ్యూల రూపంలో తమ కంప్లయింట్లను పెడుతున్నారు. 

అధికారులకు ఫిర్యాదు ఇలా..  

ఆన్​లైన్ ఆర్డర్​ ద్వారా​ డెలివరీ అయిన ఫుడ్ బాగాలేకపోతే ఫుడ్ సేఫ్టీ డిపార్ట్‌‌‌‌మెంట్‌‌‌‌ను సంప్రదించాలని అధికారులు చెప్తున్నారు. కొంతకాలంగా  ఆన్‌‌‌‌లైన్‌‌‌‌ ఫుడ్ డెలివరీలపై కూడా ఎక్కువ కంప్లయింట్లు వస్తున్నాయన్నారు. ఆన్‌‌‌‌లైన్ మీట్ డెలివరీ విషయంలోనూ ఎలాంటి సమస్య ఉన్నా జీహెచ్‌‌‌‌ఎంసీ కంట్రోల్‌‌‌‌ రూమ్‌‌‌‌ టోల్ ఫ్రీ నం. 040–21111111 కు కాల్ చేయాలని లేదా afc@ghmc కు కంప్లయింట్ చేయొచ్చంటున్నారు.కుళ్లిన మాంసాన్ని డెలివరీ చేసినట్లు అనుమానం ఉంటే వాటిని ప్రభుత్వ లేబోరేటరీకి పంపించి నాణ్యతను పరీక్షిస్తామంటున్నారు.

గడ్డ కట్టిన చికెన్..

పది రోజుల కిందట వర్షం పడుతుంటంతో ఆన్‌‌‌‌లైన్‌‌‌‌లో ‘కర్రీ కట్ చికెన్’ ఆర్డర్ చేశాం.  మాకు దగ్గరలో ఉన్న ఓ చికెన్ సెంటర్ నుంచి​ డెలివరీ వచ్చింది. ప్యాకింగ్ అంతా బాగానే చేశారు. కానీ ఓపెన్ చూస్తే  చికెన్ అంతా గడ్డకట్టిపోయి ఉంది. డీప్ ఫ్రిజ్​లో ఉన్న చికెన్ పంపించినట్లు తెలిసింది. వెంటనే హెల్ప్ లైన్​ను కాంటాక్ట్ అయ్యాం. చికెన్ ఫొటో తీసి పంపించాం. ఏజెంట్ అందుబాటులోకి వచ్చి మనీ రీఫండ్ చేస్తామని చెప్పాడు.

- మాలతి, కస్టమర్, మణికొండ

ఎలాంటి సమస్య ఉన్నా..

ఆన్‌‌‌‌లైన్‌‌‌‌లో ఫ్రెష్ మీట్ ఆర్డర్‌‌‌‌‌‌‌‌ చేసుకునే వారు స్టోర్ డీటెయిల్స్ అన్నీ చూసుకోవాలి. వాళ్లు రిసీవ్ చేసుకున్న ఆర్డర్‌‌‌‌‌‌‌‌లో ఎలాంటి ప్రాబ్లమ్ ఉన్నా ఫుడ్ సేఫ్టీ వింగ్‌‌‌‌ని కాంటాక్ట్ అవ్వొచ్చు. 24 గంటల హెల్ప్‌‌‌‌లైన్ అందుబాటులో ఉంది. వెంటనే రెస్పాన్స్ ఉంటుంది. చాలా మంది కస్టమర్ కేర్‌‌‌‌‌‌‌‌ని సంప్రదించి రెస్పాన్స్ రాకుంటే వదిలేస్తున్నారు. కానీ ఇలాంటివి డిపార్ట్‌‌‌‌మెంట్ దృష్టికి తీసుకొస్తే మరోసారి రిపీట్ కాకుండా యాక్షన్ తీసుకోవడానికి వీలుంటుంది. 

- బాలాజీ, అసిస్టెంట్ ​ఫుడ్ కంట్రోలర్, జీహెచ్ఎంసీ