- ఏటీఎంలలో జమ చేయాల్సిన రూ.31.35 లక్షలు సైతం స్వాహా
- మెదక్‌లోని ఆదర్శ కో ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్‌లో ఘటన
- ముగ్గురు అరెస్ట్, పరారీలో మేనేజర్
మెదక్, వెలుగు: బెట్టింగ్‌లకు అలవాటు పడి లక్షల్లో నష్టపోయిన ఓ బ్యాంక్ మేనేజర్ తాను పనిచేసే బ్యాంక్‌కే కన్నం పెట్టాడు. తన భార్య, ఫ్రెండ్స్ పేర్లతో నకిలీ బంగారం తాకట్టు పెట్టి కోటికి పైగా లోన్ తీసుకున్నాడు. దీంతో పాటు ఏటీఎంలలో జమ చేయాల్సిన డబ్బులు సైతం కాజేశాడు. ఈ ఘటన మెదక్ జిల్లా కేంద్రంలో వెలుగు చూసింది. కేసుకు సంబంధించిన వివరాలను డీఎస్పీ ప్రసన్నకుమార్ మంగళవారం వెల్లడించారు. ఆదర్శ కో ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ బ్రాంచ్ మెదక్ పట్టణంలో 2025 జులైలో ప్రారంభమైంది. కామారెడ్డికి చెందిన యాదం అనిల్ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. బెట్టింగ్‌లకు అలవాటు పడిన అనిల్ ఓ యాప్ ద్వారా పెట్టుబడులు పెట్టి లక్షల్లో నష్టపోయాడు.
ఈ క్రమంలో అనిల్ తన భార్య స్రవంతి, కామారెడ్డికి చెందిన స్నేహితుడు సుబ్రమణ్యంతో పాటు మరికొందరు తెలిసిన వారి ఆధార్, పాన్ కార్డులు వాడుకొని తొమ్మిది నెలల్లో 16 గోల్డ్ లోన్ అకౌంట్లు ఓపెన్ చేశాడు. వీటిలో వన్‌గ్రామ్ గోల్డ్ తాకట్టు పెట్టి రూ.1.48 కోట్లు తీసుకున్నాడు. ఇందుకు బ్యాంక్‌లో పనిచేసే, మెదక్ పట్టణానికి చెందిన గోల్డ్ అప్రైజర్ శ్రీనివాసాచారి సైతం సహకరించాడు. ఇటీవల ఓ సైబర్ కేసులో స్రవంతి అకౌంట్‌ను పోలీసులు ఫ్రీజ్ చేశారు. ఎంక్వైరీలో భాగంగా స్రవంతి అకౌంట్‌ను పరిశీలించగా.. అనుమానాస్పద లావాదేవీలు కనిపించాయి.
దీంతో వారు ఆదర్శ కో ఆపరేటివ్ బ్యాంక్ సీఈవో వెంకటరమణ దృష్టికి తీసుకెళ్లారు. ఆయన సోమవారం మెదక్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. టౌన్ సీఐ మహేశ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టడంతో నకిలీ గోల్డ్ లోన్ విషయం బయటపడింది. బ్యాంక్‌లో మొత్తం 199 అకౌంట్లపై ఉన్న గోల్డ్‌ను తనిఖీ చేయగా.. మేనేజర్ అనిల్ ఓపెన్ చేసిన 16 ఫేక్ అకౌంట్లు బయటపడ్డాయి. ఈ అకౌంట్ల ద్వారా రూ. 1.48 కోట్లతో పాటు మెదక్‌లో ఉన్న ఏటీఎంలలో డిపాజిట్ చేసే సందర్భంలో రూ.31.35 లక్షలు సైతం అక్రమంగా వాడుకున్నట్లు తేలింది.
మేనేజర్ అనిల్ గతంలో ఏపీలోని వేలేరుపాడు ఏపీ గ్రామీణ వికాస్ బ్యాంక్ బ్రాంచ్‌లో పనిచేసిన సమయంలో సైతం పోలవరం నిర్వాసితులు, గిరిజనులను మోసం చేసి రూ.11,82,487 వాడుకున్నారని, ఆ కేసులో జైలుకు సైతం వెళ్లి వచ్చాడని డీఎస్పీ వివరించారు. బ్యాంక్ మేనేజర్ అనిల్ పరారీలో ఉండగా... అతడి భార్య స్రవంతి, స్నేహితుడు సుబ్రహ్మణ్యం, గోల్డ్ అప్రైజర్ శ్రీనివాసాచారిని మంగళవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు డీఎస్పీ వెల్లడించారు. పరారీలో ఉన్న అనిల్ పట్టుకునేందుకు కోసం స్పెషల్ టీమ్స్‌ను ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
