ఉమ్మడి మెదక్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి మెదక్ జిల్లా సంక్షిప్త వార్తలు
  • ఆఫీసర్లకు మెదక్ అడిషనల్​ కలెక్టర్​ రమేశ్​ ఆదేశం

మెదక్​ టౌన్, వెలుగు : జిల్లా వ్యాప్తంగా ఈ ఖరీఫ్ సీజన్​లో ఐదు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వచ్చే అవకాశమున్నందున కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉండాలని సంబంధిత అధికారులను మెదక్​ అడిషనల్ ​కలెక్టర్​ రమేశ్​ ఆదేశించారు. మంగళవారం తన చాంబర్​లో ఖరీఫ్ 2022–23 కు సంబంధించి నోడల్ అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఖరీఫ్ లో  అక్టోబర్ 15 తరువాత  ధాన్యం భారీగా మార్కెట్​కు వచ్చే అవకాశముందని, రైతులకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలని సూచించారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు,  ఐకేపీ ఆధ్వర్యంలో 350 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని సూచించారు.

సుమారు కోటీ 60 లక్షల గోనె సంచులు అవసరమవుతాయని,  కాగా 40 లక్షలు అందుబాటులో ఉన్నాయని, మిగతా వాటిని తెప్పించేందుకు చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఈసారి ధాన్యం సేకరణలో రెవెన్యూ సిబ్బంది ఉండరని, ఎంపీడీవోలు, ఎంపీవోలు,  పంచాయతీ కార్యదర్శులు పూర్తి  భాగస్వామ్యం ఉండేలా చూడాలని జడ్పీ సీఈవోకు సూచించారు. కొనుగోళ్ల ప్రక్రియ  ముగిసే వరకు అధికారులకు సెలవులు ఇవ్వబడవని స్పష్టం చేశారు. సమావేశంలో జడ్పీ సీఈవో వెంకట శైలేశ్, డీఆర్​డీవో శ్రీనివాస్​, డీఎస్​వో శ్రీనివాస్​, జిల్లా పౌర సరఫరాల మేనేజర్ గోపాల్, డీఏవో ఆశాకుమారి, డీసీవో  కరుణ, డీటీవో శ్రీనివాస్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.

బాధితులకు అండగా పోలీస్ భరోసాసెంటర్

సిద్దిపేట రూరల్, వెలుగు : సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ భరోసా సెంటర్ లైంగిక దాడులకు గురైన బాధితులకు పూర్తి సహాయ, సహకారాలను అందిస్తోందని సీపీ ఎన్.శ్వేత అన్నారు. మంగళవారం సిద్దిపేట భరోసా సెంటర్ లో సిబ్బందితో మహిళల, బాలల రక్షణకు సేవలు అందించడానికి తీసుకుంటున్న చర్యలపై సమీక్షించారు.  సెంటర్ సేవల కోసం డయల్ 100కు కానీ, సిద్దిపేట జిల్లా పోలీస్ కంట్రోల్ రూమ్ 8333998699 నంబర్ కు కానీ ఫోన్ చేయొచ్చన్నారు. సమావేశంలో అడిషనల్ డీసీపీ అడ్మిన్ మహేందర్, మహిళా పోలీస్ స్టేషన్ ఇన్స్​పెక్టర్ ఏబీ దుర్గ, మహిళ ఎస్సై స్రవంతి, భరోసా  సెంటర్ సిబ్బంది  పాల్గొన్నారు.

ఇష్టం లేని పెండ్లి చేశారని ఆత్మహత్య

కోహెడ(హుస్నాబాద్​), వెలుగు: తనకు ఇష్టం లేని పెండ్లి చేశారని మనస్తాపానికి గురై ఓ మహిళ ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో మంగళవారం జరిగింది. పోలీసులు తెలిపిన ప్రకారం.. హుస్నాబాద్​కు చెందిన బొల్లంపల్లి శారద (25)కు తిమ్మపూర్ ​మండలం నేందునూర్​ గ్రామానికి చెందిన శ్యాంసుందర్​తో ఐదు నెలల కింద వివాహం జరిగింది. కొన్ని రోజుల నుంచి తల్లిగారింటి వద్ద ఉంటుంది. తనకు ఇష్టం లేని పెండ్లి చేశారంటూ తీవ్ర మనస్తాపం చెంది ఆమె మంగళవారం ఇంటి వద్ద చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యప్తు చేస్తున్నామని ఎస్సై శ్రీధర్​ తెలిపారు.

చెత్తను తొలగించిన బీజేపీ లీడర్లు

మెదక్​ (కౌడిపల్లి)/మెదక్​టౌన్​, వెలుగు: ప్రధాని నరేంద్ర మోడీ బర్త్​డే పురస్కరించుకుని నిర్వహిస్తున్న  సేవాపక్షంలో భాగంగా మంగళవారం కౌడిపల్లి మండలం రాజీపేటలో దళిత మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి తిమ్మాపూర్ మహిపాల్ ఆధ్వర్యంలో చెరువులో పేరుకుపోయిన చెత్తా చెదారం, వ్యర్థ పదార్థాలు తొలగించారు. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, నర్సాపూర్ నియోజకవర్గ ఇన్​చార్జి సింగాయిపల్లి గోపి, గౌడ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లేశ్​గౌడ్ మాట్లాడుతూ బీజేపీ తోనే అభివృద్ధి సాధ్యమన్నారు. ప్రజాప్రతినిధుల బర్త్​డేలకు హంగు ఆర్భాటాలతో కేక్​లు కట్ చేయడంతో ప్రయోజనం ఏమి ఉండదన్నారు.  రాబోయే రోజుల్లో రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక గ్రామాల అభివృద్ధితోపాటు, రైతాంగానికి అండగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో బీజేపీ రాజీపేట అధ్యక్షుడు బాంచ నాగభూషణం, బీజేవైఎం మండల ప్రధాన కార్యదర్శి నాగరాజు, ఎస్సీ దళిత మోర్చ మండల అధ్యక్షుడు సాయి, సుధాకర్ పటేల్, తదితరులు పాల్గొన్నారు.

మెదక్​లో...

మెదక్​ కలెక్టరేట్​ వద్ద ఉన్న కాల్వలో పేరుకుపోయిన చెత్తను జేసీబీతో మంగళవారం బీజేపీ నాయకులు శుభ్రం చేయించారు. కార్యక్రమంలో పార్టీ మెదక్​ జిల్లా ప్రెసిడెంట్​ గడ్డం శ్రీనివాస్​, దళిత మోర్చా జిల్లా జనరల్​ సెక్రటరీ వరప్రసాద్, జిల్లా  జనరల్​ సెక్రటరీ నల్లాల విజయ్ కుమార్,  టౌన్​ ప్రెసిడెంట్​ నాయిని ప్రసాద్.  బీజేవైఎం జిల్లా ప్రెసిడెంట్​ ఉదయ్ కిరణ్,  నాయకులు ఉన్నారు.

ఏటీఎం దొంగల అరెస్ట్

సంగారెడ్డి టౌన్, వెలుగు : ఏటీఎంలు దొంగలిస్తున్న ముఠాను సంగారెడ్డి జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ రమణకుమార్ మీడియాకు నిందితుల వివరాలను వెల్లడించారు. హర్యానా, రాజస్తాన్  కు చెందిన తాలిమ్, లియాకత్ ఖాన్​పటన్ చెరులో, రాహుల్ ఖాన్, తసలీం ఖాన్, జాకిహీర్ ఖాన్, ఇర్ఫాన్ ఖాన్ పహాడీషరీఫ్ లో జేసీబీ మెకానిక్​గా పని చేస్తున్నారు. వీరు ముఠాగా ఏర్పడి కాటేదాన్, చర్లపల్లి తదితర ప్రాంతాల్లో ట్రాలీ ఆటోలు, ఏటీఎంల దొంగతనాలకు పాల్పడ్డారు.

అయితే ఈనెల19న మధ్యాహ్నం పాటీ చౌరస్తా వద్ద బీడీఎల్ భానూర్ పోలీసులు వాహనాలు తనిఖీ  చేస్తుండగా కారు, మోటార్ సైకిల్ పై ఉన్న ఇద్దరు వ్యక్తులు పోలీసులను చూసి పారిపోవడానికి ప్రయత్నించారు. అనుమానంతో వారిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించగా  పలుచోట్ల దొంగతనాలకు పాల్పడినట్లు వారు ఒప్పుకున్నారు. నిందితుల వద్ద నుంచి దొంగతనానికి ఉపయోగించే గ్యాస్, ఆక్సిజన్ సిలిండర్, కత్తి , బొమ్మ తుపాకీ, స్ప్రే బాటిల్, గ్యాస్ కట్టర్ స్వాధీనం చేసుకొని వారిని కోర్టులో హాజరుపర్చినట్లు తెలిపారు. ఆరుగురు నిందితుల్లో నలుగురు అరెస్టు కాగా,  మరో ఇద్దరు పరారీలో ఉన్నారని, వారిని త్వరలోనే అదుపులోకి తీసుకుంటామని చెప్పారు. కార్యక్రమంలో ఏఎస్పీ ఉషా విశ్వనాథ్, భానూర్ సీఐ వినాయకరెడ్డి, ఎస్సై మహేశ్వర్ రెడ్డి ఉన్నారు. 

తీర్మానాలు సరే.. అమలేది?

సిద్దిపేట రూరల్ (నారాయణరావుపేట), వెలుగు: మండల సర్వసభ్య సమావేశాలలో ఎన్ని తీర్మానాలు చేసినా అమలుకు నోచుకోవడం లేదని సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట మండల ప్రజాపత్రినిధులు అధికారులపై అసహనం వ్యక్తం చేశారు. మంగళవారం మండల సర్వ సభ్య సమావేశం ఎంపీపీ ఒగ్గు బాలకృష్ణ అధ్యక్షతన గ్రామ పంచాయతీ సమావేశం హాల్​లో నిర్వహించారు. ఈ సందర్భంగా సభ్యులు పలు సమస్యలను సమావేశం దృష్టికి తీసుకొచ్చారు. మండల సమావేశం ఉందని తెలిసినా ఆయా శాఖల అధికారులు గైర్హాజర్ కావడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గైర్హాజరు అయినవారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్​ చేశారు.

నిర్ణయాలు తీసుకోవడానికే పరిమితం కాకుండా అమలు చేయాలని కోరారు. ఐసీడీఎస్, వెటర్నరీ హాస్పిటల్, పంచాయతీ రాజ్ శాఖ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రంతో పాటు పలు సమస్యల పై తీర్మానం చేశారు. ఇదిలా ఉంగా సమావేశంలో అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొనాల్సిన సమావేశంలో వారి భర్తలు, సామాన్య ప్రజలు కూర్చున్నారు. విషయం తెలిసినా ఎంపీడీవో మౌనంగా ఉండడాన్ని పలువురు విమర్శించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ లక్ష్మీరాఘవరెడ్డి, ఎమ్మార్వో ఉమారాణి, హర్టికల్చర్ అధికారి భాస్కర్ రెడ్డి, ఏఈలు సత్యం, కృష్ణారెడ్డి, ప్రేమ్ సాగర్, రాజు, ఎంపీవో శ్రీనివాస్, ఏపీఏం ధర్మసాగర్ అయా గ్రామాల సర్పంచులు, శాఖల అధికారులు పాల్గొన్నారు.

ఏరోస్పేస్​లో ఎల్​టీఏలదే కీ రోల్

రామచంద్రాపురం (పటాన్​చెరు), వెలుగు : ఏరోస్పేస్​ సిస్టమ్స్​లో ఎల్​టీఏ (లైటర్​ దాన్​ ఎయిర్​) వ్యవస్థలు సముచిత స్థానాలను ఆక్రమించాయని ఐఐటీ బాంబే ఏరోస్పేస్​ ఇంజినీరింగ్ ప్రొఫెసర్ రాజ్​కుమార్​ ఎస్.పంత్​ చెప్పారు. పటాన్​చెరు పరిధిలోని గీతం డీమ్డ్​ యూనివర్సిటీ స్కూల్​ ఆఫ్​టెక్నాలజీ ఏరోస్పేస్​ ఇంజినీరింగ్​ విభాగం ఆధ్వర్యంలో ‘డిజైన్​ అండ్ సైజింగ్ ఆఫ్​ ఆన్ ​ఇండోర్​ఏయిర్ ​షిప్’ అనే అంశంపై నిర్వహిస్తున్న వర్క్​షాప్ మంగళవారం ప్రారంభమైంది. కార్యక్రమానికి చీఫ్​గెస్టుగా రాజ్​కుమార్​ ఎస్.పంత్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏయిర్ ​షిప్​లు, ఏరోస్టాట్లు టెక్నికల్​ మెథడ్స్​ అని, వైమానిక నిఘా, వైర్​లెస్​ కమ్యూనికేషన్, ప్రొడక్ట్​ ప్రమోషన్ లాంటి పనులలో వీటి వినియోగం గణనీయంగా పెరిగిందన్నారు.

ఈ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో ప్రయాణికులు, సరుకుల రవాణా చేయవచ్చని తెలిపారు. గీతం నిర్వహిస్తున్న ఏరోస్పేస్ వర్క్​షాప్ ఎల్​టీఈని మరింత అభివృద్ధి చేసేందుకు దోహదం చేస్తుందన్నారు. సైన్స్​ను అర్థం చేసుకోవడం సులువని, దానిని ఇంజినీరింగ్​గా మార్చడం సవాళ్లతో కూడుకున్నదని గీతం రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ ప్రోగ్రాం డైరెక్టర్ ప్రొఫెసర్​ కేఆర్.అనంత్ ​అన్నారు. కార్యక్రమంలో గీతం స్కూల్​ఆఫ్​టెక్నాలజీ అసోసియేట్​ డైరెక్టర్ ఎన్.సీతారామయ్య, ఏరోస్పేస్​ వింగ్​ హెడ్ ​డాక్టర్ వి. హిమబిందు, ఎం. సత్యప్రసాద్, ఎ.సత్యాదేవి పాల్గొన్నారు. 

ఓర్వలేక రాజకీయాలు చేస్తున్రు.. 

సిద్దిపేట రూరల్/గజ్వేల్, వెలుగు : తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలను చూసి ఓర్వలేక ఇతర పార్టీల నాయకులు రాజకీయాలు చేస్తున్నారని మంత్రి హరీశ్ రావు అన్నారు. మంగళవారం కొండపాక మండలంలోని కొండపాక, జప్తినాచారం, ఖమ్మంపల్లి, దుద్దెడ గ్రామలలో కొత్తగా నిర్మించిన 218 డబల్ బెడ్ రూమ్ ఇండ్లను ఆయన ప్రారంభించారు. అనంతరం దుద్దెడ గ్రామంలోని వైష్ణవి గార్డెన్ లో 1067 మంది ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు పెన్షన్ పత్రాలు, మహిళలకు బతుకమ్మ చీరలను అందజేశారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్, బీజేపీ అధికారం ఉన్న రాష్ట్రాల్లో కల్యాణలక్ష్మి, కేసీఆర్ కిట్,  రైతుబంధు, రైతు బీమా లాంటి పథకాలు ఇస్తున్నారా అని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడకముందు ఇక్కడివాళ్లు  ఉపాధి కోసం బొంబాయి, దుబాయ్, హైదరాబాద్ లాంటి పట్టణాలకు పోయేవారని, ఆ పరిస్థితి నుంచి ఇక్కడి పొలాల్లో పని చేయడానికి ఇతర రాష్ట్రాల కూలీలను తెచ్చుకునే స్థాయికి ఎదిగామన్నారు. అనంతరం చిన్నకోడూర్ మండలం పెద్దకోడూర్ గ్రామంలో గ్రామ మహిళా సమాఖ్య భవనాన్ని, రెడ్డి సంఘ భవనాన్ని, ఓహెచ్ఎస్ఆర్ నీటి ట్యాంక్ తో పాటు పలు అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించారు. ఆయన వెంట జడ్పీ చైర్ పర్సన్ రోజా శర్మ, జడ్పీటీసీ అనంతుల అశ్విని ప్రశాంత్, డీసీసీబీ చైర్మన్ దేవేందర్ రెడ్డి, ఎఫ్​డీసీ చైర్మన్ ప్రతాప్​రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, ఆర్డీవో విజేందర్ రెడ్డి ఉన్నారు. 

కొండపాక లో మహిళల ఆందోళన

మంత్రి పర్యటన విషయం తెలుసుకున్న కొండపాక, ఖమ్మంపల్లి గ్రామాలలోని పలువురు మహిళలు తమకు డబుల్ బెడ్ రూమ్​లు రాలేదని ఆందోళన చేశారు. అనర్హులకు ఇండ్లు కేటాయించి తమకు అన్యాయం చేశారని గొడవకు దిగడంతో పోలీసులు మంత్రి కార్యక్రమానికి ఆటకం కలుగకుండా ముందే వారిని అడ్డుకున్నారు. అనంతరం డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ప్రారంభించడానికి వచ్చిన మంత్రి హరీశ్ రావు ను కొందరు మహిళలు కలిసి తమకు ఇల్లు వచ్చేలా చూడాలని కోరారు. దీనిపై మంత్రి స్పందిస్తూ అందరికీ న్యాయం జరిగేలా చూస్తామని వారికి భరోసానిచ్చారు. మహిళల ఆరోపణలపై వెంటనే విచారణ జరిపి అర్హులైన వారికి ఇండ్లు వచ్చేలా చూడాలని అధికారులను ఆయన ఆదేశించారు. 

ఎమ్మెల్యే సారూ.. ఈ రోడ్డు కనిపిస్త లేదా? 

కోహెడ(బెజ్జంకి)వెలుగు : పొద్దుపొడుపు పేరిట గ్రామాల్లో పర్యటిస్తున్న ఎమ్మెల్యే రసమయి బాలకిషన్​కు బెజ్జంకిలో గుంతలమయంగా మారిన రోడ్డు కనిపించడం లేదా అంటూ అఖిలపక్షం నాయకులు ప్రశ్నించారు. ఈ మేరకు మంగళవారం బెజ్జింకిలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండల కేంద్రంలో కొన్నాళ్లుగా రోడ్డుపై గుంతలు పడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. రోడ్డును రిపేర్​ చేయకుండా ఎమ్మెల్యే నిర్లక్ష్యం చేస్తున్నారని మండిపడ్డారు. వెంటనే మంత్రి, ఎమ్మెల్యే స్పందించి రోడ్డును బాగుచేయించాలని, లేకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ మండల అధ్యక్షులు ముక్కిస రత్నాకర్​రెడ్డి, తిప్పారపు శ్రీనివాస్, రూపేశ్, నాయకులు లక్ష్మణ్, మల్లేశం, సాయికృష్ణ, శ్రీనివాస్​రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

ఫారెస్ట్ ఆఫీస్​ ఎదుట బీజేపీ నాయకుల ధర్నా

నర్సాపూర్, వెలుగు : పేదల భూములను అధికార పార్టీ నాయకులకు దారాదత్తం చేస్తున్న అధికారులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ ఆధ్వర్యంలో మంగళవారం నర్సాపూర్​ఫారెస్ట్ ఆఫీసు ఎదుట ధర్నా చేశారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సింగయ పల్లి గోపి, రాష్ట్ర నాయకుడు రఘువీరారెడ్డి మాట్లాడుతూ ఫారెస్ట్ అధికారులు అధికార పార్టీ నాయకులకు వత్తాసు పలుకుతూ అటవీ భూమిని స్వాహా చేస్తున్నారని ఆరోపించారు. నర్సాపూర్ నియోజకవర్గంలో వివిధ మండలాల్లో 50 సంవత్సరాలుగా సాగు చేస్తున్న గిరిజన భూములను ఫారెస్ట్ ల్యాండ్ పేరిట లాక్కొని అధికార పార్టీ నాయకులకు కట్టబెట్టారని మండిపడ్డారు. వెంచర్లకు దారి పేరిట ఫారెస్ట్ భూములను అప్పజెప్పడం సరికాదని, దానికి కారణమైన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం ఫారెస్ట్ రేంజ్ అధికారికి వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో గౌడ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లేశ్​గౌడ్, ఓబీసీ జిల్లా అధ్యక్షుడు రమేశ్​గౌడ్, అసెంబ్లీ కన్వీనర్ కౌన్సిలర్ గోడ రాజేందర్, సంఘసాని సురేశ్, పట్టణ అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్ పాల్గొన్నారు.