మెదక్ టౌన్, వెలుగు : మెదక్ జిల్లాలో తాత్కాలికంగా కేంద్రీయ విద్యాలయాన్ని ప్రారంభించేందుకు అనువైన పాఠశాల భవనాలను గుర్తించాలని కలెక్టర్ ప్రతిమాసింగ్ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ లో కేంద్రీయ విద్యాలయ డిప్యూటీ కమిషనర్ సంతోష్ కుమార్, అసిస్టెంట్ కమిషనర్ ఎ.ఎ. ఇజ్రాయల్, అడిషనల్ కలెక్టర్ నగేశ్, జడ్పీ సీఈవో ఎల్లయ్యతో కలిసి జిల్లాలో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుపై చర్చించారు.
జిల్లాలో నూతన కేంద్రీయ విద్యాలయం నెలకొల్పేందుకు హవేళీ ఘనపూర్ మండలంలో వైపీఆర్ ఇంజినీరింగ్ కాలేజ్ పరిసర ప్రాంతాలక్లో ఆరు ఎకరాల స్థలాన్ని గుర్తించామన్నారు. అందులో భాగంగా తాత్కాలికంగా ప్రారంభించేందుకు అనువైన విద్యాలయ భవన సముదాయాలను గుర్తించాలని సూచించారు. అంతకుముందు మెదక్ పట్టణంలో పలు భవనాలను ఆమె పరిశీలించారు.
