
మెదక్‌టౌన్, వెలుగు: జిల్లాలోని రసాయన, ఔషధ పరిశ్రమల్లో ప్రమాదాలు జరగకుండా ముందస్తు తనిఖీలు నిర్వహించి నివేదికలు అందజేయాలని కలెక్టర్ రాహుల్ రాజ్ ఆదేశించారు. మంగళవారం ప్రజావాణి హాల్లో ఫ్యాక్టరీలు, రసాయన పరిశ్రమల్లో భద్రతపై జిల్లా స్థాయి కమిటీతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జూన్ 30న సంగారెడ్డి జిల్లా పాశమైలారం ఘటన నేపథ్యంలో ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ఫ్యాక్టరీల్లో ప్రమాదాల నివారణకు ముందస్తు చర్యలు తీసుకోవాలని చెప్పిందన్నారు.
ఫ్యాక్టరీలలో పనిచేసే కార్మికుల పూర్తి సమాచారం యాజమాన్యాల వద్ద ఉండాలని, వారు మత్తు పదార్థాలకు బానిసలవకుండా చూడాలన్నారు. జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలల భవనాలపై సోలార్‌పవర్ ప్లాంట్‌ఏర్పాటుకు 3 రోజుల్లో నివేదికలు రూపొందించాలని కలెక్టర్ రాహుల్ రాజ్ఆదేశించారు. అడిషనల్ కలెక్టర్ నగేశ్, జడ్పీ సీఈవో ఎల్లయ్య తదితరులున్నారు.
వర్షాల నేపథ్యంలో సెలవులు రద్దు
మూడు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ రాహుల్‌రాజ్ ఆదేశించారు. ప్రభుత్వ ఉద్యోగులకు సెలవులు రద్దు చేస్తున్నట్లు తెలిపారు. మంగళవారం రాత్రి కలెక్టరేట్లో జిల్లాస్థాయి అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో ఎక్కడైనా ఇబ్బందులు తలెత్తితే కంట్రోల్ రూం నంబర్ 9391942254 కు సమాచారం ఇవ్వాలని సూచించారు. ధూప్‌సింగ్ తండా పంచాయతీ సెక్రటరీ అదే ప్రాంతంలో అందుబాటులో ఉండాలని డీపీవోను ఆదేశించారు. ఫీవర్ సర్వే పకడ్బందీగా నిర్వహించాలని, డెంగ్యూ, మలేరియా టెస్టులు చేయాలన్నారు.
ఇందిరమ్మ ఇండ్ల పనుల్లో నిజాంపేట ఆదర్శం
నిజాంపేట, వెలుగు: ఇందిరమ్మ ఇండ్ల పనుల పురోగతిలో నిజాంపేట మండలం ఆదర్శంగా నిలుస్తోందని కలెక్టర్ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని వెటర్నరీ హాస్పిటల్, ఎంపీడీవో ఆఫీస్, కల్వకుంట ప్రైమరీ స్కూల్, సబ్ హెల్త్ సెంటర్, అంగన్వాడీ సెంటర్, ఇందిరమ్మ ఇండ్ల పనులను పరిశీలించారు. కల్వకుంట స్కూల్ స్టూడెంట్స్ మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ బాగా సాల్వ్ చేస్తున్నారని వారిని అభినందించారు.