మెదక్​లో కాంగ్రెస్​దే విజయం : నీలం మధు ముదిరాజ్

మెదక్​లో కాంగ్రెస్​దే విజయం : నీలం మధు ముదిరాజ్

రామచంద్రాపురం/పటాన్​చెరు(గుమ్మడిదల),వెలుగు: అందరం కలిసి సమష్టిగా పనిచేస్తే మెదక్​లో కాంగ్రెస్​ విజయం తథ్యమని మెదక్ కాంగ్రెస్​ఎంపీ అభ్యర్థి నీలం మధు అన్నారు. శుక్రవారం పటాన్​చెరు అసెంబ్లీ నియోజకవర్గ స్థాయి జన జాతర సభా సన్నాహక సమావేశం ఇన్‌చార్జి  కాటా శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో రామచంద్రపురం శ్రీ కన్వెన్షన్​లో నిర్వహించారు. ఈ సందర్భంగా నీలం మధు మాట్లాడుతూ.. గతంలో జరిగిన ఘటనలను మర్చిపోయి కాంగ్రెస్ నాయకులు, ఎన్​ఎంఆర్​ కార్యకర్తలు కలిసి పనిచేయాలని సూచించారు. కాటా శ్రీనివాస్ గౌడ్ తన అన్న లాంటివాడని ఇకపై తాము రామ,లక్ష్మణుల్లా కలిసి డబుల్ షూటర్లుగా పనిచేస్తామన్నారు.కాంగ్రెస్ నిర్వహిస్తున్న జన జాతర సభకు మెదక్ పార్లమెంట్ పరిధి నుంచి నాయకులు, కార్యకర్తలు భారీగా తరలి సత్తా చాటాలని పిలుపునిచ్చారు. 

లక్షన్నర మెజార్టీ తీసుకొస్తాం: కాటా శ్రీనివాస్ గౌడ్

మెదక్ ఎంపీ ఎన్నికల్లో పటాన్​చెరు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో లక్షన్నర ఓట్ల మెజార్టీ లక్ష్యంగా కృషి చేస్తానని ఇన్‌చార్జి కాటా శ్రీనివాస్ గౌడ్ అన్నారు. రాజకీయాలు పక్కనపెట్టి పార్టీ గెలుపు కోసమే పాటుపడాలని పార్టీ నాయకులకు పిలుపునిచ్చారు. గతంలో జరిగిన ఘటనలను తాము ఎప్పుడో మరిచిపోయామని కానీ కొందరు కావాలనే రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. తమ ఇద్దరి మధ్య గొడవలు పెట్టిన వ్యక్తి ఇటీవలే జైలు నుంచి విడుదల అయ్యాడన్నారు. మళ్లీ ఏదో రకంగా నష్టం కలిగించే ప్రయత్నాలు మొదలుపెట్టిన విషయం తమ దృష్టికి వచ్చిందన్నారు. పార్టీ నాయకులు కార్యకర్తలు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. సమావేశంలో  పటాన్​చెరు పార్లమెంట్ ఇన్‌చార్జి శ్యామ్ గౌడ్, కాంగ్రెస్​ నాయకులు పాల్గొన్నారు. 

జన సమీకరణ కమిటీలు

తుక్కుగూడలో నిర్వహిస్తున్న జన జాతర భారీ బహిరంగ సభకు పటాన్​చెరు నియోజకవర్గ నుంచి 30 వేల మందిని తరలించేందుకు అంత సిద్ధం చేశారు. ఇందుకుగాను  సభకు తరలించేందుకు ప్రత్యేకంగా కమిటీలను వేశారు. పదిమందితో కలిసి ఒక వింగ్​ను ఏర్పాటు చేశారు.