ఉమ్మడి మెదక్ ​జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి మెదక్ ​జిల్లా సంక్షిప్త వార్తలు

విజిట్ వీసాపై వచ్చి దొంగతనాలు

మెదక్​, వెలుగు : విజిట్​ వీసాపై మన దేశానికి వచ్చి చోరీలు చేస్తున్న ముగ్గురు ఇరాన్​ దేశస్తులను పోలీసులు అరెస్ట్​ చేశారు. అలాగే మరో ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలు సైతం పోలీసులకు చిక్కారు. మెదక్​ జిల్లా ఎస్పీ రోహిణి ప్రియదర్శిని సోమవారం ఏఆర్​హెడ్​ క్వార్టర్స్​లో వివరాలు వెల్లడించారు. ఇరాన్​రాజధాని టెహ్రాన్​కు చెందిన దవలో కరీం, ఇవాజి నాదర్​, బినాజ్​ బహమన్ ఆగస్టులో విజిట్​వీసాపై న్యూ ఢిల్లీకి వచ్చారు. నెల రోజుల కింద అక్కడ ఓ కారు అద్దెకు తీసుకుని హైదరాబాద్ ​చేరుకున్నారు. ఇక్కడే రూమ్​ రెంట్​కు తీసుకుని ఉంటున్నారు. ఢిల్లీ నుంచి తెచ్చిన కారులోనే గత నెల 11న మెదక్​జిల్లాలోని రామాయంపేటకు వచ్చారు. ఓ చికెన్​సెంటర్​ఓనర్ దగ్గరకు వెళ్లి తమ కరెన్సీ కట్టలను చూపించారు. అతడిని మాటల్లో పెట్టి కౌంటర్​లోని రూ.95 వేలు కొట్టేశారు. అలాగే ఈనెల ఒకటో తేదీన చేగుంటలోని గ్యాస్​ఏజెన్సీకి వెళ్లి ఇదే పద్ధతిలో రూ.20 వేలు ఎత్తుకెళ్లారు. బాధితుల ఫిర్యాదు మేరకు రామాయంపేట సీఐ చంద్రశేఖర్​రెడ్డి, ఎస్సై రాజేశ్ ​ఆధ్వర్యంలో స్పెషల్​ టీంలు ఏర్పాటు చేశారు. 2వ తేదీన రామాయంపేట పోలీసులు నేషనల్​ హైవే మీద వెహికిల్​ చెక్​ చేస్తుండగా రామాయంపేట శివారులో ఢిల్లీ సిరీస్​ నంబర్​తో ఉన్న కారులో ముగ్గురు అనుమానాస్పదంగా కనిపించడంతో వారిని అదుపులోకి తీసుకుని విచారించారు. ఎంక్వైరీలో రామాయంపేట, చేగుంటలో చోరీలకు పాల్పడింది వారేనని తేలింది. ఇరాన్​కు చెందిన వారి నుంచి రూ.95 వేల ఇండియన్​ కరెన్సీ, 850 అమెరికన్​ డాలర్లు, రూ.30.50 లక్షల విలువైన ఇరాన్​ రియాల్స్​, మూడు సెల్​ ఫోన్లు, కారు, మూడు ఇరాన్​ పాస్​ పోర్టులు, రెండు ఇరాన్​ డ్రైవింగ్ లైసెన్స్​లు స్వాధీనం చేసుకుని రిమాండ్ కు తరలించినట్టు ఎస్పీ తెలిపారు. ఇరాన్​ దేశస్థుల పాస్ పోర్టులు ఒరిజినలా? కాదా? అనేది నిర్ధారించేందుకు ఇమ్మిగ్రేషన్​ అధికారులకు లెటర్​ రాస్తామని చెప్పారు. అయితే ఇలాంటి ముఠా మరొకటి ఉన్నట్టు తెలిసిందని ఎస్పీ పేర్కొన్నారు.

  • బీదర్ కు చెందిన దొంగలు  

కొంత కాలంగా మెదక్  జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో దొంగతనాలు చేస్తున్న ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలను అరెస్ట్​ చేసి రిమాండ్ కు తరలించినట్టు ఎస్పీ తెలిపారు. కర్నాటకలోని బీదర్​కు చెందిన ఆకాశ్​కాంబ్లె, సురేశ్​కాంబ్లె, వికాస్​ కాంబ్లె రాత్రి వేళల్లో జిల్లాలోని గ్రామాల్లో తిరిగి రెక్కీ నిర్వహించి తాళాలు వేసి ఉన్న ఇండ్లను ఎంపిక చేసుకుంటారు. మద్యం తాగిన తర్వాత అర్ధరాత్రి 2 గంటల టైంలో తాళాలు పగుల గొట్టి దొంగతనాలు చేస్తారు. ఇలా నర్సాపూర్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలో 6, చిన్నశంకరంపేట పోలీస్​ స్టేషన్​ పరిధిలో రెండు, రామాయంపేట పోలీస్​ స్టేషన్​ పరిధిలో రెండు, కౌడిపల్లి పోలీస్​స్టేషన్​ పరిధిలో ఒక చోరీ చేశారు. వీరు ముగ్గురు పాత నేరస్థులని, 2019, 2020లో వీరు కామారెడ్డి జిల్లా బాన్స్​వాడ, బీర్కూర్​ పరిధిలో 16 చోట్ల దొంగతనాలకు పాల్పడగా పీడీ యాక్ట్​ కింద జైలుకు వెళ్లారన్నారు. జైలు నుంచి వచ్చాక మహారాష్ట్రలోని ముత్కేడ్​ కు వెళ్లి అక్కడ కొన్నాళ్లు ఉన్నారు. తర్వాత మెదక్ జిల్లాకు వచ్చి దొంగతనాలు చేస్తున్నారు. నర్సాపూర్ సీఐ షేక్​లాల్​మదార్​, ఎస్సై గంగరాజు ఆధ్వర్యంలో స్పెషల్​ టీంలు ఏర్పాటు చేసి ఆకాశ్​ కాంబ్లె, సురేష్​ కాంబ్లెలను పట్టుకున్నారు. మరో నిందితుడు వికాస్​ కాంబ్లె పరారీలో ఉన్నాడు. వీరి నుంచి రూ.3.25 లక్షల విలువైన 6 4 గ్రాముల బంగారు నగలు, రూ.1.04 లక్షల విలులైన 1.6 కిలోల వెండి ఆభరణాలు రికవరీ చేసినట్టు ఎస్పీ తెలిపారు. రెండు గ్యాంగులను పట్టుకోవడంలో కృషి చేసిన సీఐ, ఎస్సై, కానిస్టేబుల్​లను ఎస్పీ అభినందించి, నగదు రివార్డులు అందజేశారు. మీడియా సమావేశంలో ఏఎస్పీ బాలస్వామి, తూప్రాన్​ డీఎస్పీ యాదగిరి రెడ్డి ఉన్నారు. 

ప్రజా సమస్యలను పరిష్కరించాలి

మెదక్​టౌన్​, వెలుగు :  ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ప్రజల నుంచి వచ్చిన అర్జీలను పరిశీలించి వెంటనే పరిష్కరించాలని మెదక్​ జిల్లా పౌర సరఫరాల అధికారి శ్రీనివాస్ సంబంధిత ఆఫీసర్లకు సూచించారు.  సోమవారం కలెక్టరేట్​లోని  ప్రజావాణి హాల్​లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఆయన అర్జీలను స్వీకరించి  మాట్లాడారు. మొత్తం ఎనిమిది అర్జీలు వచ్చాయని, ఏవీ పెండింగ్​లో లేకుండా వెంటవెంటనే పరిష్కరించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా పరిశ్రమల మేనేజర్​ కృష్ణమూర్తి, మైనారిటీ శాఖ ఆఫీసర్​ జెమ్లా, డీఎం అండ్​ హెచ్​వో విజయ నిర్మల, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు. 

పట్టణాలకు దీటుగా పల్లెల అభివృద్ధి
ఎమ్మెల్యే రసమయి బాలకిషన్​

కోహెడ(బెజ్జంకి), వెలుగు : టీఆర్ఎస్​ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పట్టణాలకు దీటుగా పల్లెలు అభివృద్ధి చెందుతున్నాయని మానకొండూర్​ఎమ్మెల్యే రసమయి బాలకిషన్​ అన్నారు. సోమవారం బెజ్జంకి మండలంలోని గుండారం, బేగంపేట గ్రామాల్లో సెంట్రల్​ లైటింగ్​ను ఆయన ప్రారంభించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ పల్లెలన్నీ హైమాస్ట్​ లైట్లతో జిగేల్​మంటున్నాయన్నారు.  అనంతరం ఆయా గ్రామాల్లో కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు పాకాల మహిపాల్​రెడ్డి, ఏఎంసీ చైర్మన్​ రాజయ్య, రాష్ర్ట నాయకులు చింతకింది శ్రీనివాస్​ గుప్తా, లింగాల లక్ష్మణ్, శేఖర్​బాబు, సర్పంచులు 
పాల్గొన్నారు.

ఇండ్ల స్థలాలు కేటాయించండి

పుల్కల్, వెలుగు :  మండలంలోని సింగూర్ ప్రాజెక్ట్ ముంపు గ్రామమైన పెద్దారెడ్డిపేటలో అర్హులైన పేదలకు ఇండ్ల స్థలాలు కేటాయించాలని గ్రామ సర్పంచ్ సతీష్ కుమార్ కోరారు. ఈ మేరకు సోమవారం అందోల్ క్యాంపు ఆఫీస్​లో ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్​కు టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు పుల్లయ్యగారి సుభాష్ చందర్​తో కలిసి ఆయన  వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామానికి సమీపంలో అప్పటి టీడీపీ ప్రభుత్వం ఇండ్లకోసం మూడెకరాలు కొనుగోలు చేసిందని, ఆ స్థలాన్ని ప్లాట్లు చేసి అర్హులైన నిరుపేదలకు కేటాయించాలని కోరారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ శివచందర్​, వార్డు మెంబర్​ మల్లేశం గౌడ్​ ఉన్నారు.  

వైఎస్ షర్మిలపై దళిత సంఘాల ఫిర్యాదు

జోగిపేట, వెలుగు : అందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ ను ఈ నెల 30న వైఎస్సార్ టీపీ చీఫ్ షర్మిల కంతి కిరణ్​ అంటూ అవమానపరిచే విధంగా ఇతర అనుచిత వ్యాఖ్యాలు చేశారని దళిత సంఘాలు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆరోపిస్తూ  సోమవారం ఆమెపై జోగిపేట పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేశారు. షర్మిలపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని దళిత సంఘం నాయకుడు సటికె రాజు కోరారు. విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని జోగిపేట ఎస్సై సామ్య నాయక్
 తెలిపారు.

అమ్మవారికి ఎమ్మెల్యే పూజలు

మెదక్​ టౌన్, వెలుగు : మెదక్ పట్టణంలోని ఫతేనగర్​శ్రీబాలాజీ మందిరంలో శ్రీ దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా సోమవారం మెదక్ ఎమ్మెల్యే  పద్మా దేవేందర్​రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నిత్యాన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎమ్మెల్యేను ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. 

  • ఈశ్వర పురంలో..
    కంది, వెలుగు : సప్తప్రాకారాయుత దుర్గాభవాని మహాక్షేత్రం ఈశ్వరపురంలో దుర్గాష్టమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేసి ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.

పారిశుద్ధ్య కార్మికులకు అన్యాయం

మెదక్​టౌన్, వెలుగు :  గవర్నమెంట్​ హాస్పిటళ్లలో  పని చేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు ప్రభుత్వం అన్యాయం చేస్తోందని, వారికి ఇవ్వాల్సిన కనీస వేతనాలు ఇవ్వడంలేదని సీఐటీయూ జిల్లా  ప్రెసిడెంట్​ మహేందర్​రెడ్డి, జనరల్​సెక్రటరీ బస్వరాజ్​అన్నారు. సోమవారం మెదక్​పట్టణంలోని కేవల్​ కిషన్​ భవన్​లో వారు విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వ హాస్పిటళ్లలో పనిచేసే పారిశుద్ధ్య కార్మికులకు రూ.15,600 వేతనాలు ఇవ్వాల్సి ఉండగా, రూ. 8 వేల నుంచి రూ.10 వేలు మాత్రమే చెల్లిస్తున్నారన్నారు. ప్రభుత్వం విడుదల చేసిన జీవో 60ని అమలు చేయకుండా కార్మికుల శ్రమను దోచుకుతింటున్నారని విమర్శించారు. వెంటనే వారికి పెంచిన వేతనాలు ఇవ్వాలని డిమాండ్​ చేశారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కోశాధికారి నర్సమ్మ, ఉపాధ్యక్షులు నాగరాజు పాల్గొన్నారు.

అభివృద్ధిని అడ్డుకునేవారిని పట్టించుకోవద్దు 
ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి

చేర్యాల, వెలుగు : చేర్యాలలో  నిర్మించే ఆసుపత్రి విషయంలో కొన్ని పార్టీలు రాద్దాంతం చేస్తున్నాయని, అభివృద్ధిని అడ్డుకునే వారిని పట్టించుకుకోమని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి అన్నారు. త్వరలోనే ఆసుపత్రి నిర్మాణానికి భూమి పూజ చేస్తారని తెలిపారు. సోమవారం ఆసుపత్రి కోసం ఎంపిక చేసిన స్థలాన్ని  వార్డు కౌన్సిలర్​ఆడెపు నరేందర్​తో కలిసి ఎమ్మెల్యే పరిశీలించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రూ. 9 కోట్లతో 30 పడకల ఆసుపత్రిని నిర్మించేందుకు ప్రభుత్వం అనుమతిచ్చిందని, అందుకోసం స్థల పరిశీలన చేసినట్లు తెలిపారు. కంట్రాక్టర్​కు, అధికారులకు పలు సూచనలు చేశారు. ఎవరు అడ్డుపడినా అభివృద్ధి పనులు ఆగవని స్పష్టం చేశారు.