ఉమ్మడి మెదక్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి మెదక్ జిల్లా సంక్షిప్త వార్తలు

సిద్దిపేట రూరల్, వెలుగు : పద్మశాలీలు రాజకీయంగా, ఆర్థికంగా మరింత ఎదగాలని రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని వడ్డేపల్లి దయనంద్ గార్డెన్ లో జిల్లా పద్మశాలి సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి ఎమ్మెల్సీ ఎల్.రమణ, పవర్ లూమ్ టెక్స్ టైల్ చైర్మన్ గూడూరి ప్రవీణ్, జడ్పీ చైర్ పర్సన్ రోజా శర్మలతో కలసి ఆయన హాజరై సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సమాజ శ్రేయస్సు కోసం పరితపించే వ్యక్తి డాక్టర్ సతీశ్​జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికవ్వడం సంతోషకరమన్నారు. త్వరలోనే నిరుపేద పద్మశాలీలకు డబుల్ బెడ్ రూమ్ లు అందిస్తామని హామీ ఇచ్చారు. పద్మశాలీ సమాజం కోసం ఉద్యమించిన కొండ లక్ష్మణ్ బాపూజీ విగ్రహాలను రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు.  ఎమ్మెల్సీ ఎల్. రమణ, పవర్ లూమ్ టెక్స్ టైల్ చైర్మన్ గూడూరి ప్రవీణ్ మాట్లాడుతూ గతంలో చేనేత కార్మికులు వలసలు వెళ్లి ఇబ్బందులు పడ్డారని, ఇప్పుడు బతుకమ్మ చీరల ద్వారా సిరిసిల్ల అభివృద్ధి చెందిందని, రూ.5 కోట్లతో పద్మశాలీలకు హైదరాబాద్ లో ఆత్మ గౌరవాన్ని ఇచ్చారని తెలిపారు. తెలంగాణలోనే చేనేత ఆత్మహత్యలు ఆగాయని, ఇతర రాష్ట్రాల పరిస్థితి దారుణంగా ఉందన్నారు. కేంద్రం జీఎస్టీ ద్వారా చేనేతలను ఇబ్బందులు పెడుతుందని ఆరోపించారు. అంతకుముందు పట్టణంలోని క్యాంప్ ఆఫీస్ లో సిద్దిపేట అర్బన్, రూరల్ మండలాల పరిధిలోని 189 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులతో పాటు, నియోజకవర్గ పరిధిలోని చింతమడక, జక్కాపూర్, పట్టణంలోని 13వ వార్డులోని బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల కుటుంబాలకు ఇన్సూరెన్స్ చెక్కులు అందజేశారు. అనంతరం సిద్దిపేట అర్బన్ మండలం పోన్నాల లో వికాస తరంగిణి ఆధ్వర్యంలో జరిగే సుదర్శనయాగం కార్యక్రమానికి హాజరయ్యారు. మంత్రి వెంట వరంగల్ మేయర్ గుండు సుధారాణి, సుడా చైర్మన్ మారెడ్డి రవీందర్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ రాజనర్స్ ఉన్నారు. 

గెలుపోటములను సమానంగా తీసుకోవాలి

సిద్దిపేట రూరల్, వెలుగు : స్టూడెంట్స్ క్రీడల్లో గెలుపోటములను సమానంగా తీసుకోవాలని అడిషనల్ డీసీపీ అడ్మిన్ ఎస్. మహేందర్ అన్నారు. ఆదివారం సిద్దిపేట అర్బన్ మండలం పొన్నాల కిష్టసాగర్ శివారులో ఉన్న విరాట్ ఆనంద్ క్రికెట్ అకాడమీ ద్వీతీయ వార్షికోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచే చదువుతోపాటు క్రీడల్లో ముందంజలో ఉండాలని సూచించారు. అనంతరం క్రికెట్ లో ప్రతిభ కనబరచిన వారికి బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో మెరిడియన్ ప్రిన్సిపాల్ రాజేందర్ రెడ్డి, పెర్క శ్రీనివాస్, జువ్వన రమేశ్, అకాడమీ విద్యార్థులు పేరెంట్స్ పాల్గొన్నారు.

దివ్యాంగులకు సహాయం అందించాలి

చేర్యాల, వెలుగు : స్వామి వివేకానందుడి స్ఫూర్తితో దివ్యాంగులకు అందరూ సహాయం అందించాలని తెలంగాణ లోకాయుక్త సీజే  జస్టిస్​ సి.రాములు పిలుపునిచ్చారు. ఆదివారం మండల కేంద్రంలోని వావిలవంపులో ఉన్న మనోచేతన మానసిక వికలాంగుల సంస్థలో ఆయన ఉప లోకాయుక్తలతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మానవ సేవయే మాధవ సేవ అని భావించి స్వామి వివేకానందుడు ఎన్నో కార్యక్రమాలు చేపట్టి ప్రపంచ ఖ్యాతినిగాంచారని తెలిపారు. గ్రామీణ ప్రాంతంలో దివ్యాంగుల కోసం మనోచేతన సంస్థను స్థాపించి ఉన్నతమైన ఉద్యోగానికి రాజీనామా చేసి నిస్వార్థంగా నిరంతరం సేవలు అందిస్తున్న సంస్థ ఫౌండర్​ చుక్క వెంకటేశ్వర్లు అతడిని అభినందించారు. అనంతరం ఆయన మొక్కలు నాటి దివ్యాంగుల కోసం నిర్మించిన నూతన భవనాన్ని ప్రారంభించారు. జాతీయ మేథోదివ్యాంగుల సాధికారత సంస్థ (ఎన్​ఐఈపీఐడీ) మానసిక దివ్యాంగులకు టీఎల్​ఎం మెటీరియల్​ను అందజేశారు. వెంకటేశ్వర ఆర్థోకేర్​ సంస్థకు చెందిన డాక్టర్లు ఆర్థోకేర్​కు సంబంధించిన విషయాలపై అవగాహన కల్పించారు. అంతకుముందు మానసిక వికలాంగులు వారు తయారుచేసిన పుష్పగుచ్ఛాలను ఇచ్చి ఆయనకు స్వాగతం పలికారు. కార్యక్రమంలో ఉప లోకాయుక్త డాక్టర్​ వీ.నిరంజన్​రావు, ఎ. నవమోహన్​రావు, ఎన్​ఆర్​ఐ పెడతల ప్రతాపరెడ్డి,  డైరెక్టర్​ లీగల్​ వి. వెంకట్​రావు, డైరెక్టర్​ ఇన్వెస్టిగేషన్​ నాగు విద్యాసాగర్​, ఏసీపీ ఎస్​.మహేందర్​, సీఐ శ్రీనివాస్​, ఎస్సై భాస్కర్​రెడ్డి, ఎన్​ఐఈపీఐడీ ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు. 

కూడవెల్లి జాతర ఏర్పాట్లలో నిర్లక్ష్యంపై ఎమ్మెల్యే అసహనం
    గుడి, వాగు పరిసరాల్లోని చెత్త తొలగించాలని ఆదేశం 

దుబ్బాక, వెలుగు: అక్బర్​పేట-భూంపల్లి మండల పరిధిలోని కూడవెల్లి జాతర దగ్గరపడుతుండటంతో ఏర్పాట్లపై నిర్లక్ష్యం వహిస్తున్న ఆలయ నిర్వాహకులపై ఎమ్మెల్యే రఘునందన్​రావు అసహనం వ్యక్తం చేశారు. ఆదివారం ఆయన రామలింగేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించారు. ఆలయ పూజారులు, అధికారులతో జాతర ఏర్పాట్లపై సమీక్షించారు. ఆలయ, వాగు పరిసరాల్లోని చెత్తాచెదారాన్ని వెంటనే తొలగించాలని ఆదేశించారు. భక్తులకు తాగు నీటి సమస్య లేకుండా చూడాలని చెప్పారు.  మహిళలు, పురుషులకు వేర్వేరుగా స్నాన ఘట్టాలను ఏర్పాటు చేయాలని సూచించారు. కొవిడ్ రూల్స్​ను పాటించేలా చూడాలన్నారు. వాగు వద్ద గజ ఈతగాళ్లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. గట్టి బందోబస్తుకు పోలీసులు చర్యలు తీసుకోవాలన్నారు. విద్యుత్​ అంతరాయం లేకుండా చూడాలని చెప్పారు. దక్షణ కాశీగా పిలువబడే కూడవెల్లి ఆలయాన్ని ప్రసాద్​ పథకం కింద ఎంపిక చేసిన కేంద్ర మంత్రి కిషన్​రెడ్డికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. అనంతరం దుబ్బాక పట్టణంలో కొత్తగా ఏర్పాటు చేసిన మల్టీ సూపర్​ స్పెషాల్టీ ఆసుపత్రిని,  చెల్లాపూర్​ గ్రామంలో తన సొంత ఖర్చులతో ఏర్పాటు చేసిన హైమాస్ట్​ లైట్లను ఆయన ప్రారంభించారు. ఆ తర్వాత పలు బాధిత కుటుంబాలను ఎమ్మెల్యే పరామర్శించి ఆర్థికసాయం అందజేశారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు అంబటి బాలేశ్​గౌడ్, చింత సంతోశ్, మట్ట మల్లారెడ్డి, సుభాష్​రెడ్డి, సుంకోజి ప్రవీణ్​మచ్చ శ్రీనివాస్, బావాజీ రాజేశ్​ తదితరులు పాల్గొన్నారు.