
మెదక్, వెలుగు: కాంగ్రెస్ కార్యకర్తలను గుండెల్లో పెట్టుకుంటామని, పార్టీ కోసం పనిచేసిన వారికి పదవులు దక్కుతాయని ఎమ్మెల్యే రోహిత్రావుఅన్నారు. సంస్థాగత ఎన్నికల నేపథ్యంలో మంగళవారం మెదక్ లో జిల్లా స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని, అభివృద్ధి చేయలేదని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే ఏడాదిన్నరైనా కాకముందే హామీలు నెరవేర్చడం లేదని, అభివృద్ధి చేయడం లేదని విమర్శించడం విడ్డూరంగా ఉందన్నారు.
ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత కార్యకర్తలపై ఉందన్నారు. రాష్ట్ర ఫిషరీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ మాట్లాడుతూ సంస్థాగతంగా గ్రామ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ జెండా మోసిన, ఎన్నికల్లో గెలుపుకోసం కృషి చేసిన వారు గ్రామ, మండల, బ్లాక్ కాంగ్రెస్అధ్యక్ష పదవులకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. యువజన కాంగ్రెస్ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి ఊట్ల వర ప్రసాద్ సంస్థాగత ఎన్నికల విధివిధానాలను వివరించారు. నిస్వార్థంగా పార్టీ కోసం పనిచేసిన వారితోపాటు, ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి సైతం తగిన ప్రాధాన్యత ఉంటుందన్నారు.
పార్టీ రాష్ట్ర నాయకుడు మైనంపల్లి హన్మంతరావు మాట్లాడుతూ పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారికి తగిన గుర్తింపు లభిస్తుందన్నారు. అర్హతలు, అనుభవాన్ని బట్టి కొందరికి పార్టీ పదవుల్లో, మరికొందరికి స్థానిక సంస్థల ఎన్నికల్లో అవకాశం కల్పిస్తామన్నారు. సమావేశంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్సుహాసినిరెడ్డి, నర్సాపూర్, దుబ్బాక సెగ్మెంట్ల ఇన్చార్జిలు ఆవుల రాజిరెడ్డి, చెరుకు శ్రీనివాస్ రెడ్డి, జిల్లా మహిళా కాంగ్రెస్అధ్యక్షురాలు భవాని, జిల్లా కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి, జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు పరుశరాం, మెదక్ మున్సిపల్ మాజీ చైర్మన్చంద్రపాల్, టీపీసీసీ మెంబర్ సుప్రభాత్రావు, మెదక్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు హఫీజ్ పాల్గొన్నారు.