శవాన్ని డిక్కీలో పెట్టి కారును తగులబెట్టిన నిందితుడి అరెస్ట్

శవాన్ని డిక్కీలో పెట్టి కారును తగులబెట్టిన నిందితుడి అరెస్ట్
  • మరో ఇద్దరు నిందితుల కోసం గాలింపు కొనసాగుతోంది
  • మెదక్ జిల్లా ఎస్పీ చందన దీప్తి

మెదక్: రియల్ ఎస్టేట్ వ్యాపారి ధర్మకార్ శ్రీనివాస్ ను హత్య చేసి కారు డిక్కీలో శవాన్ని పెట్టి తగులబెట్టిన కేసులో ప్రధాన నిందితుడు పోలీసులకు పట్టుపడ్డాడు. పాత నేరస్తుడు శివ.. మరో ఇద్దరితో కలసి ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ప్రధాన నిందితుడు శివ అరెస్టును జిల్లా ఎస్పీ చందన దీప్తి ధృవీకరించారు. 
మూడు రోజుల కిందట ధర్మకార్ శ్రీనివాస్ మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం యశ్వంతరావ్ పేట శివారులో దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. పొలాల్లో ఓ కారు మంటల్లో కాలిపోతుండగా గ్రామానికి చెందిన ఓ యువకుడు సెల్ ఫోన్లో వీడియో తీసి వాట్సప్ గ్రూపుల్లో పోస్టు చేయడంతో ఈ దారుణహత్య ఉదంతం కలకలం రేపింది. వెల్దుర్తి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని చూడగా డెడ్ బాడీ పూర్తిగా కాలి బూడిదై గుర్తు పట్టలేని విధంగా కనిపించింది. కారు నెంబర్ ప్లేట్ కూడా కాలిపోగా పోలీసులు ఇంజిన్ చాసెస్ నెంబర్ ఆధారంగా ఆ కారును మెదక్ కు చెందిన సినిమా థియేటర్ ఓనర్, రియల్ ఎస్టేట్ వ్యాపారి ధర్మకార్ శ్రీనివాస్ అలియాస్ కటికె శ్రీనుకు చెందినదిగా గుర్తించారు.
మృతుడి భార్య హైందవి ఫిర్యాదు మేరకు శ్రీనివాస్ మర్డర్ పై IPC 302, 201 సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు విచారణకు  నాలుగు టీంలను ఏర్పాటు చేశారు. సెల్ ఫోన్ కాల్ డాటా, సీసీ కెమెరాల పుటేజీ, సీడీఆర్ అనాలసిస్ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. మీడియాలో ప్రసారమైన ఈ దారుణ హత్య ఉదంతం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నేపధ్యంలో పోలీసులు విచారణను ముమ్మరం చేశారు. ఒక్కరితోనే సాద్యం కాదని మరికొందరు పాల్గొని ఉంటారనే ఆధారాలు కనిపించాయి. శ్రీనివాస్ ఇంటి దగ్గర ఉన్న సీసీ పుటేజీని పరిశీలించగా సోమవారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో హైదరాబాద్ వెళ్తున్నానని చెప్పి శ్రీనివాస్ ఇంటినుంచి బయల్దేరాడు. మంగళవారం తిరుపతి వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకోగా సోమవారం సాయంత్రం 5 గంటల తర్వాత నుంచి ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చిందని గుర్తించారు. అదే రోజు రాత్రి ఇంటికి తిరిగి రాకపోవడంతో యశ్వంతరావ్ పేట దగ్గర హత్యకు గురైంది శ్రీనివాసేనని అనుమానం కొద్దిసేపట్లోనే నిజమని నిర్ధారణ అయింది. మరోవైపు శ్రీనివాస్ భార్య హైందవి, కూతుళ్లను, ఇతర కుటుంబ సభ్యులు డెడ్ బాడీ గుర్తు పట్టలేని విధంగా ఉన్నా.. నోటిలో పళ్లలో రెండు కృత్రిమ పళ్లు ఉండటాన్నిగుర్తించిన భార్య హైందవి డెడ్ బాడీ తన భర్త శ్రీనివాస్ దేనని కన్ఫాం చేశారు. తన భర్త శ్రీనివాస్ కు రియల్ ఎస్టేట్ వ్యాపారులు కొందరితో గొడవలు ఉన్నాయని, అలాగే ఇద్దరు మహిళలతో వివాహేతర సంబంధం ఉండేదన్న అనుమానం ఉందని పోలీసుల దృష్టికి తీసుకొచ్చారు. 
ఈ ఆధారాలతో వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్న పోలీసులు నలుగురు పాత నేరస్తులైన అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారించగా వారిలో ప్రధాన నిందితుడు శివపై ఆధారాలు దొరకడంతో బుధవారం అరెస్ట్ చేశారు. A-2 నిందితుడు పవన్, A-3 నిందితుడు నిఖిల్ లు పరారీ లో ఉన్నారు. శివ, నిఖిల్ ఇద్దరు కార్ లో శ్రీనివాస్ ను ఎక్కించుకుని వెళ్లారు..కారు దగ్దం చేసిన ప్రాంతంలోనే శ్రీనివాస్ ను హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. హత్య కు ప్రధాన కారణం వ్యాపార లావాదేవీలే కారణమని.. టెక్నీకల్ ఎవిడెన్స్, సయింటిఫిక్ ఎవిడెన్స్ ఆధారంగా కేసును ఛేదించామని, ప్రధాన నిందితుడు శివ ను పోలీసు కస్టడీకి తీసుకుంటామని జిల్లా ఎస్పీ చందన దీప్తి చెప్పారు. గతంలో శివ పై రౌడీ షీట్ ఓపెన్ అయిందని, ప్రస్తుతం కేసు విచారణ కొనసాగుతోందని ఆమె తెలిపారు.