సమ్మక్కా..వత్తున్నం!

సమ్మక్కా..వత్తున్నం!

‘సమ్మక్క.. సారక్క..’  రాష్ట్రంలో ఇప్పుడు ఎవరి నోట విన్నా ఇదే మాట..  అందరిదీ మేడారం బాటే..! ఎప్పుడెప్పుడా అన్న రోజు రానే వచ్చింది..  బుధవారం సారలమ్మ రాకతో మేడారం మహాజాతర షురూ కానుంది.. రాష్ట్రం నలుమూలల నుంచి ‘సమ్మక్కా.. మేమస్తన్నం’ అంటూ భక్తులు మేడారం తొవ్వవట్టిన్రు.. జాతరచ్చే నాలుగు దారుల పొంట బస్సులు, కార్లు, ఆటోలు, ఎడ్ల బండ్లు..గిట్ల ఎండ్లవీలైతే అండ్లవడి తల్లుల చెంతకు చేరుతన్రు..  నెత్తిన ముల్లెలు, సంకన పిల్లలతో బస్సులు దిగుతన్రు.. పెద్ద పెద్ద యాటపోతులను ట్రాలీ ఆటోల్లోంచి దింపి వాటి ఎన్క  ఉరుకుతన్రు..అందరూ తావుల కోసం వెతుక్కుంటన్రు.. ఏడ గింత జాగ కనవడ్తే ఆడనే గుడారాలు ఏస్కొని పొయ్యిరాళ్లు పొందిచ్చుకుంటన్రు.. ఆడీడ నాలుగు పుల్లలేరుకచ్చి బువ్వ, కూర గూడ ఉడికిచ్చుకుంటన్రు.. మంగళవారం పొద్దుగాల అక్కడక్కడ పలుచగ కనవడ్డ జనం, పొద్దూకేసరికి ఇసుక వోస్తే రాలనట్టయిన్రు.. నిన్నమొన్నటి దాకా ఎవరికీ పట్టని కుగ్రామం మెల్లమెల్లగా ఓ మహానగరంగా మారుతున్నది.. 

మంగళవారం పొద్దూకేవరకు 

15 లక్షల మందికి పైగా జనం మేడారం చేరినట్లు ఆఫీసర్లు చెప్పిన్రు.. భక్తుల విడిది కోసం సమ్మక్క, సారక్కల పేర్లతో సర్కారు నిర్మించిన భవనాలు ఇప్పటికే నిండినయ్​.. హరిత కాకతీయతో పాటు ప్రైవేట్‌‌ హోటళ్లన్నీ‌ బుక్కయినయ్​..మేడారం, ఊరట్టం, కొండాయి, నార్లాపూర్‌‌, రెడ్డి గూడెం.. ఇట్ల చుట్టూ పదూళ్ల పెట్టు ఎక్కడా ప్రైవేట్‌‌ రూములు దొర్కుతలెవ్వు..అటు రంగురంగుల లైట్లలో మెరిసిపోతున్న గద్దెలు తల్లుల రాకకోసం ఎదురుచూస్తంటే, ఆ వెలుగు జిలుగుల్లో జంపన్నవాగు మురిసిపోతున్నది.. ఇప్పటికే సమ్మక్క పెనిమిటి పగిడిద్ద రాజు పెండ్లికొడుకై పూనుగొండ్ల బయలెళ్లిండు.. ఇయ్యాళ కన్నెపల్లి నుంచి సారలమ్మ, కొండాయి నుంచి ఆమె పెనిమిటి గోవిందరాజు గద్దెకు చేరుకుంటరు..గురువారం  పసుపు, కుంకుమ రూపంలో ఉన్న సమ్మక్క తల్లి చిలకలగుట్ట నుంచి గద్దెకు రాంగనే భక్తుల కోలాహలం అకాశాన్నంటుతది. శివసత్తుల సిగాలు,  ఎదుర్కోళ్ల వేడుక నడమ సాగే ఆ మహా ఘట్టం కోసం ఇక్కడి సెట్టు, పుట్ట కూడా బిగవట్టి సూత్తన్నయ్​!  
 - మేడారం  టీమ్​, వెలుగు