జాతరకు చలోరె..!మేడారం సంబురం నేటి నుంచే..

జాతరకు చలోరె..!మేడారం సంబురం నేటి నుంచే..

జాతరంటే దుబ్బ కొట్లాడాలె.. జబ్బా జబ్బా రాసుకోవాలె..                 ఇసుక వేస్తే రాలొద్దు.. సముద్రం పారినట్టు.. పుడమి ఈనినట్టు..పుట్టలు పగిలి చీమలు బయటికి వచ్చినట్టు జనంతో నిండిపోవాలె.. అట్లా జరిగేదే మన మేడారం మహాజాతర. రెండేండ్లకోసారి నాలుగు రోజుల పాటు నిర్వహించే ఈ తెలంగాణ కుంభమేళా బుధవారం మొదలుకాబోతోంది. ఇప్పటికే ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని మేడారం చేరుకున్న లక్షలాది భక్తజనం..తమ గుండెల్లో కొలువైన వన దేవతల నిజ దర్శనానికి ఎదురుచూస్తున్నారు. మాఘశుద్ధ పౌర్ణమి వేళ సారలమ్మను, గురువారం సమ్మక్కను చూసి తరించేందుకు రెడీ అయ్యారు. 

మేడారం (జయశంకర్‌‌ భూపాలపల్లి), వెలుగు : మహాజాతరకు వేళయ్యింది. ప్రపంచంలో అతిపెద్ద ట్రైబల్ ఫెస్టివల్, రాష్ట్ర పండుగ అయిన మేడారం జాతర బుధవారం షురూ కాబోతోంది. దీనికోసం ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. నేడు(బుధవారం) సారలమ్మ, పగిడిద్ద రాజు, గోవిందరాజులను గద్దెలకు చేర్చే మహా ఘట్టంతో జాతర మొదలవుతుంది. తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాలతో పాటు, మహారాష్ట్ర నుంచి గోండులు, కోయలు, లంబాడాలు, మధ్యప్రదేశ్ నుంచి బిల్లులు, రత్తిసాగర్ గోండులు, ఒడిశా నుంచి సవర ఆదివాసీలు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. ఇంకా లక్షల మంది గిరిజనేతరులు మేడారం బాట పట్టారు. గ్రామాల నుంచి వారం కింద స్టార్టయిన ఎడ్లబండ్లు ఒక్కొక్కటి వనదేవతల సన్నిధికి చేరుకుంటున్నాయి. ట్రాక్టర్లు, కార్లు, ఇతర ప్రైవేట్‌‌ వెహికల్స్‌ అన్నీ మేడారం దారి పట్టాయి. ఆర్టీసీ బస్సులన్నీ మహాజాతర వైపే కదిలివస్తున్నాయి. ఇప్పటికే 10 లక్షల మంది మేడారం వచ్చి గుడారాలు వేసుకొని ఉన్నారు. మేడారం, ఊరట్టం, కొండాయి, నార్లాపూర్‌‌, రెడ్డి గూడెం తదితర ప్రాంతాలు కిటకిటలాడుతున్నాయి. ఈ జాతరకు కోటి ఇరవై లక్షల మందికి పైగా భక్తులు హాజరవుతారని ప్రభుత్వ అంచనా. వీరి కోసం రూ.75 కోట్లతో ఏర్పాట్లు చేసింది.    

జాతరగా మారిన ‘నివాళి’ 

వెయ్యేండ్ల కింద స్వయంపాలన కోసం పోరాడిన వీర వనితలైన సమ్మక్క, సారలమ్మలకు నివాళులర్పించే కార్యక్రమమే జాతరగా మారింది. దేవతలుగా పూజలందుకుంటున్న ఈ కోయ వీరనారీమణులు నిజానికి మనుషులే. కానీ ప్రజల కోసం బతకాలి. ప్రజల కోసం చావాలి అనే విధానమే వారిని దేవతలను చేసింది. వీరత్వం దైవత్వంగా మారింది. జాతరలో అమ్మలకు విగ్రహాలు, ప్రతిరూపాలు ఉండవు. వేద మంత్రోచ్ఛరణలు, విగ్రహారాధన ఉండదు. గద్దెలపై ఉంచే కంకవనం, కుకుమభరిణలనే దేవతలుగా నమ్మి పూజిస్తారు. పసుపు, కుంకుమ, బెల్లం లాంటి వాటితో మొక్కులు చెల్లించుకుంటారు.  గుడి మెలిగె, మండ మెలిగెల నుంచి మొదలుకుంటే అమ్మవార్లను గద్దెల పైకి తీసుకొచ్చి ప్రతిష్ఠించడం, వనప్రవేశం ఇలా అన్నీ కోయ సంప్రదాయం ప్రకారమే జరుగుతాయి. సర్కారు ఏర్పాట్లు చేయడం తప్ప పూజల్లో ఎక్కడా నేరుగా నేరుగా పాలుపంచుకోదు. జాతర ఆదాయంలో కూడా కోయపూజారులకే మూడో వంతు వాటా ఉంటుంది.

ఒక్కటేమిటి..అన్నీ ప్రత్యేకతలే

జంపన్న వాగులో స్నానాలు, తలనీలాల సమర్పణ, ఎదుర్కోళ్లు, మొక్కులు చెల్లించడం, లక్ష్మీదేవరలు, శివసత్తుల పూనకాలు, ఒడిబియ్యం సమర్పణ, బంగారంగా పిలిచే బెల్లంతో తులాభారం, కోయదొరల భవిష్యవాణి, మహిళల వేషధారణలో ఉండే పురుషుల ఆట పాట లాంటి దృశ్యాలు మేడారం మహా జాతరను కోలాహలంగా మారుస్తాయి. 

నాలుగు రోజులు పండుగే..

సమ్మక్క సారలమ్మ మహా జాతర షెడ్యూల్‌‌ను ప్రతీ రెండేండ్లకోసారి గిరిజన పూజారుల టీమ్ ​ప్రకటిస్తుంది. వీరి డేట్ల ప్రకారమే సర్కారు జాతర నిర్వహిస్తుంది. ఈ సారి ఫిబ్రవరి 16 నుంచి19 వరకు జాతర నిర్వహించనున్నారు. 18న సీఎం కేసీఆర్‌‌ మేడారం రానున్నారు.   

సమ్మక్క తల్లి రాక రేపే 

మహాజాతర మొదలయ్యాక రెండో రోజైన గురువారం చిలుకలగుట్టలో కుంకుమ భరిణె రూపంలో ఉన్న సమ్మక్క తల్లిని తీసుకొచ్చి మేడారం  గద్దెపై ప్రతిష్ఠిస్తారు. ముందు రోజు సమ్మక్క గుడి నుంచి అడెరాలు(కుండలను) తీసుకొచ్చి గద్దెపై ఉంచుతారు. ముగ్గులు వేసి పూజలు చేస్తారు. గురువారం కంకవనం తీసుకురావడానికి వనం గుట్టపైకి వెళ్తారు. ములుగు జిల్లా ఎస్పీ మూడు రౌండ్లు గాలిలోకి తుపాకీ పేల్చి అమ్మను తీసుకొస్తున్నట్లు సిగ్నల్స్​ ఇస్తారు. దీంతో మేడారం అంతా పులకించిపోతుంది. అమ్మవారిని తీసుకొచ్చే దారి పొడవునా భక్తులు ముగ్గులు వేస్తారు. అర్ధరాత్రి వేళ అమ్మవారిని గద్దెపై ప్రతిష్ఠిస్తారు.  

18న మొక్కులు చెల్లింపు ..19న వన ప్రవేశం

మూడో రోజైన శుక్రవారం భక్తులు మొక్కులు చెల్లించుకుంటారు. ఇతర రాష్ట్రాల సీఎంలు, గవర్నర్లు, కేంద్ర, రాష్ట్ర మంత్రులు దర్శనానికి వస్తారు. భక్తులు అమ్మవార్లకు పసుపు, కుంకుమ, నూనె కలిపిన ఒడి బియ్యం, బంగారం సమర్పిస్తారు. నాలుగో రోజైన శుక్రవారం సాయంత్రం యథాస్థానానికి చేరుస్తారు.  

పగిడిద్దరాజు, గోవిందరాజుల రాక నేడే

కొత్తగూడ (గంగారం) : సమ్మక్క భర్త పగిడిద్దరాజు మహబూబాబాద్​ జిల్లా గంగారం మండలంలోని పూనుగొండ్లలో, గోవిందరాజులు ఏటూరునాగారం మండలంలోని కొండాయిలో కొలువై ఉన్నారు. వీరిద్దరు బుధవారం గద్దెలపైకి రానున్నారు. మంగళవారమే పెనుక వంశానికి చెందిన పూజారులు పూనుగొండ్ల నుంచి పగిడిద్దరాజును తీసుకుని కాలినడకన మేడారం బయలుదేరారు. వీరు 75 కిలో మీటర్లు జర్నీ చేసి జాతర ప్రాంగణానికి చేరుకుంటారు. మంగళవారం నడక మొదలుపెట్టాక 25 కిలోమీటర్లు చేరుకుని కర్లపల్లి తండాలో ఆగారు. భక్తులతో కలిసి రాత్రి 11 గంటలకు పస్రా సమీపంలోని లక్ష్మీపురం చేరుకున్నారు. దాదాపు 20 నుంచి 30 వాగులు,15 నుంచి 20 వరకు దట్టమైన గుట్టలను ఎక్కుతూ లక్ష్మీపురం వెళతారు. ఇక్కడ బస చేసి తెల్లవారే మేడారం బయలుదేరుతారు. బుధవారం సాయంత్రం వరకు మేడారం చేరుకుంటారు. అక్కడ సమ్మక్క పూజారులు ఎదుర్కోళ్లు నిర్వహిస్తారు. పూజలు చేసి గద్దెపై కూర్చోబెడతారు. అలాగే కొండాయి గ్రామంలోని గోవిందరాజు గుడిలో కూడా పూజారులు బుధవారం పూజలు చేసి వెదురు బుట్టలో గద్దెపై ప్రతిష్ఠించడానికి తీసుకొని వస్తారు.  మూడు రోజుల మహాజాతర ముగిశాక తిరిగి కాలి నడకనే పగిడిద్దరాజును పూనుగొండ్లకు చేరుస్తారు. తిరుగువారం జాతరను 23 నుంచి25 వరకు నిర్వహిస్తారు. 

నేడు గద్దెలపైకి సారలమ్మ 

మేడారం మహాజాతరలో తొలి ఘట్టం సారలమ్మ గద్దెపైకి రావడం. బుధవారం సాయంత్రం కన్నెపల్లిలోని సారలమ్మ గుడి వద్ద ఆదివాసీ సంప్రదాయాల ప్రకారం వడ్డెలు(పూజారులు) పూజలు చేస్తారు. సారలమ్మ పూజారి కాక సారయ్య మొంటె(వెదురు బుట్ట)లో అమ్మవారి ప్రతిరూపమైన పసుపు, కుంకుమ తీసుకుని మేడారానికి బయలుదేరుతాడు. ఈ సందర్భంగా భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తారు. చాలామంది పూజారిని తాకడానికి ప్రయత్నం చేస్తారు. తోసుకుంటారు. ఇలా జరగకుండా, పూజారి దగ్గరికి వెళ్లకుండా పోలీస్​ రోప్​ పార్టీలు రక్షణగా నిలుస్తాయి. అమ్మను తీసుకువచ్చే దారి పొడవునా భక్తులు దండాలు పెడుతూ స్వాగతం పలుకుతారు. పిల్లల కోసం తపించే మహిళలు  సారలమ్మను తీసుకొచ్చే మార్గంలో రోడ్డుపై పడుకుంటారు. పూజారులు వీరిపై నుంచి నడుచుకుంటూ వస్తారు. మార్గ మధ్యలో జంపన్నవాగులో ప్రత్యేక పూజలు చేసి వాగు దాటి వెళ్తారు. అక్కడి నుంచి మేడారంలోని సమ్మక్క టెంపుల్​కు చేరుకుంటారు. ఇక్కడ పగిడిద్దరాజు, సమ్మక్క పెండ్లి కన్నుల పండుగగా జరిపిస్తారు. తర్వాత సారలమ్మ ప్రతి రూపాన్ని అర్ధరాత్రి మేడారం గద్దెపై చేరుస్తారు. దీంతో జాతర మొదలవుతుంది.